అకుంఠిత దీక్షకు మహా ‘బాసట’

అమరావతి రైతుల మహాపాదయాత్ర 27వ రోజున శనివారం నెల్లూరు నగరంలో కొనసాగింది. స్థానిక జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నుంచి ప్రారంభమైన యాత్రకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, కుల సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, నగరవాసులు సంఘీభావం తెలిపారు.

Updated : 28 Nov 2021 04:23 IST

అమరావతి రైతుల పాదయాత్రకు నెల్లూరు నగరవాసుల సంఘీభావం

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: అమరావతి రైతుల మహాపాదయాత్ర 27వ రోజున శనివారం నెల్లూరు నగరంలో కొనసాగింది. స్థానిక జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నుంచి ప్రారంభమైన యాత్రకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, కుల సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, నగరవాసులు సంఘీభావం తెలిపారు. పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం మొదలైనా తడుస్తూనే ముందుకు సాగారు. కాసేపటికి తెరిపివ్వడంతో బారాషాహిద్‌ దర్గా దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ముస్లింలు ఘనస్వాగతం పలికారు.ముస్లిం సంప్రదాయం ప్రకారం అక్కడే వారికీ భోజన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నమూ వర్షం ఇబ్బంది పెట్టినా.. పాదయాత్రికులు ముందుకు సాగారు. పొదలకూరు రోడ్డు దగ్గరకు చేరుకునే సరికి 300 కి.మీ. పూర్తి కావడంతో... స్థానికులు బంతిపూలతో స్తంభాలను అలంకరించి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా పాదయాత్రకు నెల్లూరు కాంగ్రెస్‌ నాయకులు సంఘీభావం ప్రకటించారు.మాజీ మంత్రులు దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్‌ రైతులతో అడుగు కలిపారు. నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ తరఫున న్యాయవాదులు, భాజపా కిసాన్‌ మోర్చా, బీఎస్పీ, కార్మిక, రైతు కూలీ సంఘాల ప్రతినిధులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం మహాపాదయాత్రకు విరామం ప్రకటించారు.


‘ఎన్నారైస్‌ ఫర్‌ అమరావతి’ రూ.54 లక్షల విరాళం

మహా పాదయాత్రకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు భారీ విరాళం ప్రకటించారు. ఎన్నారైస్‌ ఫర్‌ అమరావతి పేరిట రూ.54 లక్షలు అందించారు. రైతు కుటుంబ నేపథ్యం ఉండి... విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు ఒక బృందంగా ఏర్పాటై చందాలు వేసుకుని సేకరించారు. ఈమేరకు బృందం ప్రతినిధులు శనివారం నెల్లూరు జిల్లాలో అమరావతి పరిరక్షణ సమితి నేతల్ని కలిసి విరాళం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని