Updated : 27/11/2021 05:17 IST

తగ్గిన పెట్టుబడి వ్యయం

మౌలిక సౌకర్యాల కల్పనకు ఏదీ నిబద్ధత?

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు పేలవం

దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధిపై ప్రభావం

సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాక ఖర్చు నిష్ఫలం

అంచనాలకు తగ్గ రాబడులూ సాధించలేదు

ఎండగట్టిన కాగ్‌ నివేదిక

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రప్రభుత్వం ఖర్చు ద్రవ్య బాధ్యత చట్టాలకు అనుగుణంగా ఉండాలి. పెట్టుబడి వ్యయం రూపంలో ఖర్చు చేస్తూ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని, సామాజిక రంగం కోసం చేయాల్సిన ఖర్చును పణంగా పెట్టకుండా ఉండాలి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2015-16లో మొత్తం వ్యయంలో 12.77% ఖర్చు చేశారు. 2019-20 నాటికి అది 7.89%కు చేరింది. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఈ తీరు రాష్ట్ర నిబద్ధత పేలవంగా ఉన్నట్లు ప్రతిబింబిస్తోంది’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక ఎండగట్టింది. సాధారణ కేటగిరీ రాష్ట్రాల మూలధన వ్యయం కన్నా ఆంధ్రప్రదేశ్‌లో చాలా తక్కువగా ఉందని, దీనివల్ల ఆస్తుల కల్పనపై ప్రభావం పడి, దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయమే 88.65% ఉండటంతో ఆస్తుల కల్పనకు 11.35% మాత్రమే మిగిలాయని స్పష్టం చేసింది. రోడ్లు, భవనాలు వంటి స్థిర మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడి వ్యయం చేస్తారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ అంచనాల్లో రూ.32,293 కోట్లు పెట్టుబడి వ్యయంగా పేర్కొంటే రూ.12,242 కోట్లే ఖర్చుచేసినట్లు విశ్లేషించింది. కార్పొరేషన్లు, ప్రత్యేక ప్రయోజన సంస్థల ద్వారా మూలధన వ్యయం చేయడం వల్ల రాష్ట్రప్రభుత్వ పద్దుల్లో తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా, ఆ వివరాలేవీ ఆడిట్‌ చేసేందుకు సమర్పించలేదని నిలదీసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఆస్తి సృష్టించని చిన్న చిన్న పనులు చేసి రూ.1,007.74 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రభుత్వం చూపించిందని పేర్కొంది. రూ.938.85 కోట్లను పెట్టుబడి వ్యయ పద్దుల నుంచి వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాలకు మళ్లించిందని ప్రస్తావించింది. బడ్జెట్‌ రద్దుచేయకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ వేసిందని, మరోవైపు ఆ మేరకు పెట్టుబడి వ్యయం లెక్కలను పెంచి చూపిందని కూడా ప్రభుత్వాన్ని కాగ్‌ నిందించింది.

పెట్టుబడుల నుంచి ప్రతిఫలాలు ఏవీ?

2003 నుంచి 2017 మధ్య రాష్ట్రంలో నిర్మాణం మొదలుపెట్టిన 73 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం 2020 మార్చి నాటికీ కొనసాగుతూనే ఉందని కాగ్‌ పేర్కొంది. వాటిని పూర్తి చేయకపోవడంతో ఆశించిన ప్రయోజనాలు రాష్ట్రానికి దక్కట్లేదని తప్పుపట్టింది. ఈ రంగంలో పెట్టుబడుల నుంచి ప్రతిఫలాలకు భరోసా లేకుండా పోయిందని కాగ్‌ నిందించింది. రెవెన్యూ రాబడుల విషయంలో అంచనాలను ప్రభుత్వం అందుకోలేకపోయిందని విమర్శించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల, పన్నేతర రాబడినీ కాగ్‌ విశ్లేషించింది. ఈ విషయంలో ఆర్థికసంఘం అంచనాలు, సొంత బడ్జెట్‌ అంచనాలనూ ప్రభుత్వం అందుకోలేకపోయిన విషయాన్ని గణాంకాలతో సహా పేర్కొంది. రాబోయే రోజుల్లో ఈ అంచనాలను అందుకుంటామని ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలియజేసింది.


పేదల ఇళ్లు ప్రభుత్వ ఆస్తులు కావు

‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నవరత్నాల పథకం కింద ఐదేళ్లలో రూ.61,000 కోట్ల అంచనా వ్యయంతో 25 లక్షల పక్కాగృహాలు నిర్మించడానికి ప్రణాళిక వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం రూ.3,371.60 కోట్లు ఖర్చుచేసినట్లు పెట్టుబడి వ్యయ విభాగంలో చూపించింది. రాష్ట్రప్రభుత్వం పేరుతో కాకుండా లబ్ధిదారుల పేరుతో ఇళ్లస్థలాలు రిజిస్టర్‌ చేస్తున్నందున ఇది పెట్టుబడి వ్యయం కిందకు రాదు. ఈ పథకం కింద చేసే ఖర్చును రెవెన్యూ ఖర్చుగానే పరిగణించాలి’ అని ఈ నివేదిక పేర్కొంది.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని