Updated : 27/11/2021 05:17 IST

అప్పులకు తలుపులు మరింత బార్లా!

రుణాలకు గ్యారంటీ పరిమితిని రెట్టింపు చేసిన రాష్ట్రం

జీఎస్‌డీపీలో 0.5 శాతమే గ్యారంటీలకు అవకాశం

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అంటున్న నిపుణులు

అప్పులపై కాగ్‌ హెచ్చరించిన రోజునే ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పులకు తలుపులు మరింత బార్లా తెరిచింది. ఆర్థిక నిర్వహణ తీరు, అప్పులు సమీకరిస్తున్న తీరు సరిగా లేదని... ఇలాగే వ్యవహరిస్తే ఆర్థిక అస్థిరత తప్పదంటూ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదికను ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన రోజే అప్పులకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీల పరిమితిని రెట్టింపు చేసింది. మరింత అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి సవరణలు చేసింది. ఈ పరిణామంతో నిపుణులు విస్తుపోతున్నారు. ఈ మధ్యే ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ ప్రతినిధులు తామిచ్చిన రుణాల వసూలుకు నేరుగా రాజధానికి వచ్చి ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. ప్రభుత్వ కంపెనీ రుణం చెల్లించడంలో డిఫాల్ట్‌ అయితే అది దేశ విద్యుత్తు రంగంపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని సైతం ఆర్‌ఈసీ ఛైర్మన్‌ సైతం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇలాంటి తరుణంలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి సవరణలు చేస్తూ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శుక్రవారం సభలో బిల్లు పెట్టారు. ఆ వెంటనే ఆమోదం పొందింది. ఈ చట్టం నాలుగో భాగంలో ‘డి’ క్లాజును మార్చారు. 2005 చట్టంలో ‘90%’ అని ఉన్నచోట ‘180%’ అని మారుస్తున్నట్లు ప్రతిపాదించారు. దానికి సభ ఆమోదం తీసుకున్నారు. ఈ చట్ట సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా అప్పులు తీసుకునే వెసులుబాటు లభించింది. ఇంతకుముందు కార్పొరేషన్లు అప్పులు తీసుకునేందుకు గ్యారంటీలు ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేసుకుంది. ఉదాహరణకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు లక్ష కోట్లు ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీల మొత్తం అందులో 90%.. అంటే రూ.90 వేల కోట్ల వరకు ఉండొచ్చు. తాజా సవరణతో ఆ గ్యారంటీల పరిమితిని రూ.1.80 లక్షల కోట్లకు పెంచారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.25వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది. తన గ్యారంటీ పరిమితి దాటిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందంటూ వివాదమైన విషయం తెలిసిందే. తాము గ్యారంటీలు ఇచ్చామే తప్ప ఆ గ్యారంటీలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోలేదంటూ ప్రభుత్వం ఒక వాదన వినిపించింది. కేంద్ర ఆర్థిక వ్యయవిభాగం కూడా ఈ అంశాన్ని తప్పుపట్టింది.

కేంద్ర చట్టమే వేరన్న నిపుణులు

రాష్ట్రప్రభుత్వం రెవెన్యూ రాబడిలో 90% గ్యారంటీ ఇచ్చే విధానాన్ని 2005 నుంచి అనుసరిస్తున్నా కేంద్ర మార్గదర్శకాలు పూర్తిగా వేరని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఈ గ్యారంటీలపై 2010లో కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. వాటి ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.5%కు మించకుండా మాత్రమే ప్రభుత్వం ఇలాంటి గ్యారంటీలు ఇవ్వాలని చెబుతున్నారు. ఆ లెక్కన ఏపీ ప్రభుత్వం సుమారు రూ.5,300 కోట్లకు మించి గ్యారంటీ ఇచ్చే అవకాశమే లేదనేది కొందరు నిపుణుల వాదన. పోనీ రాష్ట్రప్రభుత్వం ఈ మార్గదర్శకాలు పట్టించుకోకుండా తన పాత 2005 చట్టాన్ని అనుసరిస్తోందనుకున్నా ఇప్పుడు తన రుణ గ్యారంటీ పరిమితిని రెట్టింపు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చినా, వాటిలో చాలా సంస్థలు వ్యాపారాలు చేయట్లేదు. దాంతో ఆదాయం రావట్లేదు. అవి స్వయంగా ఆ రుణాలు తీర్చలేవు. ఆ అప్పులు తీర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించవలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రాబోయేరోజుల్లో ఈ అప్పుల భారం ఏ స్థాయికి చేరుతుంది? ఎలా తీర్చగలరన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని