ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయింది

పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో ప్రత్యేక కేటగిరీ హోదా అంశం ముగిసిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటిలోగా

Updated : 01 Dec 2021 04:57 IST

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌

ఈనాడు, దిల్లీ: పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో ప్రత్యేక కేటగిరీ హోదా అంశం ముగిసిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటిలోగా ప్రత్యేక హోదా ప్రకటిస్తారు? విభజన చట్టంలోని హామీలను ఎంతవరకు అమలుచేశారంటూ తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు.. మంత్రి సమాధానమిచ్చారు. ‘ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను చాలావరకు అమలుచేశాం. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. మౌలిక వసతుల కల్పన, విద్యాసంస్థల నిర్మాణం వంటివి పూర్తిచేయడానికి చట్టంలోనే పదేళ్ల గడువిచ్చారు. విభజన చట్టం అమలుపై హోంశాఖ వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో ఇప్పటికే 25 సార్లు సమీక్షించింది. ద్వైపాక్షిక సమస్యల సామరస్యపూర్వక పరిష్కారానికి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తున్నాం. ప్రత్యేక హోదా అంశం 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో ముగిసిపోయింది. ఒకవేళ కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచి ఉంటే ఏపీకి 2015-16 నుంచి 2019-20 మధ్య కేంద్రం నుంచి ఎంత అదనపు నిధి అందేదో.. దాన్నే ‘ప్రత్యేక సాయం’ కింద ఇవ్వడానికి అంగీకరించాం. 2015-16 నుంచి 2019-20వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు అసలు, వడ్డీని కేంద్రమే చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది’ అని నిత్యానందరాయ్‌ వివరించారు.


రెండేళ్లలో ఏపీకి రూ.1.43 లక్షల కోట్లు విడుదల

ఈనాడు, దిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలకు గత రెండేళ్లలో దాదాపు రూ.2.43 లక్షల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి తెలిపారు. పన్ను వాటాల పంపిణీ, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఏపీకి 2020-21లో రూ.83,602.35 కోట్లు, 2021-22లో రూ.60,368.85 కోట్లు కలిపి మొత్తం రూ.1.43 లక్షల కోట్లు అందించినట్లు చెప్పారు. తెలంగాణకు 2020-21లో రూ.62,522.8 కోట్లు, 2021-22లో రూ.37,215.95 కోట్లు కలిపి రూ.99.73 వేల కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ వివరాలు అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని