Updated : 27/11/2021 05:19 IST

ఏడాదికి 221 రోజులు చేబదుళ్లే!

ఈ పరిస్థితుల్లోనూ డిస్కంలకు రూ.4,300 కోట్ల రుణాలా?

వివేకవంతమైన చర్య కాదన్న కాగ్‌

ఈనాడు-అమరావతి: ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. చేబదుళ్లతోనే కాలం గడుస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ పాత అప్పులు తీర్చుకునేందుకు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇవ్వడం ఏమిటి...? అంటూ కాగ్‌ నిలదీసింది. ‘‘ఏపీ ప్రభుత్వం ఏడాదిలో 221 రోజులు చేబదుళ్లు తీసుకుంటోంది. మరోవైపు డిస్కంల నగదు ప్రవాహ లోటును భర్తీ చేసేందుకు, పాత రుణాలను తిరిగి చెల్లించేందుకు రూ.4,300 కోట్ల రుణాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది వివేకమంతమైన చర్య కాదు’’ అని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఆరు సంస్థలకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.5,327 కోట్ల రుణాలు ఇవ్వడాన్ని తప్పు పట్టింది. అసలు ఆయా సంస్థలు రుణాలు తిరిగి చెల్లించాల్సిన కాలావధి, వడ్డీ రేటు, వాయిదాల సంఖ్య తదితరాలను పట్టించుకోకుండానే ఈ రుణం ఇచ్చిందని నిందించింది. ఈ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.22,351 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందంది. ఈ బకాయిల్లో 2002లో ఇచ్చిన రుణాలు కూడా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వానికి రుణం చెల్లించేందుకు ప్రభుత్వమే వాటికి రుణమిచ్చింది. వారు తిరిగి అదే రోజు ప్రభుత్వానికి చెల్లించేశారు. 2020 మార్చి 31న ఏపీఎస్‌పీడీసీఎల్‌, ఏపీఈపీడీసీఎల్‌లకు ఏపీ ట్రాన్సుకో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,200 కోట్లు, రూ.300 కోట్ల మేర రుణాలు ఇచ్చింది. ఆ సంస్థలు తిరిగి అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించాయి. డిస్కంల్లో నగదు ప్రవాహ లోటును భర్తీ చేసేందుకు, పాత రుణాలను తిరిగి చెల్లించేందుకు ఈ వెసులుబాటు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు కాగ్‌ విశ్లేషించింది.

పెట్టుబడులకు ప్రతిఫలం ఏదీ?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్పొరేషన్లు, కంపెనీల్లో రూ.9,501 కోట్ల పెట్టుబడులు పెట్టిందని కాగ్‌ వివరించింది. వీటిపై కేవలం రూ.4 కోట్ల ప్రతిఫలం మాత్రమే వచ్చినట్లు తేల్చింది. గత ఐదేళ్లలో ప్రభుత్వ పెట్టుబడులపై వచ్చిన ప్రతిఫలం 0.04% మాత్రమేనని తెలిపింది. ప్రభుత్వం తాను తీసుకున్న రుణాలపై చెల్లించిన సగటు వడ్డీ రేటు 6.31% కన్నా చాలా తక్కువగా ఉందని తప్పుపడుతూ ఇలా చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అదనపు భారం వేస్తున్నారని ఎండగట్టింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని