జగన్‌పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది

వైకాపా ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లే వారికి, నియోజకవర్గాల్లో దీటుగా పనిచేసే నాయకులకే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఇటీవల మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట పురపాలక

Updated : 02 Dec 2021 12:28 IST

వైకాపా వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పోరాడే వారికే పార్టీలో ప్రాధాన్యం
కొండపల్లి, జగ్గయ్యపేట నాయకులతో సమీక్షలో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లే వారికి, నియోజకవర్గాల్లో దీటుగా పనిచేసే నాయకులకే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఇటీవల మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట పురపాలక సంఘాల నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన సమావేశమయ్యారు. కొండపల్లిలో పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులందరికీ పేరు పేరునా ఆయన అభినందనలు తెలిపారు. జగ్గయ్యపేటలో తెదేపా నైతికంగా గెలిచి, వైకాపా అక్రమాలతో సాంకేతికంగా ఓడిపోయిందన్నారు. ‘‘కొన్ని నియోజకవర్గాల్లో సమర్థుల్ని ప్రోత్సహించకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఇకపై నియోజకవర్గ ఇన్‌ఛార్జి నుంచి ప్రతి స్థాయిలోను సమర్థులకే పెద్దపీట వేస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘జగన్‌రెడ్డి కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి స్థానిక ఎన్నికలు నిర్వహించారు. వైకాపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వారి వైఫల్యాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. నాపైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలి. రెండున్నరేళ్ల జగన్‌రెడ్డి పాలనలో అన్నీ అరాచకాలే’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘కొండపల్లి ఎన్నికల్లో ఎంపీ కేశినేని నాని నాయకులకు సరియైన దిశానిర్దేశం చేశారు. వైకాపా ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రజలు తెదేపాకి విజయం చేకూర్చారు. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా అదేవిధంగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. నాయకులెప్పుడూ ప్రజలతో మమేకమై ఉండాలి...’’ అని  చంద్రబాబు చెప్పారు. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, చినరాజప్ప, తదితరులు పాల్గొన్నారు.

* జగ్గయ్యపేటలో వైకాపా నాయకులు డబ్బు, అధికారబలంతో ప్రభుత్వ అధికారుల్ని ప్రలోభపెట్టి తెదేపా అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న వార్డుల్లోను రీకౌంటింగ్‌కు అవకాశం లేకుండా చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘జగ్గయ్యపేటలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్రీరాం తాతయ్య, నెట్టెం రఘురాం రీకౌంటింగ్‌కు పట్టుబట్టినా అధికారులు అవకాశమివ్వలేదు. మూడు వార్డుల్లో తెదేపా ఓడిపోయింది. ఎమ్మెల్యే ఉదయభాను ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వెళ్లి... తెదేపా గెలిచిన 13వ వార్డులో మూడుసార్లు రీకౌంటింగ్‌ జరిపించి, చివరకు వైకాపా ఆరు ఓట్లతో గెలిచినట్లు ప్రకటింపజేసుకున్నారు’’ అని ఆయన మండిపడ్డారు. జగ్గయ్యపేటలో తెదేపా అభ్యర్థులు గెలిచి ఓడారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని