Updated : 02/12/2021 05:24 IST

ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు కేంద్ర వాటా కింద రూ.895 కోట్లు ఇచ్చాం

ఈనాడు, దిల్లీ: ప్రకృతివైపరీత్యాల సమయంలో తగు చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రకృతి వైపరీత్య సహాయ నిధి(ఎస్‌డీఆర్‌ఎఫ్‌)కి 2021-22 సంవత్సరానికిగాను రూ.1,192.80 కోట్లు కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. బుధవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ నిధిలో రూ.895.20 కోట్లు కేంద్ర వాటా కాగా, రూ.297.60 కోట్లు రాష్ట్ర వాటా అని తెలిపారు. కేంద్ర  ప్రభుత్వం తన వాటాను రెండు విడతల్లో ముందుగానే విడుదల చేసినట్లు వెల్లడించారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు రూ.4,450 కోట్ల నష్టం వాటిల్లిందని, సహాయ, పునరావాస పనులకోసం రూ.వెయ్యికోట్ల గ్రాంట్‌ ఇవ్వాలని గత ఏడాది అక్టోబరు 16న ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ప్రకృతివైపరీత్య నిర్వహణ అన్నది రాష్ట్ర ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని, ఇప్పటికే తన చేతుల్లో ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ, పునరావాస చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ వైపరీత్యం తీవ్రస్థాయిలో ఉంటే నిబంధనల ప్రకారం జాతీయ ప్రకృతివైపరీత్య నిధి నుంచి అదనపు నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద ఇచ్చే నిధులు సహాయ, పునరావాసం కోసమే తప్ప నష్టపరిహారం కోసం కాదన్నారు. గత సంవత్సరం సంభవించిన వైపరీత్యాలతో తలెత్తిన నష్టం అంచనాకు కేంద్ర ప్రభుత్వం పంపిన అంతర్‌ మంత్రిత్వశాఖల బృందం గత ఏడాది నవంబరులో నివేదిక ఇచ్చిందని, దాన్ని అనుసరించి రాష్ట్రానికి 2020-21లో రూ.233.49 కోట్లు విడుదల చేసినట్లు నిత్యానందరాయ్‌ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి స్టేట్‌ డిజాస్టర్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌కు 15వ ఆర్థికసంఘం సిఫార్సులమేరకు రూ.1,491 కోట్లు కేటాయించామని, అందులో కేంద్ర వాటా రూ.1,119 కోట్లు ఏపీకి విడుదల చేసినట్లు వెల్లడించారు.ఫాస్టాగ్‌ అనంతరం పెరిగిన టోల్‌ వసూళ్లు

ఈనాడు, దిల్లీ: ఫాస్టాగ్‌ విధానం ప్రవేశపెట్టిన తర్వాత జాతీయ రహదారుల్లో టోల్‌ వసూళ్లలో పెరుగుదల కనిపించినట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ విధానం మొదలైందని, ఆ రోజు నుంచి రోజుకు రూ.104 కోట్ల టోల్‌ వసూలైనట్లు చెప్పారు. 2020 ఫిబ్రవరిలో ఇదే సమయంలో రోజుకు రూ.80 కోట్లే లభ్యమైనట్లు ఓ ప్రశ్నకు సమాధానం తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 3,970 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చినట్లు రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ.13,218 కోట్లు 14, 15 ఆర్థికసంఘాల సిఫార్సు మేరకు 2015-16 నుంచి 2021-22వరకు ఏపీలోని స్థానిక సంస్థలకు రూ.13,218.09 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ తెలిపారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

ఏపీలో ద్విభాషల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ

ఈనాడు, దిల్లీ: ‘ఉన్నత విద్యాసంస్థల్లో మాతృభాషలో బోధనే మేలని నూతన జాతీయ విద్యావిధానం-2020 చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠ్యపుస్తకాలను ద్విభాషల్లో ముద్రిస్తోంది’ అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్రప్రధాన్‌ తెలిపారు. బుధవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సాంకేతిక విద్యాసంస్థలు స్థానిక భాషల్లో కోర్సులు నిర్వహించడానికి ఏఐసీటీఈ ఇప్పటికే అనుమతి ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు పది రాష్ట్రాల నుంచి 19 సంస్థలు మాతృభాషల్లో కోర్సులు నిర్వహించడానికి సిద్ధమైనట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2021-22 విద్యాసంవత్సరంలో గ్రామీణ, పట్టణప్రాంతాల్లోని అన్ని డిగ్రీకాలేజీల్లో ఆంగ్ల బోధనను ప్రారంభిస్తూ జీవో జారీచేసినట్లు గుర్తుచేశారు. ఆ రాష్ట్రం సైన్స్‌, మ్యాథ్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌ పుస్తకాలను ద్విభాషల్లో ముద్రించాలని నిర్ణయించిందని వివరించారు. మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన ద్విభాషా పుస్తకాలను ఇప్పటికే ముద్రించి విడుదల చేసినట్లు ధర్మేంద్రప్రధాన్‌ వెల్లడించారు.

‘వైజాగ్‌ జోన్‌’ ఎప్పటి నుంచో చెప్పలేం

వైజాగ్‌ రైల్వే జోన్‌ ఎప్పటినుంచి ప్రారంభమవుతుందో చెప్పలేమని రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుపై ఎంపీలు సంజయ్‌కాకా పాటిల్‌, గోరంట్ల మాధవ్‌, కె.రామ్మోహన్‌నాయుడు, పోచా బ్రహ్మానందరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్‌, మిథున్‌రెడ్డి బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

‘స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ’పై పునఃపరిశీలన లేదు

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ (పెట్టుబడుల ఉపసంహరణ) నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశం లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్రప్రసాద్‌ సింగ్‌ తేల్చిచెప్పారు. సీపీఎం సభ్యుడు ఏఎం ఆరీఫ్‌ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని