35 మందితో..

భారత్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం నేరుగా పాలించింది 89 సంవత్సరాలే (1858-1947)! ఈస్టిండియా కంపెనీ మాత్రం దాదాపు 150 ఏళ్లు అధికారం చెలాయించింది. భౌగోళికంగా, జనాభా, సంపద పరంగా ఎన్నో రెట్లు పెద్దదైన....

Updated : 04 Dec 2021 04:53 IST

భారత్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం నేరుగా పాలించింది 89 సంవత్సరాలే (1858-1947)! ఈస్టిండియా కంపెనీ మాత్రం దాదాపు 150 ఏళ్లు అధికారం చెలాయించింది. భౌగోళికంగా, జనాభా, సంపద పరంగా ఎన్నో రెట్లు పెద్దదైన అఖండ భారతావనిని పాలించిన ఈ ఈస్టిండియా కంపెనీ వద్ద ఉన్న బలం, బలగం ఎంత అని చూస్తే....

బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీని తూర్పు ఆసియాలో ఇంగ్లాండ్‌ తరఫున వ్యాపారం చేసేందుకు 1600 సంవత్సరం డిసెంబరులో స్థాపించారు. కొంతమంది ఇంగ్లాండ్‌ వ్యాపారవేత్తలు (వీరిలో ఓ మద్యం వ్యాపారి, వస్త్రవ్యాపారి, తోలువ్యాపారితో పాటు కొంతమంది సముద్ర దొంగలు కూడా ఉన్నట్లు చెబుతారు) ఉమ్మడిగా... 60 వేల పౌండ్ల పెట్టుబడితో జాయింట్‌ స్టాక్‌ కంపెనీగా మొదలైంది. బ్రిటన్‌ రాణి అనుమతితో భారత ఉపఖండంలో వ్యాపారాన్ని మొదలెట్టారు.

అప్పటికే స్పెయిన్‌, పోర్చుగల్‌కు చెందిన కంపెనీలు ఈ ప్రాంతంలో వ్యాపారంలో స్థిరపడ్డాయి. వారిని చూసే ఇంగ్లాండ్‌ ఈస్టిండియా కంపెనీ రంగంలోకి దిగింది. ఆరంభించిన తొలినాళ్లలో ఈస్టిండియా కంపెనీకి ప్రత్యేకంగా కార్యాలయం అంటూ ఏమీ లేదు. మొదటి 20 సంవత్సరాల పాటు... లండన్‌లోని తమ డైరెక్టర్‌ థామస్‌ స్మిత్‌ ఇంటి నుంచే కార్యకలాపాలు సాగించింది. సిబ్బంది ఆరుగురే! భారత్‌పై పట్టు బిగించేనాటికి లండన్‌లో చిన్న కార్యాలయంలో 35 మంది సిబ్బంది ఉండేవారు. భారత్‌లో పాలనాధికారం చేపట్టిన 30 సంవత్సరాలకుగానీ (1790 నాటికి)... వారి లండన్‌ కార్యాలయ సిబ్బంది సంఖ్య 150 దాటలేదు.

కేవలం 3వేల మందితో...

వ్యాపార రక్షణ కోసం తొలుత కొంతమంది సాయుధులను ఇంగ్లాండ్‌ నుంచి తెచ్చుకున్న ఈస్టిండియా దీన్ని ప్రణాళికాబద్ధంగా పెంచుకుంది. డచ్‌, ఫ్రెంచ్‌ తదితర కంపెనీలతో పోరాటాలకుగాను స్థానికులనే సైనికులుగా నియమించుకున్నారు. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్‌క్లైవ్‌ సైన్యం 3 వేల మందే. వారితోనే 50వేల మంది సైన్యమున్న మొఘల్‌ నవాబును ఎదుర్కొని విజయం సాధించాడు క్లైవ్‌. 1778 నాటికి 70 వేలకు చేరిన ఈస్టిండియా సైన్యంలో చాలామంది భారతీయులే. వారికి యూరోపియన్లతో శిక్షణ ఇప్పించేవారు. ఇలా పెంచుకున్న సైన్యాన్ని మెల్లగా అధికార విస్తరణకూ ఉపయోగించుకుంది. భారత్‌లోని వివిధ రాజ్యాల మధ్య అనైక్యతను ఆలంబనగా చేసుకొని వారి మధ్య చిచ్చు పెట్టి తాను అధికారం చలాయించటం ఆరంభించింది. బ్రిటన్‌లోని పారిశ్రామికీకరణ పుణ్యమా అని వచ్చి పడిన ఆధునిక ఆయుధాలు తోడవటంతో స్థానిక రాజ్యాల సైన్యం సంఖ్యలో పెద్దదైనా నిలవలేని పరిస్థితి. పందొమ్మిదో శతాబ్దం ఆరంభానికి ఈస్టిండియా సైనికుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరింది. ఆ సమయానికి బ్రిటన్‌ సైన్యం కంటే ఇదే పెద్దదంటారు.

భారత్‌లో దోచుకున్న సొమ్మును స్టాక్‌ డివిడెండ్ల రూపంలో బ్రిటన్‌లోని పార్లమెంటు సభ్యులకు పంచేవారు. బ్రిటన్‌ పార్లమెంటును కూడా పరోక్షంగా గుప్పిట పెట్టుకునే పరిస్థితి. అలా ఓ వ్యాపార సంస్థ ప్రపంచ చరిత్రగతిని మార్చింది. 1833లో పార్లమెంటు ఆమోదం ద్వారా కంపెనీని జాతీయం చేశారు. కానీ సిపాయిల తిరుగుబాటుతో 1858లో ఈస్టిండియా కంపెనీ పాలన ముగిసి... బ్రిటిష్‌ ప్రభుత్వ పాలన మొదలైంది. 1874లో ఈ కంపెనీని పూర్తిగా రద్దు చేశారు.


శిక్షణకు ప్రత్యేక కళాశాల...

ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగమంటే బ్రిటన్‌లో జనాలు ఎగబడేవారు. బోర్డు డైరెక్టర్ల సిఫార్సు ఉంటేనేగానీ గుమాస్తా ఉద్యోగం కూడా దొరకని పరిస్థితి. పైగా తొలి ఐదేళ్లు బాండ్‌కు కట్టుబడి పనిచేయాల్సి వచ్చేది. భారత్‌లో పనిచేసే తన సిబ్బందికి శిక్షణ కోసం లండన్‌లో  ప్రత్యేకంగా ఈస్టిండియా కళాశాలను కూడా ఆరంభించింది. గుమాస్తాల నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకు ఇందులోనే శిక్షణ ఇచ్చేవారు.


దివాలా తీయబోయి..

భారత్‌ను దోచుకోవటం ఆరంభించిన ఈస్టిండియా కంపెనీ ఖజానా కళకళలాడిందనే అంతా అనుకుంటాం. అది నిజమే అయినా... ఒకదశలో కంపెనీ దివాలా తీసే పరిస్థితి కూడా తలెత్తింది. రాబర్ట్‌ క్లైవ్‌ మొఘల్‌ చక్రవర్తిని ఓడించి భారీ సంపదను లండన్‌కు తరలించిన తర్వాత కంపెనీ పాలన దెబ్బతింది. అప్పటిదాకా ఎన్నడూ చూడనంత సొమ్ము అప్పనంగా వచ్చి పడుతుండటంతో కంపెనీ అధికారగణం పై నుంచి కింది దాకా అవినీతిలో మునిగి తేలింది. ఫలితంగా... కంపెనీకి ఆదాయం భారీగా పడిపోయింది. దీనికి తోడు అదే సమయంలో బెంగాల్‌లో తలెత్తిన తీవ్ర కరవు కారణంగా పన్నులు తగ్గిపోయాయి. కంపెనీ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. 1772లో లండన్‌లో ఈస్టిండియా డైరెక్టర్ల బోర్డు బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి 10 లక్షల పౌండ్ల అత్యవసర రుణానికి దరఖాస్తు చేసుకుంది. సాయం చేయకుంటే దివాళా తీయటం తప్ప తమకు మరోమార్గం లేదని చేతులెత్తేసింది. విచారణ జరిపి... భారత్‌లో కంపెనీ పాలన పద్ధతుల్ని తీవ్రంగా తప్పు పడుతూనే... సాయం చేసి ఈస్టిండియాను గట్టెక్కించింది బ్రిటిష్‌ ప్రభుత్వం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని