ఒకటో తేదీనే జీతాలివ్వాలని అడగాల్సిన పరిస్థితి

ప్రభుత్వోద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని అడగాల్సిన పరిస్థితి తన 40 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని ఏపీ ఐకాస ఛైర్మన్‌, ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆవేదన

Published : 08 Dec 2021 04:18 IST

- ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

ఈనాడు, విశాఖపట్నం - న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌: ప్రభుత్వోద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని అడగాల్సిన పరిస్థితి తన 40 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని ఏపీ ఐకాస ఛైర్మన్‌, ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్‌సీపై సీఎం జగన్‌ ఇటీవల తిరుపతిలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని... మరి మిగతా డిమాండ్ల పరిష్కారం మాటేంటని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులను అనేకసార్లు విన్నవించినా వారి నుంచి స్పందన కొరవడిందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రెండోదశ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నం, కాకినాడల్లో మంగళవారం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. బండి శ్రీనివాసరావు ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ఆ సంఘాలకు పీఆర్‌సీ, డీఏలు వద్దా?

కాగితాలపైనే ఉన్న కొన్ని ఉద్యోగ సంఘాలు... ఉనికి చాటుకునేందుకు ఉద్యమానికి దూరంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నాయి. ఆయా సంఘాలకు పీఆర్‌సీ, డీఏలు వద్దా? మా డిమాండ్లన్నీ నెరవేరిస్తే ఉద్యమాన్ని మధ్యలోనే ఆపేయడానికీ మేం సిద్ధం. ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేస్తాం. లేకుంటే ప్రకటించిన కార్యాచరణ మేరకు ఉద్యమం కొనసాగిస్తాం.

పీఆర్‌సీ నివేదికను ఎందుకు దాస్తున్నారో?

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ తొలి సమావేశంలోనే మాకు పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని కోరాం. రెండురోజుల్లో ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకూ ఆ నివేదిక బయటపెట్టలేదు. దాన్ని ఎందుకు దాస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంక్రిమెంట్లు, గ్రాట్యుటీ, అద్దెభత్యం.. ఇలాంటి అంశాలు తెలుసుకునేందుకు ఆ నివేదిక మా చేతికి ఇవ్వటం సంప్రదాయం. కానీ నివేదిక మా చేతికి ఇవ్వకుండానే కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని