Published : 30/11/2021 03:16 IST

వరద బాధితులను ఉదారంగా ఆదుకోండి

కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి జగన్‌

నష్టం లెక్కలు కచ్చితంగా వేశామని వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో స్పందించాలని మ్ట్ల్య్రుమంత్రి జగన్‌ కోరారు. కేంద్ర సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన వరద నష్టం అంచనాల్లో... ఎక్కడా ఉ్శన్నదాన్ని పెంచి చూపించలేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఎన్‌డీఎంఏ సలహాదారు కునాల్‌ సత్యార్థి నేతృత్వంలోని కేంద్ర బృందం రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించి వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. ఈ బృంద సభ్యులు సోమవారం సీఎం జగన్‌ను కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత మేర ఆదుకునేలా సహకరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఈ విపత్తు నష్టం హృదయవిదారకం. నష్టం అంచనా వేసేందుకు మాకు ఆర్బీకేల రూపంలో సమర్థ వ్యవస్థ ఉంది. రైతు వేసే ప్రతి పంటా ఈ-క్రాప్‌లో నమోదైంది. సామాజిక తనిఖీ కూడా చేశాం. పంట నష్టంపై కచ్చితమైన, నిర్ధారిత లెక్కలున్నాయి. కొవిడ్‌ నియంత్రణ చర్యల కోసం వినియోగించినందున ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు నిండుకున్నాయి. దీనికి అడ్‌హక్‌ నిధులు మంజూరు చేయమని కోరుతున్నాం. దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తుల్ని నియంత్రించేందుకు చర్యలు చేపడతాం. వరద నీటిని తరలించేందుకు ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేందుకు ఒక కార్యక్రమం తీసుకొస్తున్నాం. రిజర్వాయర్లు, డ్యామ్‌లను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. ఆటోమేటిక్‌ వాటర్‌గేజ్‌ సిస్టం ఏర్పాటుపైనా దృష్టి పెడతాం’ అని సీఎం వివరించారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నందున ధాన్యం కొనుగోలులో తేమ, ఇతరత్రా నిబంధనల్ని సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

కడప జిల్లాలో భారీ నష్టం

కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉందని, అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడం వల్ల అపార నష్టం సంభవించిందని కేంద్ర బృందానికి సారథ్యం వహించిన కునాల్‌ సత్యార్థి పేర్కొన్నారు. ‘చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. కడప జిల్లాలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పశువులు చనిపోయాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అన్నమయ్య ప్రాజెక్టు నుంచి వెళ్లే తాగునీటి సరఫరా వ్యవస్థలూ దెబ్బతిన్నాయి.  ఊహించని రీతిలో కురిసిన భారీ వర్షాలకు తలెత్తిన వరదను తీసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు వంకలకు లేదు. ఆ స్థాయిలో వరదను నియంత్రించగలిగే  ఆనకట్టలు, జలాశయాలు ఆ ప్రాంతంలో లేవు. ఉన్నవి ఈ స్థాయి వరదను ఊహించి నిర్మించినవి కాదు’ అని చెప్పారు. ‘మీ నాయకత్వంలో ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయం. అంకితభావం కలిగిన మీ అధికారులు విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారు. అత్యవసర సేవలను వెంటనే పునరుద్ధరించారు’ అని కేంద్ర బృందం ముఖ్యమంత్రితో పేర్కొన్నట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం, పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.6333.66 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదిక అందించింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని