పాట.. తరలిపోయింది!

‘‘తేనెలొలికే పూలబాలలకు మూణ్నాళ్ల ఆయువిచ్చినవాడినేదికోరేది.. బండరాలను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చినవాడినేది కోరేది!!’’ అని ప్రశ్నించారాయన.

Updated : 02 Dec 2021 04:58 IST

ముగిసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

‘‘తేనెలొలికే పూలబాలలకు మూణ్నాళ్ల ఆయువిచ్చినవాడినేదికోరేది.. బండరాలను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చినవాడినేది కోరేది!!’’ అని ప్రశ్నించారాయన.
తేనెలొలికే తెలుగు పదాలతో కొండంత భావాన్ని పలికించి.. తీయటి పాటలను పేటికలకొద్దీ అందించిన ఆయన కూడా తెలుగువారికి ఆ ముచ్చటను మూణ్నాళ్లకే ముగించి వెళ్లిపోయారు.

సినీ రచయిత, పాటల రేడు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం ఫిలింఛాంబర్‌లో ఉంచారు. కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున అభిమానులు బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు సీతారాముడికి ఘనంగా నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హరీశ్‌రావు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని హాజరై సిరివెన్నెల కుటుంబాన్ని ఓదార్చారు. పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. రాయదుర్గం మహాప్రస్థానంలో సిరివెన్నెలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఫిలింఛాంబర్‌ నుంచి పద్మాలయ స్టూడియో రోడ్డు, నార్నే రోడ్డు మీదుగా పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానుల నడుమ అంతిమయాత్ర సాగింది. పెద్దకుమారుడు యోగేశ్వర్‌ తండ్రి చితికి నిప్పంటించారు.

పార్థివదేహం వద్ద సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబసభ్యులతో త్రివిక్రమ్‌, ఏపీ మంత్రి పేర్ని నాని

సిరివెన్నెల కుటుంబానికి ప్రభుత్వం అండ
 రూ.27 లక్షల ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని నిర్ణయం

ఈనాడు, అమరావతి: సిరివెన్నెల సీతారామశాస్త్రి చికిత్సకైన ఖర్చులన్నీ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మేరకు ఆ కుటుంబానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రతినిధిగా హైదరాబాద్‌ వెళ్లిన మంత్రి పేర్ని నాని సిరివెన్నెల పార్థివదేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తుంది. ఇప్పటివరకు మీరు చెల్లించిన డబ్బులనూ ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చేలా చూస్తాం’’ అని భరోసా ఇచ్చారు. ‘‘మీ ఆదేశాల మేరకు ఇప్పటికే సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులతో మాట్లాడాం. మొత్తం ఖర్చులు రూ.27 లక్షలను సీఎం సహాయనిధి నుంచి చెల్లిస్తున్నాం’’ అని సీఎంవో అధికారులు సైతం బుధవారం ముఖ్యమంత్రికి వివరించారు. ఆయన కుటుంబానికి కేటాయించేందుకు ఇంటి స్థలాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. దాంతో... తమకు అండగా నిలిచిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సిరివెన్నెల కుటుంబం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నాని, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌లు ఆయా ప్రభుత్వాలు అందించనున్న సాయాన్ని తమతో ప్రస్తావించారని, ఈమేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

* సిరివెన్నెల లేరనే విషయం వింటేనే ఎంతో బాధ కలుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన సీతారామశాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళుర్పించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని