ఓటీఎస్‌... ఓ కాల్‌మనీ

పేదల నుంచి డబ్బు గుంజేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ పథకం పేరుతో కాల్‌మనీని ప్రోత్సహిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కరోనాతోనూ, రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోనూ పనుల్లేక అప్పుల్లో కూరుకుపోయిన

Published : 07 Dec 2021 03:18 IST

అది పేదల మెడకు ప్రభుత్వం బిగిస్తున్న ఉరితాడు

తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు

ఈనాడు, అమరావతి: పేదల నుంచి డబ్బు గుంజేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ పథకం పేరుతో కాల్‌మనీని ప్రోత్సహిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కరోనాతోనూ, రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోనూ పనుల్లేక అప్పుల్లో కూరుకుపోయిన పేదలు ఓటీఎస్‌ ఎందుకు కట్టాలని ఆయన నిలదీశారు. సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి జగన్‌ది దివాళాకోరుతనం. ఓటీఎస్‌ పథకం పేదల మెడకు ఉరితాడు. అయినా పట్టాలివ్వడానికి జగన్‌ ఎవరు? ఆయనేమైనా వారి కోసం భూమి కొన్నారా? రుణం ఇచ్చారా? ఇళ్లు కట్టారా? 30, 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ హయాంలో మొదలైన పేదలకు పక్కా ఇళ్ల పథకాన్ని తర్వాత నేను కొనసాగించాను. పేదల భద్రతకు భరోసా ఎలా ఇవ్వాలి? వారికి మరింత మెరుగ్గా ఇల్లు ఎలా నిర్మించాలని మేం  ఆలోచిస్తే.. జగన్‌ మొత్తం దోపిడీ చేస్తూ, పేదల మెడకు ఉరితాడు వేస్తున్నారు’ అని చంద్రబాబు మండిపడ్డారు. పులిచింతల పాజ్రెక్టు నిర్మాణానికి  ఇళ్లు వదులుకుని, పునరావాస కాలనీల్లో ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారినీ ఓటీఎస్‌ కట్టమనడం కంటే దారుణం ఏముంటుందని  ధ్వజమెత్తారు. ఓటీఎస్‌ కింద ప్రజలెవరూ డబ్బు చెల్లించవద్దని, సహాయ నిరాకరణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పేదలకు ఇళ్లపట్టాల్ని ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే తెదేపా అధికారంలోకి వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తుందన్నారు.

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చట్టవిరుద్ధం

ఓటీఎస్‌లో డబ్బు చెల్లించిన వారికి గ్రామసచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తామనడం చట్టవిరుద్ధమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం సబ్‌రిజిస్ట్రార్‌కే ఉంటుంది గానీ, జగన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో చేస్తామంటే కుదరదు. రిజిస్ట్రేషన్‌ కోసం స్టాంప్‌ పత్రాల్ని కూడా వైకాపా రంగుల్లో తయారుచేయడం వాళ్ల ఉన్మాదానికి పరాకాష్ట. నెల్లూరు జిల్లా బాలాయపాలెం మండలంలో ప్రతి రోజు ఒక్కరితోనైనా ఓటీఎస్‌ కట్టించాలని జేసీ విదేహ్‌ ఖరే లక్ష్యాలు పెట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో డ్వాక్రా మహిళల పొదుపు ఖాతా నుండి సొమ్ము తీసుకునేలా బలవంతపు తీర్మానాలు చేయించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు ఎంపీడీవో.. ఓటీఎస్‌ కట్టనివారికి కుల ధ్రువీకరణపత్రాలు కూడా ఇవ్వొద్దని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ఓటీఎస్‌ లక్ష్యాలు పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు’ అని ధ్వజమెత్తారు.

‘ఓటీఎస్‌ కింద డబ్బు కట్టకపోతే పింఛను నిలిపేస్తామని సంతబొమ్మాళిలో సచివాలయ కార్యదర్శి నోటీసిచ్చారని ప్రశ్నించిన తెదేపా నాయకులపై కేసులు బనాయించారు. ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేయిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట తప్పి, మడమ తిప్పినందుకు జగన్‌పైనే చీటింగ్‌ కేసు పెట్టాలి. బొబ్బిలిలో పొల్లూరి బుల్లెమ్మ వాళ్ల అబ్బాయికి వైద్యం కోసం రూ.15 వేలు రుణం తీసుకుంటే వాటిని బలవంతంగా ఓటీఎస్‌ కింద కట్టించుకున్నారు. వాళ్లకు మానవత్వం ఉందా’ అని చంద్రబాబు మండిపడ్డారు. ఆ అబ్బాయి చికిత్స ఖర్చును తెదేపా భరిస్తుందని ప్రకటించారు. ఆ అబ్బాయి వైద్యానికయ్యే ఖర్చు తానుభరిస్తానంటూ మునిరత్నం అనే విశ్రాంత ప్రభుత్వోద్యోగి ముందుకు వచ్చారు.

ఓటీఎస్‌ వసూళ్లపై పౌరుల ఆగ్రహంతో వీడియో

‘మా ఇంటి పట్టాను మాకు మీరు రిజిస్ట్రేషన్‌ చేసేదేంటి? నా భార్యను మళ్లీ నాకిచ్చి పెళ్లి చేస్తాం అన్నట్టుంది మీ పద్ధతి’- ఓటీఎస్‌ కింద డబ్బు కట్టాలని, స్థలం రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని చెప్పేందుకు వచ్చిన ఉద్యోగిపై ఒక పౌరుడి ఆగ్రహం ఇది. ఇలాంటి పలువురి ఆవేదనలతో ‘ఓటీఎస్‌ వసూళ్లు... పేదల మెడకు ఉరితాళ్లు’ పేరుతో తెదేపా రూపొందించిన వీడియోను చంద్రబాబు విలేకర్ల సమావేశంలో ప్రదర్శించారు.


అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని నిర్మించాలి

అంబేడ్కర్‌ 65వ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ‘2016లో అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా అమరావతిలో 125 అడుగుల ఎత్తైన విగ్రహం పెట్టాలని నిర్ణయించాం. ఆ ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం నాశనం చేసింది’ అన్నారు. అమరావతిలో అంబేడ్కర్‌ విగ్రహం నిర్మించాలని డిమాండ్‌ చేశారు.


ప్రతి గ్రామంలో గౌరవ సభలు
 తెదేపా వ్యూహకమిటీ తీర్మానం

ఈనాడు, అమరావతి: ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో జగన్‌, వైకాపా ఎమ్మెల్యేలు మహిళలను అవమానించేలా వ్యవహరించడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గౌరవ సభలు నిర్వహించాలని, సీఎం విధానాలను ఎండగట్టాలని తెదేపా తీర్మానించింది. తెదేపా జాతీయ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సోమవారం పార్టీ వ్యూహ కమిటీ సమావేశమైంది. 17న తిరుపతిలో అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా తెదేపా సంఘీభావం తెలపాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పలువురు సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని