విదేశీ పెట్టుబడులు.. 

గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,577 కోట్లు, తెలంగాణకు రూ.17,709 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 2019-20 అక్టోబరు నుంచి 2021 జూన్‌ వరకు ఈ మొత్తం వచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు.

Updated : 07 Dec 2021 05:48 IST

మూడేళ్లలో ఏపీకి రూ.2,577 కోట్లు తెలంగాణకు రూ.17,709 కోట్లు

ఈనాడు, దిల్లీ: గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,577 కోట్లు, తెలంగాణకు రూ.17,709 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 2019-20 అక్టోబరు నుంచి 2021 జూన్‌ వరకు ఈ మొత్తం వచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. కేంద్ర మంత్రి సమాధానం ప్రకారం ఏపీకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఏటా తరుగుదల కనిపించగా, తెలంగాణకు వచ్చినదాంట్లో హెచ్చు తగ్గులు నమోదయ్యాయి. ఈ మూడేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.7,43,4476.26 కోట్ల పెట్టుబడులు రాగా అందులో ఏపీ వాటా 0.34%, తెలంగాణ వాటా 2.38%గా ఉంది. అత్యధిక పెట్టుబడులు మహారాష్ట్రకు రూ.2,04,082.22 కోట్లు, గుజరాత్‌కు రూ.1,87,472.28 కోట్లు, కర్ణాటకకు రూ.1,49,718.39 కోట్లు వచ్చాయి. మొత్తం ఎఫ్‌డీఐల్లో ఈ మూడు రాష్ట్రాలకే 72.80% దక్కింది.


ఏపీ పోలీసుశాఖలో పోస్టుల భర్తీకి చర్యలకు జోక్యం చేసుకోండి: కేశినేని నాని

ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న 14వేల పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకొనేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెదేపా ఎంపీ కేశినేని నాని కోరారు. ఆయన సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడారు. ‘స్టేట్‌ ఆఫ్‌ పోలీసింగ్‌ రిపోర్టు ప్రకారం పోలీసు సిబ్బంది సగటున 16 గంటలు పని చేయాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 8% మంది పోలీసులే రోజుకు 8 గంటలు పని చేస్తున్నారు. విపరీతమైన పని ఒత్తిడి కారణంగా 78% మంది సిబ్బంది అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 7,500 మంది మహిళలకు ఒక మహిళా పోలీసు ఉన్నారు. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ మొత్తం పోలీసుల్లో మహిళా పోలీసుల సంఖ్య కేవలం 6% మాత్రమే ఉంది. మహిళలకు పోలీసు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు కల్పించినా వారి నిష్పత్తి 6%లోపునకే పరిమితమైంది’ అని కేశినేని వివరించారు.

రాష్ట్రమే నిర్ణయం తీసుకోవాలి

కాకినాడలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుతో రాష్ట్రానికి విస్తృత ప్రయోజనాలున్నాయని, అందువల్ల దానికి వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ సమకూర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ తెలిపారు. రాజ్యసభలో ఈ అంశంపై వైకాపా నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.


జల్‌జీవన్‌ మిషన్‌కు పూర్తి వాటా ఇవ్వని ఏపీ

ఇంటింటికీ కుళాయి నీరు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులతో అమలు చేస్తున్న జల్‌జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటాను ఏపీ ప్రభుత్వం రెండేళ్లుగా పూర్తిగా సమకూర్చలేదని కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ తెలిపారు. ఈ పథకం కింద ఏపీకి చేసిన నిధుల కేటాయింపుపై సోమవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘2021-22 ఆర్థిక సంవత్సరంలో జల్‌జీవన్‌ మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను ఏపీ ప్రభుత్వం ఇంత వరకూ తీసుకోలేదు. ఈ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తితో వాటా సమకూర్చాల్సి ఉంటుంది. 2019-20, 2020-21లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.453.66 కోట్లకు సమానమైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సమకూర్చలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి మంజూరు చేసిన ఈ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2022 మార్చిలోపు ఉపయోగించుకోకపోతే అవి మురిగిపోతాయి’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని