Published : 30/11/2021 03:16 IST

వీడని వరద భయం

నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలను వెన్నాడుతున్న వర్షాలు

లోతట్టు ప్రాంతాల మునక

రాకపోకలకు అంతరాయం

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు, చిత్తూరు-న్యూస్‌టుడే, ఒంగోలు: నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలను వర్షాల భయం వెన్నాడుతూనే ఉంది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లావ్యాప్తంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కండలేరు జలాశయం ఎనిమిదో కి.మీ.కట్ట వద్ద మట్టి జారిపోయింది. జలాశయంలోని నీటిని నల్లవాగు మీదుగా పెన్నాకు వదిలేందుకు ఏర్పాట్లు చేశారు. చేజర్ల, కలువాయి మండలాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ఆదివారం ఉదయం 8.30నుంచి సోమవారం వరకు జిల్లాలో సగటున 10.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పొదలకూరు మండలంలో 20.2 సెం.మీ, చిల్లకూరులో 19.9 సెం.మీలు కురిసింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిలకు వరద వస్తుండటంతో 12 గేట్ల ద్వారా దిగువకు 1.16 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 68 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉదయగిరి మండలం గండిపాళెం జలాశయం మూడు గేట్లు ఎత్తి దిగువకు 10,500 క్యూసెక్కులు, వాకాడు బ్యారేజీ 16గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. దీంతో ఉప్పువాగు ప్రవహిస్తుండటంతో 30 తీర ప్రాంత గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వెంకటగిరిలో ఎర్రచెరువు పొంగి బీసీ కాలనీ ఇళ్లలోకి నీరు చేరింది. సైదాపురం మండలం మర్లపూడి సమీపంలో తెలుగుగంగ 2బీ ఉపకాలువకు గండి పడింది. గూడూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మనుబోలు సమీపంలోని ఆదిశంకర కళాశాల వద్ద జాతీయ రహదారిపై నీరు ప్రవహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నెల్లూరు ప్రధాన దారులన్నీ జలమయమయ్యాయి. పరమేశ్వరీనగర్‌ శివారు, నెల్లూరు గ్రామీణ పరిధి వైఎస్‌ఆర్‌నగర్‌, చౌటమిట్టపాళెం, శ్రామికనగర్‌ తదితర చోట్ల లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది.

ప్రకాశం జిల్లాలో పొంగిన వాగులు

ప్రకాశం జిల్లా పామూరులో అత్యధికంగా 36.4 మి.మీ.వర్షం కురిసింది. మన్నేరు ఎగువ నుంచి లింగసముద్రం వద్ద ఉన్న రాళ్లపాడు జలాశయంలోకి 29,549 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ జలాశయం సామర్థ్యం 1.1 టీఎంసీలు. కొత్త స్పిల్‌వేలోని 5 గేట్లు ఎత్తి 37వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మన్నేరు పరివాహక ప్రాంతాలైన వి.ఆర్‌.కోట, అన్నెబోయినపల్లి, అంగిరేకులపాడు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉప్పుటేరు ఉద్ధృతికి కందుకూరు నియోజకవర్గంలోని బసిరెడ్డిపాలెం-గుడ్లూరు మధ్య రాకపోకలు నిలిచాయి. దీంతో వివిధ గ్రామాల ప్రజలు సుమారు 16 కి.మీ. దూరం చుట్టూ తిరిగి గుడ్లూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. రాజుపాలెం సమీపంలో ఎలికేరు పొంగింది.


వాగులో పడి ఒకరి మృతి

చిత్తూరులో సోమవారం 20 నిమిషాలు, నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. తిరుపతిలో 15 నిమిషాలపాటు మోస్తరు వర్షం కురిసింది. తూర్పు ప్రాంతంలో పంటలు మునిగాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. గుడిపాల మండలం పాపిశెట్టిపల్లెకు చెందిన శ్రీరాములు యాదవ్‌(35) పొలానికి వెళ్లి ఇంటికి తిరిగివస్తున్నప్పుడు చీలాపల్లి వాగులో కొట్టుకుపోయారు. చీలాపల్లి వాసులకు గ్రామ సమీపంలో సోమవారం మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. మదనపల్లె గ్రామీణ మండలం వేంపల్లి పంచాయతీ మల్లయ్యకొండ తండా చెరువు కట్ట కుంగింది. ఆ ప్రభావం మరో చెరువుపై కూడా పడి చివరకు పట్టణంపై చూపుతుందని భావించిన యంత్రాంగం మొరవ నీళ్లను పక్కకు మళ్లించింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని