Published : 04/12/2021 02:57 IST

తీవ్ర తుపానుగా జవాద్‌

ఉత్తరాంధ్రకు దగ్గరగా రాక!

రేపు పూరీ వద్ద తీరం దాటే అవకాశం

భారీ నుంచి అతిభారీ వర్షాలు.. 100 కి.మీ. వేగంతో గాలులు

సమీక్షించిన సీఎం.. ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులు


 
తుపాను ప్రభావంతో రుషికొండ బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లడంతో బయటపడిన రాళ్లు

ఈనాడు-అమరావతి, ఈనాడు, న్యూస్‌టుడే - విశాఖపట్నం: జవాద్‌ తుపాను.. మరింత బలపడి తీవ్రతుపానుగా మారనుంది. శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి.. అక్కడ నుంచి ఉత్తరదిశగా కదులుతూ 5వ తేదీ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దీని ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాల్లో అధికారులు శనివారానికి రెడ్‌ ఎలర్ట్‌ జారీచేశారు. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 420 కిలోమీటర్లు, గోపాల్‌పుర్‌కు ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. జవాద్‌ తుపాను ఒడిశాలోని పూరీ జిల్లాలో ఆదివారం తీరం దాటి, తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందని ఒడిశా ప్రత్యేక సహాయ కమిషనర్‌ పీకే జెనా తెలిపారు. తీరం దాటే సమయంలో 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అయితే, దిశ మార్చుకుని ఒడిశా మీదుగా వెళ్తూ తీరం దాటకపోవచ్చనీ ఆయన చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే తీరం వెంబడి గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. శనివారం ఉదయానికి గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. తుపాను కారణంగా 95కు పైగా రైళ్లు రద్దయ్యాయి.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

సహాయ కార్యకలాపాల కోసం జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) అప్రమత్తమైంది. సహాయక 64 బృందాలు సిద్ధంగా ఉన్నట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీ అతుల్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు 46 బృందాలను పంపామని, మరో 18 బృందాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు.


సునంద

అత్యంత భారీ వర్షాలు

విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ సునంద విలేకర్లతో మాట్లాడుతూ తీవ్ర వాయుగుండం శుక్రవారం రాత్రి తుపానుగా బలపడిందన్నారు. పశ్చిమ వాయవ్యదిశగా ప్రయాణిస్తున్న తుపాను ఉత్తరకోస్తా జిల్లాలకు దగ్గరగా రావొచ్చన్నారు. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించొచ్చని తెలిపారు. ఫలితంగా శనివారం కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల అత్యంత భారీవర్షాలు పడతాయన్నారు. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి చలిగాలుల తీవ్రత పెరిగి, వర్షం కురిసింది. పాఠశాలలకు అయిదో తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ప్రజలను తరలించేందుకు 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. అత్యవసర సేవల నిమిత్తం నౌకాదళం, కోస్టుగార్డు సేవలతో పాటు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. రుషికొండ బీచ్‌ వద్ద సముద్రం శుక్రవారం 200 అడుగులు వెనక్కి మళ్లింది. దీంతో ఇసుక తిన్నెలు, రాళ్లు బయటపడ్డాయి. తుపాను కారణంగా విశాఖ మన్యంలోని అన్ని పర్యాటక కేంద్రాలనూ ఐదో తేదీ వరకు మూసేయాలని పాడేరు ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ ఆదేశించారు.

ప్రత్యేకాధికారుల నియామకం

ఈనాడు డిజిటల్‌-శ్రీకాకుళం, ఈనాడు-విజయనగరం: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుపాను ప్రభావం ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళానికి అరుణ్‌కుమార్‌, విజయనగరానికి కాంతిలాల్‌ దండేను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. కాంతిలాల్‌ దండే, విజయనగరం కలెక్టర్‌ సూర్యకుమారి జిల్లాలోని అధికారులకు సూచనలు చేశారు. రెండు జిల్లాల్లోని తీరప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. శుక్రవారం సాయంత్రం నుంచే ప్రభావిత ప్రాంతాల ప్రజలను అక్కడకు తరలిస్తున్నారు. తుపాను సన్నద్ధతపై ప్రత్యేకాధికారి అరుణ్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.


శ్రీకాకుళంలో అధికారులకు సూచనలిస్తున్న ప్రత్యేకాధికారి అరుణ్‌కుమార్‌, చిత్రంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు

ప్రాణ నష్టం ఉండకూడదు: ముఖ్యమంత్రి

తుపాను కారణంగా ప్రాణ నష్టం ఉండకూడదని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. సహాయచర్యల కోసం ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున అందుబాటులో ఉంచామని చెప్పారు. తుపాను పరిస్థితిపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్షించారు. ‘ముంపుప్రాంతాల ప్రజల్ని ముందే అప్రమత్తం చేసి తరలించాలి. చెరువులు, కాల్వల పరిస్థితిని పరిశీలించండి’ అని నిర్దేశించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని