రూ. 1,190 కోట్ల నష్టం

జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తోడు.. ఆ వెంటనే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదతో పెన్నా, కాళంగి, స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతాల్లోని 23 మండలాల్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని కేంద్ర బృందం సభ్యులకు

Published : 29 Nov 2021 03:16 IST

కేంద్ర బృందానికి నెల్లూరు జిల్లా యంత్రాంగం నివేదిక

బుచ్చిరెడ్డిపాళెం మండలంలో పెన్నా నది గండ్లు పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తోడు.. ఆ వెంటనే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదతో పెన్నా, కాళంగి, స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతాల్లోని 23 మండలాల్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని కేంద్ర బృందం సభ్యులకు నెల్లూరు జిల్లా యంత్రాంగం వివరించింది. జిల్లాలో వరదల కారణంగా రూ.1,190 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర అధికారులకు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.  కడప, చిత్తూరు జిల్లాల మీదుగా వచ్చిన రెండు కేంద్ర బృందాలు ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించాయి. హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వశాఖ సలహాదారు కునాల్‌ సత్యార్థి నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం ఆత్మకూరు, కోవూరు మండలాల్లో పర్యటించగా.. కలెక్టర్‌ వారికి అవసరమైన సమాచారం అందించారు. సోమశిల జలాశయం, దెబ్బతిన్న ఆఫ్రాన్‌, సోమశిల గ్రామాన్ని పరిశీలించారు. అనంతరం సంగం మండలం బీరాపేరువాగు వద్ద దెబ్బతిన్న రోడ్డు, పంట పొలాలను, విద్యుత్తు సరఫరా లైన్లను పరిశీలించారు. అక్కడ జరిగిన నష్టాన్ని జలవనరులు, వ్యవసాయశాఖ అధికారులు కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. జొన్నవాడ నుంచి దేవరపాళేనికి వెళ్లే మార్గంలో ధ్వంసమైన ఆర్‌అండ్‌బీ రోడ్డును చూపించారు. అనిల్‌కుమార్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని మరో బృందం.. నాయుడుపేట, ఇందుకూరుపేట మండలాల్లో తిరిగింది. ఇందుకూరుపేట మండలం జేజేపేటలోని అరటి తోటలు, గంగపట్నంలో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రోడ్లను, ముదివర్తిపాళెం, గంగపట్నం గ్రామాల్లో ఇసుకమేటలు వేసిన వరి పొలాలు, కోతకు గురైన చెరువును పరిశీలించారు. ముదివర్తిపాళెం సమీపంలోని రాజుకాలనీని సందర్శించగా- చెరువు కట్ట తెగిపోవడంతో వరద ప్రవాహం తమ కాలనీని ముంచెత్తిందని, సర్వం కోల్పోయామని బాధితులు కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. వెంకటేశ్వరపురం సమీపంలో దెబ్బతిన్న ఎన్‌హెచ్‌-16ను చూపించి.. అప్పటి పరిస్థితిని జేసీ హరేంధిర ప్రసాద్‌ బృంద సభ్యులకు వివరించారు. నెల్లూరులోని ఓ హోటల్‌లో నష్ట తీవ్రతపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. తెదేపా, భాజపా నాయకులు కేంద్ర బృందాన్ని కలిసి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు