British Rule: బయట రాబందులు.. లోన రాచవిందులు

1870 ప్రాంతంలో దక్కన్‌ పీఠభూమి క్షామాన్ని ఎదుర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. వీటికి తోడు బ్రిటిష్‌ ప్రభుత్వం ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలను ప్రోత్సహించటంతో ఆహారధాన్యాల ఉత్పత్తి ...

Updated : 30 Nov 2021 05:45 IST

వాళ్లు సత్యాగ్రహులు కాదు...
నిరసనా తెలపలేదు...
తిరుగుబాట్లూ చేయలేదు...
ప్రకృతి కన్నెర్రకు బలైన బడుగు జీవులు!
తినటానికి మెతుకు లేక ఎముకల గూళ్లుగా మారిన వారిని చూసి బండలు సైతం కరిగాయి... కానీ బ్రిటిష్‌వారి గుండెలు కరగలేదు. బయట లక్షల మంది అన్నార్తుల మరణ మృదంగం వినిపిస్తుంటే.. దర్బార్‌లో రాణి పేరిట లక్షల ఖర్చుతో విందులు వినోదాలు చేసింది బ్రిటిష్‌ ప్రభుత్వం!

1870 ప్రాంతంలో దక్కన్‌ పీఠభూమి క్షామాన్ని ఎదుర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. వీటికి తోడు బ్రిటిష్‌ ప్రభుత్వం ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలను ప్రోత్సహించటంతో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గింది. పండిన పంటను కూడా ప్రజలకు పంచే బదులు ఐరోపాకు ఎగుమతి చేయటంపైనే బ్రిటిష్‌ ప్రభుత్వం దృష్టిసారించింది. మద్రాసు రాష్ట్రంలో ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ అల్లాడుతుంటే... సుమారు 3లక్షల 20వేల టన్నుల గోధుమల్ని ఇంగ్లాండ్‌కు ఓడల్లో ఎక్కించాడు అప్పటి వైస్రాయి లార్డ్‌ రాబర్ట్‌ లిటన్‌. 1876-77నాటికి కరవు తీవ్రమైంది.  రోజుల తరబడి తిండి లేక మద్రాసు రాష్ట్రంలో రోడ్లపైనే వేలమంది మరణిస్తున్న వేళ ప్రజలను ఆదుకునేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం నిరాకరించింది. ‘ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు సాయం చేస్తే... వారికదే అలవాటవుతుంది. ఆశిస్తూనే ఉంటారలా’ అంటూ వారి ప్రాణాలను గాలికి వదిలేశాడు వైస్రాయి లిటన్‌!

స్వేచ్ఛా మార్కెట్లో ప్రభుత్వం తలదూర్చకూడదన్న ఆర్థిక సిద్ధాంతాన్ని అనుసరించిన ఆంగ్లేయులు ప్రజల పట్ల బాధ్యతను మరిచారు. అలాగని ఆర్థిక క్రమశిక్షణ ఏమైనా పాటించారా అంటే అదీ లేదు. ఒకవైపు వీధుల్లో రాబందులు రాజ్యమేలుతుంటే... 1877లో దిల్లీ దర్బార్‌ పేరిట లక్షల రూపాయలతో గానాబజానా ఏర్పాటు చేశారు. విక్టోరియా రాణి భారత్‌కు కూడా ఇకమీదట రాణి అని ప్రకటించటానికి ఏర్పాటు చేసిన ఈ హంగామా వారంపాటు సాగింది. వివిధ సంస్థానాల రాజులు, మహారాజులతో మొదలెడితే... దాదాపు 70వేల మందికి అత్యంత ఖరీదైన ఆతిథ్యం ఇచ్చారు. ‘‘బయట లక్షలమంది మరణిస్తుంటే... దర్బార్‌లో లక్షల రూపాయలు పారబోస్తున్నారు...’’ అంటూ రాశాడో విదేశీ పాత్రికేయుడు.

పోనీ... బతికున్నవారు కష్టపడి సంపాదించుకుందామంటే దానికీ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ తామున్నచోటి నుంచి 10 కిలోమీటర్ల బయటే పనిచేయాలన్న నిబంధన పెట్టింది. అసలే  తిండిలేక చేతగాని స్థితిలో ఉన్న ఆ బడుగు జీవులు... పనికోసం పదికిలోమీటర్లు నడిచే క్రమంలో... వేలమంది రోడ్లమీదే ప్రాణాలు విడిచారు. దాదాపు 5.5లక్షల మంది ఆ క్షామంలో మృత్యువాత పడ్డారు.


నిర్దయకు నజరానా

అంతకుముందు 1874 బెంగాల్‌ క్షామం సమయంలో అక్కడ పనిచేసిన రిచర్డ్‌ టెంపుల్‌ అనే అధికారికే ఈసారి మద్రాసులో సహాయ కార్యక్రమాల బాధ్యత అప్పగించారు. గమ్మత్తేమంటే... బెంగాల్‌లో ఉన్నప్పుడు మానవతతో బర్మా నుంచి బియ్యం తెప్పించి... ప్రజలకు టెంపుల్‌ అంతో ఇంతో సాయం చేశారు. మరణాలను తగ్గించేందుకు ప్రయత్నించారు. అందుకుగాను ఆయన్ను బ్రిటిష్‌ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. వేధించింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న ఆయన... మద్రాసులో తన గుండెను, కళ్లను పూర్తిగా మూసుకొని ప్రజలకు ఏమాత్రం సాయం అందకుండా కఠినంగా వ్యవహరించారు. ప్రభుత్వంతో శభాష్‌ అనిపించుకున్నారు. తర్వాత ఆయన్ను... ముంబయి గవర్నర్‌గా నియమించి గౌరవించింది బ్రిటిష్‌ ప్రభుత్వం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని