కదిలిన ‘జన’శ్రేణులు.. కడలిలా కర్షకులు

‘రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాటలను గుర్తుచేస్తూ.. ఆ పార్టీ నాయకులు రైతుల్లో ఉత్సాహం నింపారు. పాదయాత్రలో రైతులకు

Published : 27 Nov 2021 03:40 IST

అమరావతి రైతుల యాత్రకు నెల్లూరు నీరాజనం

పాదయాత్రలో కదంతొక్కిన జనసేన కార్యకర్తలు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ‘రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాటలను గుర్తుచేస్తూ.. ఆ పార్టీ నాయకులు రైతుల్లో ఉత్సాహం నింపారు. పాదయాత్రలో రైతులకు తోడుగా జనసేన శ్రేణులు కదం తొక్కారు. రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర 26వ రోజు రాజుపాళెం నుంచి నెల్లూరు వరకు 15 కి.మీ. సాగింది. 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించి శుక్రవారం యాత్రను ప్రారంభించారు. రాజుపాళేనికి చెందిన ఎస్సీలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు పూనుకోవాలి’ అంటూ కలిసి నడిచారు. యాత్రకు నెల్లూరు, కోవూరు ప్రాంత వాసులు నీరాజనం పట్టారు. కోవూరు, నెల్లూరు నగరంలో వ్యాపారులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో చేరుకుని సంఘీభావం తెలిపారు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ యాత్రలో పాల్గొన్నారు. నెల్లూరులో వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కోవూరు, నెల్లూరులోని ప్రతి కూడలిలో యాత్ర బృందానికి హారతులిచ్చి స్వాగతం పలికారు. సికింద్రాబాద్‌కు చెందిన బీసీ సంఘం నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఇంకా వర్క్‌ ఫ్రం హోంలోనే సీఎం

కొవిడ్‌ తగ్గినా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వర్క్‌ ఫ్రం హోం వీడట్లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఎద్దేవా చేశారు. నాదెండ్ల నేతృత్వంలో జనసేన నాయకులు, కార్యకర్తలు కోవూరు వద్ద మహాయాత్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ... ఇంటి పక్కనున్న రాజధాని రైతులకు న్యాయం చేయలేని సీఎం రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. అమరావతి రాజధానిగా ఉండాలన్నదే జనసేన సంకల్పమని స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్‌ రైతులకు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. తప్పుడు బిల్లులు పెట్టి అసెంబ్లీ సమయాన్ని వృథా చేస్తున్నారని హితవుపలికారు. జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్‌ పాలనలో.. బిల్లులూ రివర్స్‌ చేయడం సరికాదని హితవు పలికారు.

నేతన్నల మద్దతు: నెల్లూరు చేనేత సమాఖ్య నేతలు యాత్రలో పాల్గొన్నారు. జిల్లా నేతన్నలు యాత్ర చేస్తున్న మహిళలకు చీరలు పెట్టి మద్దతు తెలిపారు. ఆ చీరలను కోవూరు ప్రాంతంలో వరద బాధిత మహిళలకు అందించారు. మాజీ ఎంపీ పనబాక లక్ష్మి యాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని