పొరుగును చూసి మోత!

కొత్త వాహనాలకు జీవిత పన్నుని (లైఫ్‌ ట్యాక్స్‌) ఎడాపెడా పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ విషయంలో కర్ణాటకను ఆదర్శంగా తీసుకుంది. ద్విచక్రవాహనాలు, కార్లు, జీపులపై జీవిత పన్నుని కర్ణాటకతో సమాన స్థాయికి పెంచేసింది. మరే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ, ఒడిశా, మహారాష్ట్రలోనూ

Updated : 28 Nov 2021 04:27 IST

కర్ణాటక ఆదర్శంగా జీవితపన్ను పెంపు
ఒడిశాలో అన్ని వాహనాలకూ అయిదు శాతమే  
మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో మనకంటే తక్కువే
ఈనాడు - అమరావతి

కొత్త వాహనాలకు జీవిత పన్నుని (లైఫ్‌ ట్యాక్స్‌) ఎడాపెడా పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ విషయంలో కర్ణాటకను ఆదర్శంగా తీసుకుంది. ద్విచక్రవాహనాలు, కార్లు, జీపులపై జీవిత పన్నుని కర్ణాటకతో సమాన స్థాయికి పెంచేసింది. మరే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ, ఒడిశా, మహారాష్ట్రలోనూ, మన కంటే చాలా పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ పన్ను ఇంత భారీగా లేదు. ఈ రాష్ట్రాలన్నింటిలో ఒడిశాలో అత్యంత తక్కువగా జీవిత పన్ను ఐదు శాతమే ఉండటం విశేషం.

ఇప్పటి వరకున్న పన్నే ఎక్కువ
ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకుముందున్న పన్నులే కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ల వాటికంటే ఎక్కువ. ఇప్పుడు కనిష్ఠ పన్నుని 13%, గరిష్ఠ పన్నుని 18 శాతంగా నిర్ణయిస్తూ ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. కర్ణాటక తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కార్లు, జీపులను రెండు కేటగిరీలుగా చేసి పన్నులు విధిస్తున్నారు. కర్ణాటకలో మాత్రం నాలుగు కేటగిరీలుగా చేసి పన్ను వసూలు చేస్తున్నారు. ఏపీ కూడా దాన్నే అనుసరించింది. దాంతో ప్రభుత్వానికి ఏటా రూ.195 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని రవాణాశాఖ అంచనా.

ద్విచక్ర వాహనాలకూ భారీగా పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో ఇదివరకు ద్విచక్ర వాహనాలన్నిటికీ 9% పన్నే ఉండేది. ఇప్పుడు వాటి విలువ ఆధారంగా రెండు కేటగిరీలుగా చేసి... రూ.50వేలలోపు వాహనాలకు 9%, రూ.50 వేలకంటే ఖరీదైన వాహనాలకు 12% చేశారు. దాంతో ప్రభుత్వానికి ఏటా రూ.163 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని రవాణా శాఖ అంచనా. రూ.50 వేల కంటే తక్కువ విలువైన వాహనాలకు పాత పన్నునే యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ రాష్ట్రంలో రిజిస్టర్‌ చేసుకునేవాటిలో రూ.50 వేల కంటే తక్కువ విలువైన బైకుల సంఖ్య చాలా తక్కువ. రవాణాశాఖ లెక్కల ప్రకారం... 2019-20లో రాష్ట్రంలో 9.27 లక్షల కొత్త ద్విచక్రవాహనాలు రిజిస్టర్‌ చేసుకుంటే, వాటిలో రూ.50 వేల కంటే తక్కువ విలువైనవి 1.89 లక్షలు మాత్రమే. బైకులపై జీవిత పన్ను కర్ణాటక తప్ప ఇతర దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ మనకంటే తక్కువే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు