Dollar Seshadri: డాలర్‌ శేషాద్రి ఆకస్మిక మృతి

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) డాలర్‌ శేషాద్రి(73) విశాఖలో హఠాన్మరణం చెందారు. సాగర తీరంలో సోమవారం రాత్రి నిర్వహించతలపెట్టిన కార్తిక దీపోత్సవంలో పాల్గొనేందుకు....

Updated : 30 Nov 2021 12:20 IST

గుండెపోటుతో విశాఖలో ఆకస్మిక మృతి

నేడు తిరుపతిలో అంత్యక్రియలు

హాజరుకానున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

ఈనాడు- విశాఖపట్నం, ఈనాడు డిజిటల్‌ -తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) డాలర్‌ శేషాద్రి(73) విశాఖలో హఠాన్మరణం చెందారు. సాగర తీరంలో సోమవారం రాత్రి నిర్వహించతలపెట్టిన కార్తిక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన విశాఖ వచ్చారు. అదేరోజు సాయంత్రం సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు ఉత్సవమూర్తుల కల్యాణ రథంలో విశాఖలోని తితిదే కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఉత్సవమూర్తులను దించి, స్వామి పవళింపు సేవలో పాల్గొన్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కల్యాణ మండపంలోనే నిద్రకు ఉపక్రమించారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఛాతీనొప్పి రావడంతో వ్యక్తిగత సహాయకులు రాంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేజీహెచ్‌లో శేషాద్రి భౌతికకాయానికి ఎంబామింగ్‌ చేసి రోడ్డుమార్గంలో తిరుపతికి తరలించారు. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం మధ్యాహ్నం వరకు సందర్శనార్థం తిరుపతిలోని సరోజినీదేవి లేఔట్‌లో పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంత్యక్రియలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరుకానున్నట్లు తితిదేకు సమాచారం అందింది.

చిన్న ఉద్యోగంలో చేరి... శ్రీవారి సేవకుడై

తమిళనాడులోని కంచి సమీపంలో ఉన్న నాగల్‌పాకంలో డాలరు శేషాద్రి జన్మించారు. తిరుపతిలో విద్యాభ్యాసం తర్వాత 1978లో తితిదేలో కొలువులో చేరారు. అనతికాలంలోనే స్వామివారి కైంకర్యాల నిర్వహణలో పట్టు సాధించారు.  2007లో బొక్కసం ఇన్‌ఛార్జిగా విరమణ చేశారు. నాటి నుంచి ఆలయ ప్రత్యేకాధికారిగా కొనసాగారు. శ్రీవారి ఆలయం, కైంకర్యాలు, స్వామివారి ఆభరణాల గురించి శేషాద్రికి తెలిసినంతగా.. ఇంకెవ్వరికీ తెలియదంటారు. ఆలయ ఆచారాలు, కైంకర్యాలను వివరిస్తూ... డాలరు శేషాద్రి ఆధ్వర్యంలో 2014 నుంచి పుస్తక రూపంలో తితిదే తీసుకొస్తోంది. ప్రస్తుతానికి రెండు సంపుటాలను ముద్రించారు. మిగిలిన మూడు ముద్రణ దశలో ఉన్నాయి.

శేషాద్రి ఎక్కడ?

శంకర్‌దయాళ్‌ శర్మ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తరచూ తిరుమలకు వచ్చేవారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగగానే మొట్టమొదట అడిగేది... డాలరు శేషాద్రి ఎక్కడా అని. ఈయన్ని ఒకసారి తిరుమల నుంచి బదిలీ చేయగా అత్యున్నత స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. శేషాద్రికి సంతానం లేరు. ఆయన కుటుంబానికి కూడా దాదాపు దూరంగా ఉన్నారు. శ్రీవారి ఆలయం వెనకవైపున్న గోవింద నిలయంలోని చిన్న గదిలో నివాసం ఉంటున్నారు.

పొట్టేలు డాలర్‌... పేరు మార్చింది

తనకు డాలర్‌ శేషాద్రిగా పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఆయనే ‘ఈనాడు-ఈటీవీ’కి ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నలభై ఏళ్ల క్రితం ఓ జ్యోతిష్యుడు నా జాతకచక్రం ప్రకారం పొట్టేలు బొమ్మ కలిగిన డాలర్‌ను ధరించాలని సూచించారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే నేను జంతువు బొమ్మను ధరించడం సరికాదన్నా. ఆ శ్రీవారే జంతువులను ఆధారంగా చేసుకుని ఉన్నారని జ్యోతిష్యుడు అనడంతో నాటి నుంచి డాలర్‌ ధరిస్తున్నా. దీంతో మీడియా ప్రతినిధులు నాఇంటి పేరు పాల శేషాద్రి నుంచి డాలర్‌ శేషాద్రిగా మార్చారు’ అని వివరించారు.


ఆయన నిష్క్రమణ బాధాకరం

-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ

‘స్వామి వారికి నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన డాలరు శేషాద్రి మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆరోగ్యం ముఖ్యమంటూ నేను పదేపదే వారించాను. తుదిశ్వాస వరకు శ్రీవేంకటేశ్వరుడి సేవలో తరించడమే తన జీవితాశయమని ఆయన చెప్పేవారు. అలాగే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలో తరించారు. ఇటీవలే నా పుట్టినరోజున శ్రమకోర్చి దిల్లీదాకా వచ్చి ఆత్మీయ ఆలింగనంతో నన్ను ఆశీర్వదించి వెళ్లారు. ఇంతలోనే నిష్క్రమణ ఎంతో బాధాకరం.


శేషాద్రి సేవలు మరువలేను

-ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

డాలర్‌ శేషాద్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించా. తితిదేలో పదవులతో నిమిత్తం లేకుండా వివిధ హోదాల్లో అత్యున్నత సేవలందించారు. నేనెప్పుడు తిరుమల వెళ్లినా దర్శన సమయంలో పక్కనే ఉండి ఆలయ విశేషాలను వివరించేవారు.


శ్రీవారి సేవలోనే తరించిన ధన్యజీవి..

డాలర్‌ శేషాద్రి శ్రీవారి సేవలో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారని, ప్రతిరోజు స్వామి వారి సుప్రభాత సేవ నుంచి శయనోత్సవం వరకు ఆయన చేయి తాకని సేవలు ఉండవని శ్రీత్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి గుర్తుచేశారు. శేషాద్రి హఠాన్మరణం ఎంతో బాధాకరమని, వేంకటేశ్వర స్వామి సేవలో తరించిన ఆయన తితిదేకు విశేష సేవలందించారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. డాలర్‌ శేషాద్రి తన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్యజీవని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని తితిదే ఈవో జవహర్‌రెడ్డి ఆకాంక్షించారు. డాలర్‌ శేషాద్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని అదనపు ఈవో ధర్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మాట్లాడుతూ... శ్రీవారి ఆలయంలోని అర్చకులంతా ప్రేమతో ఆయన్ని డాలర్‌ మామగా పిలుచుకునేవాళ్లమని, ఆయనలేని లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని