7 లక్షల ఇళ్లు కనిపించట్లేదు!

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి (వన్‌ టైం సెటిల్‌మెంట్‌... ఓటీఎస్‌) పూర్తిస్థాయిలో అర్హులను గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది.

Updated : 06 Dec 2021 04:39 IST

ఓటీఎస్‌ అమలుకు 46 లక్షల మంది అర్హులు

వారిలో ఇప్పటివరకు గుర్తించినది 39 లక్షలే

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి (వన్‌ టైం సెటిల్‌మెంట్‌... ఓటీఎస్‌) పూర్తిస్థాయిలో అర్హులను గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. ఈ పథకానికి 1983-2011 మధ్య గృహనిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకొని ఇళ్లు కట్టుకున్న 46 లక్షల మంది అర్హులు. వీరిలో ఇప్పటివరకు 39 లక్షల ఇళ్ల వివరాలనే అధికారులు గుర్తించారు. 2005 తర్వాత నిర్మించిన ఇళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఇవి 18 లక్షల వరకు ఉండగా, అంతకుముందు కట్టిన 21 లక్షల ఇళ్లను గృహనిర్మాణశాఖ వద్ద ఉన్న దస్త్రాల ఆధారంగా గుర్తించారు. ఇంకా 7 లక్షల మంది లెక్కతేలాలి. ఈ వివరాలు అధికారుల వద్ద లేవు. రుణం తీసుకోకుండా వివిధ పథకాల కింద ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న 12 లక్షల మందిని కూడా గుర్తించారు.

మాన్యువల్‌ విధానంలో రిజిస్ట్రేషన్‌: ఓటీఎస్‌ కింద రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు పాత విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌ విధానం రావడానికి ముందు పదేళ్ల క్రితం నాటి మాన్యువల్‌ విధానంలోనే రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. ఇందుకు అవసరమైన దస్త్రాలు, స్టాంప్‌పేపర్లను సిద్ధం చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏడాదికి గరిష్ఠంగా 17 లక్షలకు మించి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద లబ్ధిదారులు భారీగా ఉన్నందున నిర్దేశిత గడువులో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌కు సాఫ్ట్‌వేర్‌ సహకరించదని భావిస్తున్నారు. అందుకే గ్రామ, వార్డు సచివాలయాల్లోనే మాన్యువల్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని నిర్ణయించారు. మాన్యువల్‌ రిజిస్ట్రేషన్‌ అయిన వివరాలను గృహనిర్మాణ సంస్థ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. దీన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వెబ్‌సైట్‌కు అనుసంధానిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని