Published : 07/12/2021 03:05 IST

మహోద్యమంలా మహా పాదయాత్ర

 36వ రోజు వెంకటగిరిలో జననీరాజనం

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: వెంకటగిరి, బాలాయపల్లి, న్యూస్‌టుడే: అమరావతి రైతుల మహాపాదయాత్ర 36వ రోజు సోమవారం నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం వెంగమాంబపురం నుంచి మొదలైంది. రైతులు తొలుత అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ప్రచార రథంలోని వేంకటేశ్వర స్వామిని రైతు వేషధారణలతో అలంకరించారు. కండువాను స్వామికి తలపాగా చుట్టి, అభయ హస్తానికి పచ్చతోరణం తొడిగారు. వెంగమాంబపురంలో స్థానిక రైతులు మద్దతు పలకగా పాదయాత్రికులు పొలంలోకి దిగి ‘జైఅమరావతి’ ఆకారంలో నాట్లు వేశారు. భారతీయ కిసాన్‌ మజ్దూర్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ తన మేనల్లుడు అమిత్‌, అభిషేక్‌, గౌర్‌, ఉత్తమ్‌ తదితరులను అమరావతి రైతులకు సంఘీభావంగా పంపగా... వారు వెంకటగిరికి చేరుకుని మద్దతు తెలిపారు.

అనుమతి అడిగితే తిరిగి ప్రశ్నిస్తారా...?

అమరావతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనరు శివారెడ్డి మాట్లాడుతూ... ‘తిరుపతిలో బహిరంగ సభ నిర్వహణకు అనుమతి కోరగా వివిధ ప్రశ్నలు అడుగుతూ తిరిగి మాకే లేఖ రాశారు. రాయలసీమ ప్రాంతంలో అమరావతి బహిరంగ సభ నిర్వహిస్తే... స్థానికుల నుంచి వచ్చే వ్యతిరేకతను మీరు ఎలా ఎదుర్కొంటారంటూ చిత్తూరు జిల్లా పోలీసులు ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదేశంతో భాజపా నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. అమిత్‌షా మాటలు నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తే... ఆయనపై చర్యలు తీసుకునే దమ్ము పోలీసులకు ఉందా? పోలీసుల నుంచి అనుమతి రాకుంటే... న్యాయస్థానంలోనే దాన్ని ఎదుర్కొంటాం. దీనిపై ఐకాస ప్రతినిధులు తిరుపతి వెళ్లారు. మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది’ అని వివరించారు.

* పారిశ్రామికవేత్త, సీఐఐ మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్‌ పాదయాత్రకు సంఘీభావంగా రూ.10 లక్షల విరాళం అందజేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ.. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఏ రూపంలో పెట్టినా అంతిమ విజయం రైతులదే అవుతుందన్నారు.


రైతుల భోజన ఏర్పాట్లపై వైకాపా నాయకుల అభ్యంతరం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: మహాపాదయాత్ర రైతులకు మధ్యాహ్న భోజన ఏర్పాట్ల కోసం చిత్తూరు జిల్లా వాంపల్లి-ఎంపేడు గ్రామాల మధ్యలోని స్థిరాస్తి వ్యాపారులకు చెందిన స్థలాన్ని ఎంపిక చేశారు. దాన్ని సోమవారం చదును చేస్తుండగా వైకాపా నాయకులు అభ్యంతరం వ్యక్తంచేసి, స్థలాన్ని దున్నేశారు. దాంతో రైతు నాయకులు మరోచోట... గోప్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. షెడ్యూల్‌ ప్రకారం పాదయాత్ర వీలైనన్ని ఎక్కువ గ్రామాల మీదుగా వెళ్లేలా మొదట నిర్ణయించారు. అయితే శ్రీకాళహస్తి పట్టణంలోనికి వచ్చేలా మార్పు చేసినట్లు తెలిసింది. మంగళవారం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే పాదయాత్ర 8వ తేదీ రాత్రి శ్రీకాళహస్తికి చేరుకుంటుంది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని