Published : 04/12/2021 04:19 IST

చేతులు కట్టుకుని.. తలదించుకుని కూర్చున్నా!

నిధులివ్వకుంటే పొమ్మన్నారు

ఎన్టీఆర్‌ వర్సిటీ వీసీ శ్యాంప్రసాద్‌ తీవ్ర ఆవేదన

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌


ఎన్జీవో సంఘం నేతలు బండి శ్రీనివాసరావు, విద్యాసాగర్‌తో మాట్లాడుతున్న  ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం వీసీ శ్యాంప్రసాద్‌

ఈనాడు, అమరావతి, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే:  ‘నెల రోజులుగా ప్రతి రోజూ మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రభుత్వ పెద్దల దగ్గరే ఏడ్చాను. నిధుల మళ్లింపుపై నేనేం చెప్పడానికి వీల్లేకుండా.. నా చేతులు కట్టుకుని, తలదించుకుని వారి ఎదుట కూర్చునేలా చేశారు. అలా కూర్చోబెడితే  నేను ఏం చెప్పగలను. నేనో దళితుడిననో, ఇంకేదో చెప్పి చేసే వ్యవహారం కాదిది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయంతే.. నవ్వుతూ వెళ్లిపోవడమే. ఈ విషయంలో దేవుడు మంచి చేస్తాడనే అనుకుంటున్నాను....’ అంటూ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ శ్యాంప్రసాద్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా ఎన్జీవో నాయకులు విద్యాసాగర్‌, తదితరులు వీసీని ఆయన కార్యాలయంలో శుక్రవారం కలిశారు. నిధుల మళ్లింపుపై ప్రశ్నించగా అది తన చేతుల్లో లేదంటూ అశక్తత వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవాళ్లు వ్యవస్థ కోసం నిలబడాలి కదా అని ఎన్జీవో నేత విద్యాసాగర్‌ అడగగా... ‘వ్యవస్థ కోసం నిలబడాల్సిందే కానీ.. నన్ను కాళ్లు చేతులు కదలకుండా చేసి నిలబెట్టి ఇదా.. అదా.. ఏదో ఒకటి తేల్చుకోమంటే నేను ఏం చేయాలి?. వ్యవస్థ ముఖ్యమైనా.. నేను అది చేయలేను. నా చేతుల్లో ఏం లేదు. అక్కడ జరిగిన విషయాలు చూస్తే మీరు అయ్యో! అంటారు. అయ్యో అనే స్థితిలో నేను లేను’.. అని వీసీ శ్యాం ప్రసాద్‌పేర్కొన్నారు.

నా జీవితంలో ఇలాంటి పరిస్థితి రాలేదు

రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని వ్యవస్థల్లోనూ ఇలాగే జరుగుతోంది, మేం రోజూ చూస్తూనే ఉన్నామంటూ విద్యాసాగర్‌ అనడంతో... ‘మీరు ఇలాంటివి చూస్తూ ఉండొచ్చు. నా జీవితంలో 50 ఏళ్లు సర్జన్‌గా పనిచేశాను. ఏనాడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. మీరు వైజాగ్‌లో ఎవరినైనా అడగండి నా గురించి.. ఏం చెబుతారో వినండి. నిధులకు సంబంధించి ఆ అంకెలు ప్రభుత్వానికి నేను చెప్పినవి కాదు. మీడియా ద్వారా తెలుసుకుని.. నన్ను పిలిచి ఇంత ఇస్తే తప్ప నా ఇంటికి రావొద్దు బయటకు పో అంటే నేనేం చేయాలి?’. అని వీసీ వాపోయారు.  ‘దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల దగ్గరకు, మరొకరి దగ్గరకి నెల రోజులుగా వెళ్తూనే ఉన్నాను. చివరికి నిన్న ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. పది రోజుల్లో ఏదో ఒకటి చేస్తానంటూ హామీ ఇచ్చారు...’ అని పేర్కొన్నారు. నిధులకు సంబంధించి అన్నీ పెద్ద అంకెలే ఉండడంతో.. లెక్కలు తేల్చడానికే నెల రోజులు పట్టిందన్నారు. ఈ నెలాఖరుకి ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నానని ఎన్జీవో సంఘాల నేతలకు వీసీ చెప్పారు.

రూ.175కోట్లు వెనక్కి ఇవ్వాలని అడిగాం

రూ.400కోట్లు ప్రభుత్వ సంస్థకు బదిలీ చేసిన ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం అధికారులు.. ప్రస్తుతం పాలన, ఉద్యోగుల భద్రత, ఒప్పంద కార్మికుల జీతభత్యాలు, పింఛన్లకు సంబంధించి కొన్ని నిధులు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రూ.175కోట్లు వెనక్కి ఇవ్వాలని, మిగిలిన నిధులకు వడ్డీ ఇవ్వాలని కోరారు. 2022-23 ఏడాదికి విశ్వవిద్యాలయ మనుగడకు రూ.100కోట్లు, పెన్షనర్ల రిజర్వు ఫండు కింద రూ.25కోట్లు, గ్రాట్యుటీకి మరో రూ.25కోట్లు, ఉద్యోగుల సంక్షేమ నిధికి రూ.25కోట్లు ఇవ్వాలని కోరామని వీసీ శ్యాంప్రసాద్‌, రిజిస్ట్రార్‌ శంకర్‌ వెల్లడించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని