భో‘జన ఘోష’!

ఆదర్శ పాఠశాలల్లోని బాలికల వసతి గృహాలకు బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో విద్యార్థులకు భోజనం అందించలేక ప్రిన్సిపాళ్లు చేతులెత్తేసున్నారు. వసతి గృహంలో ఉన్న పిల్లల్ని ఇళ్లకు

Updated : 08 Dec 2021 11:36 IST

ఆదర్శ పాఠశాలల వసతి గృహాల్లో బిల్లుల పెండింగ్‌

సరకుల సరఫరా నిలిపివేస్తున్న గుత్తేదార్లు

భోజనం అందించలేక ఇబ్బందులు

సొంత డబ్బుతో పెట్టిన ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్‌ వేటు!

వసతి గృహం నుంచి వెళ్లిపోతున్న బాలికలు

ఈనాడు, అమరావతి: ఆదర్శ పాఠశాలల్లోని బాలికల వసతి గృహాలకు బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో విద్యార్థులకు భోజనం అందించలేక ప్రిన్సిపాళ్లు చేతులెత్తేసున్నారు. వసతి గృహంలో ఉన్న పిల్లల్ని ఇళ్లకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు గుత్తేదార్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో చాలాచోట్ల సరకుల సరఫరా నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు భోజనం అందించడం కష్టంగా ఉందంటూ ఈనెల 3న జిల్లా విద్యాధికారి, ఉన్నతాధికారులకు కడప జిల్లా ఖాజీపేట ప్రిన్సిపాల్‌ సమాచారం ఇచ్చారు. దీనిపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం రాత్రి నుంచి భోజనం అందించలేమని, పిల్లల్ని ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. ఆరు నెలలుగా రూ.6 లక్షల వరకు బకాయిలు చెల్లించలేదని, గుత్తేదారు నిత్యావసర సరకులు పంపిణీ చేయలేదని, దీంతో వసతి గృహం మూసివేయాల్సి వచ్చిందని ప్రిన్సిపల్‌ సురేష్‌ తెలిపారు.  పిల్లల భోజనానికి ఆయన ఇప్పటి వరకు రూ.80వేలు సొంత డబ్బును సైతం ఖర్చు చేశారు.

ఖాజీపేటలోని ఆదర్శ వసతి గృహం

ఈ విషయంపై ‘ఈటీవీ’లో కథనం రావడంతో స్పందించిన అధికారులు మంగళవారం రాత్రి అందుబాటులో ఉన్న 30 మంది విద్యార్థినులకు భోజనం అందించారు. బుధవారం నుంచి మిగిలిన పిల్లలూ వస్తారని చెప్పారు. అందరికీ భోజనం అందించాలని ప్రిన్సిపాల్‌ను వారు ఆదేశించారు. మరోవైపు వసతి గృహాన్ని మంగళవారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఖాజీపేట ఎంపీపీ అబుబుకార్‌ సిద్ధిక్‌, వైకాపా నాయకులతో కలిసి తనిఖీ చేసి బాలికలతో మాట్లాడారు. ప్రిన్సిపల్‌పై అనేక ఆరోపణలున్నాయని ఫోన్‌ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే డిమాండు చేశారు. దీంతో ప్రిన్సిపల్‌ ఎం.సురేష్‌బాబును సస్పెండ్‌ చేస్తూ మంగళవారం ఆర్జేడీ ఎం.వెంకటకృష్ణారెడ్డి ఉత్తర్వులిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై చట్టబద్ధమైన చర్యల్లో భాగంగా సస్పెండు చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు భోజన వసతి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మెనూ ప్రకారం భోజనాలు అందించకపోవడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సస్పెండు చేసినట్లు ఆర్జేడీ తెలిపారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా అదే పాఠశాలలో పనిచేస్తున్న ఎకనమిక్స్‌ అధ్యాపకురాలు డి.విజయభారతిని నియమించారు. సొంతంగా ఖర్చు పెట్టి, ఇక  భరించలేక పిల్లలకు భోజనం పెట్టలేనని ఇళ్లకు పంపిస్తే ఆ ప్రిన్సిపాల్‌ను సస్పెండు చేయడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతూ మరోపక్క మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టలేదని సస్పెండు చేయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న వినిపిస్తోంది.

బాలికలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

ఇదీ పరిస్థితి..

రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలుండగా.. వీటికి అనుబంధంగా 145 బాలికల వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 10వేల మంది విద్యార్థినులు ఉంటున్నారు. 9 నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ చదివేవారు ఇక్కడ వసతి పొందుతున్నారు. ఒక్కో విద్యార్థినికి మెస్‌ ఛార్జీల కింద నెలకు రూ.1,500 చొప్పున చెల్లిస్తారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ నెల బిల్లును ప్రభుత్వం చెల్లించలేదు. ఇది పెండింగ్‌లో ఉండగానే సెప్టెంబరు నుంచి మళ్లీ వసతి గృహాలను పునఃప్రారంభించారు. ఒక పక్క ధరలు పెరగడం, మరోపక్క బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పెట్టుబడి పెట్టలేక గుత్తేదారులు సరకుల సరఫరా నిలిపివేస్తున్నారు. కొన్నిచోట్ల అరకొరగా సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రిన్సిపాళ్లు సొంత డబ్బులతోనో..అప్పులు చేసో పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టాల్సి వస్తోంది. ఈ అప్పుల బాధలు భరించలేక కడప జిల్లా వల్లూరు ఆదర్శ పాఠశాలలో వసతి గృహాన్ని ఇప్పటి వరకు తెరవలేదు. పిల్లల భోజనాల కోసం ఈ ప్రిన్సిపల్‌ గత ఏడాది సుమారు రూ.2.40లక్షలు ఖర్చు చేశారు. ఈ బిల్లుల డబ్బు గుత్తేదారు ఖాతాలో పడగా.. ఆయన ప్రిన్సిపాల్‌కు ఇవ్వలేదు.

నిర్వహణ ఖర్చులు లేవు..

వసతి గృహాల్లో మరుగుదొడ్లు, గదుల శుభ్రత, తాగునీటి బోర్ల మరమ్మతులు, ఇతరాత్ర ఖర్చులకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. నిర్వహణకు నిధులు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లు ఇటీవల ఉన్నతాధికారులను కోరినా దీన్ని వారు పట్టించుకోలేదు. దీంతో నిర్వహణ కోసమూ  ప్రిన్సిపాళ్లు జేబుల నుంచే డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది.


గుత్తేదారుకు బిల్లులు చెల్లించక.. బాలింతలకు ఆకలి చింత

ఆదోని ఆసుపత్రిలో భోజనం సరఫరా నిలిపివేత

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు

ఆదోని పురపాలికం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో భోజనం సరఫరాను మంగళవారం నిలిపివేశారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశారు. సుమారు రూ.10 లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. భోజనం పెట్టరని ముందుగా తెలియక బాలింతలు ఎంతో ఇబ్బందిపడ్డారు. 50 మంది వరకు హోటళ్ల నుంచి తెప్పించుకొని తిన్నారు. మూడు పూటలా భోజనాలకు ఒక్కొక్కరికీ రూ.300 ఖర్చయిందని, దూర ప్రాంతాల నుంచి వచ్చామని, తమను ఎవరూ పట్టించుకోలేదని ఉరుకుంద గ్రామానికి చెందిన ఉష వాపోయారు. సమస్యను ఆసుపత్రి పర్యవేక్షకురాలు మాధవీలత దృష్టికి తీసుకెళ్లగా భోజనం సరఫరా నిలిపివేస్తున్నట్లు గుత్తేదారు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆదోని ఆసుపత్రిలో 50 పడకలున్నాయి. నిత్యం 10 నుంచి 15 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల కేంద్రమూ ఉంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని