లోక్‌సభలో రఘురామ, మిథున్‌రెడ్డి మాటల యుద్ధం

లోక్‌సభలో వైకాపా సభ్యుడు రఘురామకృష్ణరాజు, ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి సోమవారం పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు.

Published : 07 Dec 2021 03:43 IST

 అమరావతి యాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారు: రఘురామ

అధికార పార్టీలో చేరేందుకు రఘురామ ప్రయత్నం: మిథున్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: లోక్‌సభలో వైకాపా సభ్యుడు రఘురామకృష్ణరాజు, ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి సోమవారం పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన అధికార భాజపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని మిథున్‌రెడ్డి ఆరోపించారు. లోక్‌సభ శూన్య గంటలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. ‘కోర్టు అనుమతితో గాంధేయ మార్గంలో అమరావతి రైతులు చేస్తున్న యాత్రకు పోలీసులు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారు. శాంతిభద్రతలు మా రాష్ట్రంలో ఉండాల్సిన రీతిలో ఉండటం లేదు. ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. పాదయాత్రకు మద్దతు తెలిపే వారినీ అడ్డుకుంటున్నారు’ అని చెప్పారు. ఈ సమయంలో వైకాపా సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఒకరిద్దరు ఎంపీలు పెద్దగా మాట్లాడుతుండగా ఆ పదాలను రికార్డుల్లో ఉంచాలని, వారు అసభ్య పదజాలం వినియోగిస్తున్నారని రఘురామ తెలిపారు. ఆ తర్వాత వైకాపా లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డికి సభాపతి అవకాశమిచ్చారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..‘సభలో ఆయన నిరాధార, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర అంశాన్ని సభలో లేవనెత్తారు. రఘురామకృష్ణరాజు మా పార్టీ నుంచి గెలుపొందారు. ఆయనపై రెండు సీబీఐ కేసులున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ఆయన అధికార పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నారని ప్రజలకు తెలుసు. ఆయన కేసులపై విచారణ వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణం తీసుకున్న భరత్‌ థర్మల్‌పై విచారణ జరపాలి’ అని కోరారు.

నందిగం సురేష్‌పై సభాపతికి ఫిర్యాదు

రాజధాని అమరావతి అంశంపై లోక్‌సభలో తాను మాట్లాడుతున్నప్పుడు బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ తనను అసభ్య పదజాలంతో దూషించారని ప్రధాని మోదీ, లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారిద్దరికీ లేఖలు రాశారు. ‘సురేష్‌ పలుమార్లు నన్ను దూషించారు. చంపుతానని బెదిరించారు. ఈ అంశం ఇప్పటికే ప్రివిలేజ్‌ కమిటీలో ఉన్నా.. చర్యలు ఆలస్యం కావడంతో ఆయన అవే పదాలు మళ్లీ వినియోగిస్తున్నారు’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని