Published : 30/11/2021 03:16 IST

ఆరునెలల్లోపు అనుమతులు తీసుకోకపోతే ప్రాజెక్టులు నిలిచిపోయినట్లే

గోదావరిపై ఏపీ ఒక్క డీపీఆరూ ఇవ్వలేదు

‘కృష్ణా’ కోసం బోర్డు లేఖలు రాసింది: కేంద్రం

ఈనాడు, దిల్లీ: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వచ్చే అనుమతులులేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోపు అనుమతులు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. లేదంటే పూర్తైన, కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్వహణ కార్యక్రమాలు ఆగిపోయినట్లేనని స్పష్టం చేశారు. సోమవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘జులై 15న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్ల ప్రకారం రెండు బోర్డులు అమల్లోకి వచ్చాయి. వాటి నిర్వహణను నిలిపేసే ప్రసక్తే ఉత్పన్నం కాదు. ఈ బోర్డులు అమల్లోకి వచ్చిన నాటినుంచి 60 రోజుల్లోపు రెండు తెలుగు రాష్ట్రాలు ఏకమొత్తం కింద ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున సీడ్‌మనీ డిపాజిట్‌ చేయాల్సి ఉంది. ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తమ వాటా మొత్తాన్ని డిపాజిట్‌ చేయలేదు. రెండు రాష్ట్రాలూ తమ పరిధిలోని బ్యారేజీలు, డ్యాములు, రిజర్వాయర్లు, రెగ్యులేటింగ్‌ స్ట్రక్చర్లను బోర్డులకు అప్పగించాల్సి ఉంది. ఇప్పటివరకూ రెండు రాష్ట్రాలూ ఆ పనిచేయలేదు. శ్రీశైలం ప్రాజెక్టులోని నాలుగు విభాగాలను, కుడిగట్టు విద్యుత్తు కేంద్రాన్ని, నాగార్జునసాగర్‌ కుడి కాలువ విద్యుత్తు కేంద్రాన్ని నిర్దిష్టమైన షరతులతో అక్టోబర్‌ 14 నుంచి కేఆర్‌ఎంబీకి అప్పగించడానికి ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అలాంటి వర్తమానం రాలేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అనుమతిలేని ప్రాజెక్టులను నిలిపేయాలి. ఆ ప్రాజెక్టులను నిబంధనల మేరకు అనుమతులు తీసుకునేంతవరకూ కొనసాగించడానికి వీల్లేదని రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో నిర్ణయించారు. ఇప్పటివరకు గోదావరికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం  నిర్మాణంలో ఉన్న ఆరు ప్రాజెక్టులు, పూర్తైన ఆరు ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదు. కృష్ణానదిపై నిర్మిస్తున్న అనుమతిలేని ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేసి, అందుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని కేఆర్‌ఎంబీ జులైలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శులకు లేఖ రాసింది’ అని గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లోని నిబంధనల అమలుకోసం కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలు ఏపీ ప్రభుత్వ అధికారులు, బోర్డు సభ్యులతో సబ్‌ కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని