Updated : 01/12/2021 04:58 IST

ఓటీఎస్‌ కట్టకపోతే పింఛను ఆపేయండి

రాష్ట్రంలో కొన్నిచోట్ల లబ్ధిదారులపై అధికారుల ఒత్తిడి

ఏకంగా ఉత్తర్వులు జారీ చేసిన సంతబొమ్మాళి కార్యదర్శి

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, అమరావతి; న్యూస్‌టుడే, సంతబొమ్మాళి: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు(ఓటీఎస్‌-వన్‌ టైం సెటిల్‌మెంట్‌) పథకం కింద రూ.10 వేలు చెల్లించని వారికి డిసెంబరు పింఛన్లు ఆపేయండి. మేం చెప్పే వరకూ ఇవ్వొద్దు. వాలంటీర్లు ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘించి పింఛను ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ మొత్తం వసూళ్లకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది’.

ఇదీ.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి వాలంటీర్లకు జారీ చేసిన ఆదేశం. ఈ ఉత్తర్వులు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

ఓటీఎస్‌ కింద డబ్బు కట్టించుకునేందుకు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల అధికారులు ఇలాంటి ప్రయత్నాలతో లబ్ధిదారులపై ఒత్తిడి పెంచుతున్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం, అనంతపురం జిల్లా యాడికి మండలంలోనూ అధికారులు ఈ తరహా మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. పథకం అమలు స్వచ్ఛందమంటూనే ఇలా బలవంతపు వసూళ్లకు యత్నించడంపై లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తామంటూ ఎంపీడీవో, గృహ నిర్మాణశాఖ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, వాలంటీర్లు వరుసపెట్టి ఇళ్ల వద్దకు వెళ్తూ.. రుణాన్ని గుర్తు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు మరో అడుగు ముందుకేసి బియ్యం కార్డులనూ తొలగిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఎప్పుడో కట్టుకున్న ఇళ్లపై ఉన్న రుణం నుంచి విముక్తి కల్పిస్తామంటూ ఓటీఎస్‌ పథకం పేరుతో ఇలా ఒత్తిడి చేయడమేంటని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంతబొమ్మాళిలో సర్క్యులర్‌ ఇవ్వడంపై స్థానిక పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌ వివరణ కోరగా.. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకే ఉత్తర్వులు జారీ చేశానన్నారు. ఎంపీడీవో విశ్వేశ్వరరావుని సంప్రదించగా.. లిఖిత పూర్వకంగా ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదన్నారు. కానీ, కొంతమేర ఒత్తిడి చేస్తే ఓటీఎస్‌ డబ్బులు చెల్లించడానికి లబ్ధిదారులు ముందుకొస్తారనే ఓ చిన్న ఆశ ఉందన్నారు. మరో వైపు ‘ఓటీఎస్‌  కట్టని వారికి పింఛన్లు ఆపేయమనే ఉత్తర్వులు పొరపాటున ఇచ్చాం, పింఛన్లు యథావిధిగా    ఇస్తాం’ అని సంతబొమ్మాళి కార్యదర్శి పేరున మంగళవారం సాయంత్రం మరో వివరణ విడుదల చేయడం గమనార్హం.


ఆ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేశాం

- అజయ్‌జైన్‌, గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

ఓటీఎస్‌ వసూళ్లకు లబ్ధిదారులపై ఎలాంటి   ఒత్తిడి పెట్టడం లేదని గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. ‘ఈ పథకం కింద కలిగే ప్రయోజనాలనే వారికి వివరిస్తున్నాం. ఓటీఎస్‌ మొత్తాన్ని చెల్లించకపోతే పింఛను ఇవ్వబోమని ఉత్తర్వులిచ్చిన సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేశాం. ఎంపీడీవోకి నోటీసులు ఇచ్చాం’ అని పేర్కొన్నారు.


ఓటీఎస్‌ కట్టకుంటే పింఛను ఆపేస్తారా..?: లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఓటీఎస్‌ కట్టని వారింట్లో అవ్వా, తాతల పింఛను ఆపేయాలని సర్క్యులర్‌ ఇవ్వడం, కాల్‌ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దుయ్యబట్టారు. ‘ప్రజలందరినీ నిలువు దోపిడీ చేస్తోన్న జగన్‌ ప్రభుత్వం దారి దోపిడీ దొంగల్ని మించిపోయింది’ అని మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు.


ప్రతిపక్షాల తీరు సరికాదు

- మంత్రి సీదిరి అప్పలరాజు

శ్రీకాకుళం(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ‘ఓటీఎస్‌ పథకం పేదలకు వరం. దీన్ని ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసేలా మాట్లాడటం తగదు’ అని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘లోకేశ్‌కు ఆర్థిక పరిస్థితుల గురించి తెలీదు. ఉన్న నిధులను అవసరాలను బట్టి వివిధ శాఖలకు సర్దుబాటు చేస్తాం. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రూ.లక్షల కోట్లు అప్పు తెచ్చారు. వాటిని ఎందుకు ఆస్తులుగా చేయలేకపోయారు’ అని విమర్శించారు.


కుప్పకూలిన వన్నెపూడి వీఆర్వో

ఓటీఎస్‌ లక్ష్యాల ఒత్తిడే కారణమంటున్న సిబ్బంది

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి సచివాలయంలో వీఆర్వో కోరుమిల్లి నూకరాజు(38) మంగళవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఓటీఎస్‌ కింద లబ్ధిదారుల నుంచి సొమ్ము వసూళ్లపై చర్చిస్తుండగా అకస్మాత్తుగా పడిపోయినట్లు సిబ్బంది చెప్పారు. వెంటనే గొల్లప్రోలు పీహెచ్‌సీలో ప్రాథమిక వైద్యం చేయించి.. కాకినాడలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుగా నిర్ధారించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఓటీఎస్‌లో రోజువారీ లక్ష్యాలు నిర్దేశించడంతో వీఆర్వో ఒత్తిడికి గురైనట్లు సిబ్బంది చెబుతున్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని