Published : 30/11/2021 04:54 IST

ఏపీకి 13.24 మిలియన్‌ టన్నుల బొగ్గు సరఫరా

ఈనాడు, దిల్లీ: ఈ ఏడాదిలో అక్టోబరు వరకు ఆంధ్రప్రదేశ్‌లోని థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టులకోసం 13.24 మిలియన్‌ టన్నుల బొగ్గు సరఫరాచేసినట్లు ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు. భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. గత ఏడాది ఇదే సమయానికి 7.18 మిలియన్‌ టన్నులు మాత్రమే సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్తు కేంద్రాల వద్ద తగిన మోతాదులో నిల్వలు ఉంచుకోవడం కోసం కోల్‌ ఇండియా లిమిటెడ్‌ మరో 4.97 లక్షల టన్నులు అదనంగా ఇవ్వడానికి అంగీకరించినట్లు చెప్పారు.

ఏపీఎండీసీకి ఝార్ఖండ్‌లో బొగ్గు గని కేటాయింపు

ఝార్ఖండ్‌లోని బ్రహ్మదిహ బొగ్గుగనిని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కు కేటాయించినట్లు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు. వాణిజ్య అవసరాలకోసం ఈ గనిని ఈ ఏడాది మార్చి 2న కేటాయించినట్లు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ సోమవారం అడిగిన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

పీఎంఏవైయూ కింద ఏపీకి 19.87 లక్షల ఇళ్ల కేటాయింపు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు 19,87,111 ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్‌ కిషోర్‌ తెలిపారు. ఇందులో 17,19,109 ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చూస్తోందని, వీటిలో 1,42,819 నిర్మాణం పూర్తిచేసిందని చెప్పారు. మరో 2,68,002 ఇళ్ల నిర్మాణాన్ని ఏపీ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటిడ్కో) చూస్తోందని, అందులో 2,01,218 ఇళ్లనిర్మాణం తుదిదశకు వచ్చినట్లు చెప్పారు.

వాటర్‌ ఏరోడ్రోమ్‌గా ప్రకాశం బ్యారేజీ ఎంపిక

ప్రాంతీయ అనుసంధాన పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీని వాటర్‌ ఏరోడ్రోమ్‌గా గుర్తించినట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ తెలిపారు. ఆయన సోమవారం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు ఆర్‌సీఎస్‌ ఉడాన్‌ స్కీం కింద  సీప్లేన్‌లు నిర్వహించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. వాటర్‌ ఏరోడ్రోమ్‌ అభివృద్ధి బాధ్యతలను పోర్ట్స్‌, షిప్పింగ్‌, జలరవాణాశాఖ తీసుకుందని, ఇందుకోసం పౌరవిమానయానశాఖతో ఎంఓయూ కుదుర్చుకుందని చెప్పారు.

2022 ఆగస్టుకల్లా రాజమహేంద్రవరం సైన్స్‌ సెంటర్‌

రాజమహేంద్రవరానికి మంజూరు చేసిన సైన్స్‌ సెంటర్‌ (కేటగిరీ-2) ఏర్పాటు 2022 ఆగస్టుకల్లా పూర్తవుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక ఎంపీ మార్గానిభరత్‌ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 


వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి: గల్లా జయదేవ్‌

నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైందని, వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ కోరారు. 377 నిబంధన కింద లోక్‌సభలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. పెన్నా, చెయ్యేరు నదులకు వచ్చిన వరదలతో దేశ దక్షిణ ప్రాంతానికి తూర్పు ప్రాంతానికి అనుసంధానత నిలిచిపోయిందని, జాతీయ రహదారి 16కు పలుచోట్ల కోతకు గురయిందని పేర్కొన్నారు. పదుల కొద్ది గ్రామాలు నీటమునిగాయన్నారు. 60 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది పశువులు మృత్యువాతపడ్డాయని వివరించారు. ప్రజలు ఆహారం, నీరు, అత్యవసర మందుల్లేక విలవిల్లాడుతున్నారని పేర్కొన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని