Updated : 30/11/2021 05:27 IST

Chandrbabu: వరద బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం

ప్రతి నియోజకవర్గంలో 20వేల వరకు దొంగ ఓట్లను సృష్టించేందుకు వైకాపా కుట్ర

అక్రమ కేసులు పెడుతున్న పోలీసుల జాబితా సిద్ధం చేయండి

తెదేపా వ్యూహ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని వరద బాధితులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున తెదేపా నేతలు పోరాడాలని పార్టీ వ్యూహ కమిటీ సమావేశం నిర్ణయించింది. వరదలను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, సకాలంలో పంట బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదని పలువురు నేతలు మండిపడ్డారు. రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్ర సాయం కూడా అందని పరిస్థితి నెలకొందన్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించాలని తీర్మానించారు. ప్రతి నియోజకవర్గంలో పది వేల నుంచి 20వేల వరకు దొంగ ఓట్లను సృష్టించేందుకు వైకాపా చేస్తున్న కుట్రను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలవంచి అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల జాబితా తయారు చేయాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన సోమవారం వర్చవల్‌ విధానంలో జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

* వరదలతో చనిపోయిన వారివి కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని జగన్‌ వ్యాఖ్యానించడం చేతగానితనమే. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ విపత్తుల్లో క్షేత్ర స్థాయిలో ఎందుకు పర్యటిస్తున్నారు? ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ జరగాలి. విపత్తు నిర్వహణ నిధులు రూ.1,100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారిమళ్లించారు. జగన్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలి.
* ఓటీఎస్‌ పథకం పేరుతో రూ.14,261 కోట్లు పేదల నుంచి వసూలు చేయడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు ఏ ఒక్కరూ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తాం.
* తెదేపా ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించి..  మహిళలపై వైకాపా వైఖరితో పాటు క్షేత్రస్థాయి సమస్యలపై చర్చించాలి.
* 15వ ఆర్థిక సంఘం నిధులు తక్షణమే ఖాతాల్లో జమ చేయాలి.
* ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీతో పాటు ఇతర శాఖల నిధుల్ని రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని ఒత్తిడి తీసుకురావడం గర్హనీయం.
* డ్వాక్రా మహిళలు ఎల్‌ఐసీలో పొదుపు చేసుకున్న రూ.2,200 కోట్లను జగన్‌ స్వాహా చేశారు. ఆ సంస్థను తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గం.
* ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి తెదేపా సంఘీభావం తెలుపుతోంది. పీఆర్సీ, డీఏ, పెన్షన్‌, సీపీఎస్‌ వంటి వారి సమస్యలను పరిష్కరించాలి.
* పుర, పరిషత్‌ ఎన్నికల్లో జగన్‌ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా తెదేపా ఓట్లు, సీట్లు గణనీయంగా పెరిగాయి. సమర్థంగా పనిచేసిన నేతలకు భవిష్యత్తులో తగిన ప్రాధాన్యమిస్తాం.
* తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేసి  నెలన్నర అవుతున్నా.. మంగళగిరి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కట్టకపోవడం అధికార దుర్వినియోగం. దీనిపై పోరాడాలి. అని తీర్మానించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కింజారపు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్‌  తదితరులు పాల్గొన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని