6 ప్యాకేజీల్లో ఒక్క బిడ్డూ రాలేదు

రాష్ట్రంలో చిన్నతరహా ఖనిజాలకు సీనరేజ్‌ ఫీజు, కన్సిడరేషన్‌ నగదు వసూళ్ల బాధ్యత ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు వీలుగా టెండర్లు పిలిచిన గనులశాఖకు చుక్కెదురైంది.

Published : 06 Dec 2021 03:51 IST

ప్రైవేటుగా చిన్నతరహా ఖనిజాల సీనరేజ్‌ వసూళ్లకు స్పందన కరవు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో చిన్నతరహా ఖనిజాలకు సీనరేజ్‌ ఫీజు, కన్సిడరేషన్‌ నగదు వసూళ్ల బాధ్యత ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు వీలుగా టెండర్లు పిలిచిన గనులశాఖకు చుక్కెదురైంది. ఆరు ప్యాకేజీల్లో రెండేళ్ల కాలానికి రూ.5,882 కోట్ల మేర భారీ మొత్తాన్ని రిజర్వ్‌ ధరగా పేర్కొనగా.. ఎవరూ బిడ్లు దాఖలు చేయకపోవడంతో గనులశాఖ కంగుతింది. కొంత కాలంగా రాష్ట్రంలో నిర్మాణ రంగం నెమ్మదించడం, ప్రభుత్వ పనులు దాదాపు లేకపోవడం, ఈ సమయంలో ఎక్కువ లక్ష్యం మేర సీనరేజ్‌ వసూళ్లు కష్టమనే ఉద్దేశంతో ఎవరూ బిడ్లు వేయలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు సీనరేజ్‌ వసూళ్లను గనులశాఖ చేపడుతోంది. అయితే చెల్లించిన సీనరేజ్‌ విలువ కంటే లీజుదారులు ఎక్కువ పరిమాణంలో అక్రమంగా ఖనిజాన్ని తరలిస్తున్నారని, దానిని అడ్డుకునేందుకు వీలుగా ప్రైవేటు సంస్థలకు సీనరేజ్‌ వసూళ్ల బాధ్యతలు అప్పగించాలని భావించారు. రాష్ట్రమంతా 6 ప్యాకేజీలుగా విభజించి రెండేళ్ల కాల వ్యవధికి గత నెలలో టెండర్లు పిలిచారు. ప్యాకేజీ-1లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు రిజర్వ్‌ ధరగా రూ.1,056 కోట్లు, ప్యాకేజీ-2లోని ఉభయగోదావరి జిల్లాలకు రూ.485 కోట్లు, ప్యాకేజీ-3లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు రూ.944 కోట్లు, ప్యాకేజీ-4లో ప్రకాశం జిల్లాకు రూ.1,659 కోట్లు, ప్యాకేజీ-5లో నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు రూ.862 కోట్లు, ప్యాకేజీ-6లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు రూ.876 కోట్లు కలిపి మొత్తం రూ.5,882 కోట్లు రిజర్వ్‌ ధరగా పేర్కొన్నారు.

గతం కంటే రిజర్వు ధర అధికం

చిన్నతరహా ఖనిజాలకు గత రెండేళ్లలో వసూళ్లయిన సీనరేజ్‌ సగటుకు అదనంగా 30 శాతం కలిపి, కొత్త నిబంధన మేరకు కన్సిడరేషన్‌ నగదునూ జత చేసి అన్ని ప్యాకేజీల రిజర్వు ధరగా టెండరులో పేర్కొన్నారు. ఇది ధర ఎక్కువని గుత్తేదారులు ముందుకు రాలేదని భావిస్తున్నారు. మళ్లీ ఇదే రిజర్వ్‌ ధరలతో టెండర్లు పిలవాలా? రిజర్వ్‌ ధరను తగ్గించాలా? అనే దానిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని గనులశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని