పంటనష్టం.. రూ.2 వేల కోట్లపైనే

అతి భారీవర్షాలు.. వరదలతో రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల రైతులూ పెద్ద ఎత్తున నష్టపోయారు. ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారమే వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.2వేల కోట్లకు పైనే నష్టం జరిగింది.

Updated : 01 Dec 2021 03:13 IST

8.03 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు దెబ్బ

తాత్కాలిక పునరుద్ధరణ, శాశ్వత పునర్నిర్మాణానికి రూ.6,333 కోట్లు

కేంద్రానికి నివేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: అతి భారీవర్షాలు.. వరదలతో రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల రైతులూ పెద్ద ఎత్తున నష్టపోయారు. ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారమే వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.2వేల కోట్లకు పైనే నష్టం జరిగింది. అత్యధికంగా 5.66 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతినడం.. 5వేల పశువుల మృత్యువాత వరదల తీవ్రతకు దర్పణం పడతాయి. ప్రాజెక్టుల కట్టలు, వేల చెరువులు తెగిపోయాయి. రహదారులు కోతకు గురయ్యాయి. వంతెనలు కూలిపోయాయి. రైతులకు పెట్టుబడి సాయం, తాత్కాలిక పునరుద్ధరణ, శాశ్వత పునర్నిర్మాణ పనులకు రూ.6,333 కోట్లు కావాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.

అన్నదాతకు తీరని నష్టం

నవంబరులో కురిసిన అతి భారీ వర్షాలతో.. రైతుకు ఎదురైన కష్టం అంతా ఇంతా కాదు. కోత దశలో ఉన్న వరి నీట మునగడంతో గింజ కూడా తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కడప జిల్లాలో కోసి ఇంటికి తెచ్చిన ధాన్యం కూడా వరదలో కొట్టుకుపోయింది. సెనగ నీట మునిగి కుళ్లిపోయింది. వేరుసెనగ నల్లబారింది. ఉద్యానపంటలు నీటిలోనే కుళ్లిపోయాయి. మొత్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.405 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా.

మూగజీవాల మరణయాతన

పశుసంవర్ధక, మత్స్యశాఖలకు రూ.5.50 కోట్ల నష్టం వాటిల్లింది. వేలాదిగా కోళ్లు చనిపోయాయి. 5 వేల వరకు పశువులు చనిపోయాయి. మత్స్యకారుల పడవలు, వలలు ధ్వంసమయ్యాయి.

గట్లు తెగిన చెరువులు

ఎగువన భారీ, అతిభారీ వర్షాలు కురిసి.. దిగువకు వరదై ప్రవహించింది. నిండు కుండల్లా ఉన్న చెరువులను ముంచెత్తి గట్లు తెంచేసింది. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. జలవనరుల శాఖలోనే సుమారు 2,400 వరకు చెరువులు, ఇతర నీటివనరులు దెబ్బతిన్నాయి.

రహదారుల కోత

ముంచెత్తిన వరదలతో ఎక్కడికక్కడ రహదారులు తెగిపోయాయి. జాతీయ రహదారులు కోతకు గురికావడంతో పాటు నీరు నిలిచింది. 120 చోట్ల కోతకు గురైనట్లు అంచనా. పంచాయతీరాజ్‌శాఖ ఆధీనంలోని 864 కి.మీ, రహదారులు, భవనాలశాఖ పరిధిలో 1,650 కిలోమీటర్లు దెబ్బతిన్నాయి. పురపాలకశాఖ పరిధిలోనూ 600 కిలోమీటర్లకు పైగా రహదారులకు నష్టం వాటిల్లింది.

* తాగునీటిని సరఫరా చేసే 860 పథకాలపై వరద ప్రభావం పడింది. 242 చోట్ల పైపులైన్లు దెబ్బతిన్నాయి.

* పురపాలకశాఖ పరిధిలో 400 కిలోమీటర్ల మురుగునీటి పారుదల వ్యవస్థ దెబ్బతింది. 6,128 వీధిదీపాలు ధ్వంసమయ్యాయి. 32 నగర/పురపాలక సంస్థల పరిధిలో వరదల ప్రభావం ఉంది.

తాత్కాలిక పునరుద్ధరణకు రూ.1,644 కోట్లు.. శాశ్వత పనులకు రూ.3,454 కోట్లు

శాఖలవారీ నష్టంపై ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి అందించింది. వివిధ రంగాలకు సంబంధించి రూ.6333.66 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల ప్రకారం.. తాత్కాలిక సహాయ, పునరుద్ధరణ కార్యక్రమాలకు రూ.1235.28 కోట్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల పరిధిలోకి రాని పంట నష్టం, పునరుద్ధరణ కార్యక్రమాలకు రూ.1644.04 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.3454.34 కోట్లు అవసరమని తెలిపింది.


అన్నదాతలకు అండగా నిలబడతాం

మంత్రి కన్నబాబు

ఆలమూరు, న్యూస్‌టుడే: అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారు పడుతున్న ఇబ్బందులను తనవిగా భావించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని, ఎవరూ అధైర్యపడవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపళ్ల, కలవచర్ల గ్రామాల్లో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే జగ్గిరెడ్డితో కలిసి అధిక వర్షాలకు పాడైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు విలేకరులతో మాట్లాడుతూ వర్షాలకు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నా రబీకి నీటి కొరత లేకుండా చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులు రబీకి సిద్ధం కావడానికి ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయ, సహకారాలపై కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని