ప్రభుత్వ ఒప్పందాలపై నిందలా?

వాన్‌పిక్‌ వ్యవహారంలో ప్రత్యేక ప్రాజెక్టులపై ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సీబీఐ ఎలా తప్పుపడుతుందని నిమ్మగడ్డ ప్రసాద్‌ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు.

Published : 30 Nov 2021 04:54 IST

వాన్‌పిక్‌ కేసులో నిమ్మగడ్డ తరఫు వాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: వాన్‌పిక్‌ వ్యవహారంలో ప్రత్యేక ప్రాజెక్టులపై ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సీబీఐ ఎలా తప్పుపడుతుందని నిమ్మగడ్డ ప్రసాద్‌ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఒప్పందాలపై గవర్నరు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరించారని, సందేహాస్పదంగా ఉందంటూ సీబీఐ అభియోగ పత్రంలో పేర్కొనడం సరికాదన్నారు. వాన్‌పిక్‌ పారిశ్రామికవాడ ప్రాజెక్టుకు అవసరమైన భూముల కొనుగోలుకు రూ.300 కోట్లు వెచ్చించామని, తమ సొమ్ము ఖర్చు పెట్టడాన్ని సీబీఐ తప్పుబడుతోందన్నారు. ప్రాజెక్టుపై అటు రస్‌ అల్‌ ఖైమా (రాక్‌) ఇటు ప్రభుత్వం తమపై ఎలాంటి ఫిర్యాదూ చేయలేదన్నారు. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ వాన్‌పిక్‌ ప్రాజెక్టుతోపాటు నిమ్మగడ్డ ప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై సోమవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టు ఇప్పటికీ అమల్లోనే ఉందని, ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తాము సమర్పించిన రూ.5 కోట్ల బ్యాంకు గ్యారంటీలను వచ్చే ఏడాది డిసెంబరు వరకు పొడిగించామన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలను మంత్రి మండలితోపాటు ముఖ్యమంత్రి పరిశీలించారని, ఇందులో ఎక్కడా తప్పుదోవపట్టించి ఒప్పందాలను కుదుర్చుకోలేదన్నారు.  రైతులకు చెల్లించిన సొమ్ములో మోసం చేశామని సీబీఐ చెబుతోందని, రైతులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రూ.20 లక్షలు ఇచ్చామని చెప్పగా, ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో తమ రికార్డుల్లో ఉన్నట్లే రూ.27.64 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారన్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించినదానికంటే ఎక్కువగా చెల్లించామని, గుడ్‌విల్‌ కింద చెల్లించిన మొత్తాలపై రాక్‌ను మోసం చేసినట్లు చెప్పారన్నారు. రాక్‌ ఆదేశాల మేరకు ఇతర జిల్లాల్లో భూములను కొనుగోలు చేయడం నేరమని సీబీఐ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీబీఐ తనకు అనుకూలంగా ఉన్న పత్రాలనే సమర్పించిందని, ఇతర పత్రాలను తొక్కిపెట్టిందన్నారు. దీనిపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు