ఆ టోపీ పెడితే ఉద్యోగం గోవిందా

స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కాదు... ఇప్పటికీ తిరుగులేని భారతీయ స్వదేశీ బ్రాండ్‌ ఏదైనా ఉందంటే అది గాంధీ టోపీనే! మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అది అందరినీ ఆకర్షించిందంటే అతిశయోక్తి కాదు.

Updated : 08 Dec 2021 05:15 IST

స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కాదు... ఇప్పటికీ తిరుగులేని భారతీయ స్వదేశీ బ్రాండ్‌ ఏదైనా ఉందంటే అది గాంధీ టోపీనే! మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అది అందరినీ ఆకర్షించిందంటే అతిశయోక్తి కాదు. జాతీయోద్యమంలో గాంధీటోపీని చూస్తేనే బ్రిటిష్‌వారికి కంపరం పుట్టేది. ఇంతకూ దీని వెనకాల చరిత్ర ఏంటి?

హాత్మా గాంధీ ధరించిన కారణంగా గాంధీటోపీగా పేరొంది... సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో (1920-22) వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అంతా దీన్నే అనుసరించటం ఆరంభించారు. ఎటు చూసినా గాంధీ టోపీలు ధరించి నిరసనలు, ఆందోళనలు చేసేవారు. మామూలు సమయాల్లోనూ... కాంగ్రెస్‌వాదులు, గాంధేయవాదులు ఈ టోపీలతోనే కన్పించేవారు. భారతీయ సాంస్కృతిక ప్రతీకగానే కాకుండా.... విదేశీకి వ్యతిరేకంగా తయారైన స్వదేశీ ఉత్పత్తిగా ఈ టోపీ మారింది. పట్టణాలు, గ్రామీణం అనే తేడా లేకుండా అందరూ గాంధీ టోపీని ఓ స్వాభిమాన పతాకగా చూశారు. ప్రజలు దీన్ని తమంతట తామే తయారు చేసుకునేవారు. లేదంటే రాజకీయ సభల వద్ద కొనుక్కునేవారు. అలా... భారతీయుల రోజువారీ ఆహార్యంలో గాంధీటోపీ చేరిపోయింది.

ఆంక్షలు పెట్టినా...
విదేశీ వస్తువులు, దుస్తులు, ఫ్యాషన్లతో భారతీయులను ప్రభావితులను చేస్తూ, దేశీయ దుస్తులను ధరించటం వెనకబాటుకు నిదర్శనమనే భావనను, ఆత్మన్యూనతను నింపుతున్న బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఈ గాంధీటోపీ కంపరంగా మారింది. అచిరకాలంలోనే జాతీయోద్యమానికి ప్రతీకగా మారిన ఈ టోపీని విప్లవ వస్తువుగా పరిగణించిన బ్రిటిష్‌ ప్రభుత్వం దాన్ని నిషేధించాలని చూసింది. ఈ టోపీ ధరించిన ప్రభుత్వ ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించారు. జరిమానాలు విధించారు. కొన్నిచోట్ల వారిని కొట్టారు కూడా. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ గాంధీ టోపీలు, ఖద్దరు దుస్తులు ధరించటానికి వీల్లేదంటూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం ఎంతగా ఆంక్షలు విధించినా గాంధీ టోపీ సృష్టించిన ప్రభంజనం మామూలుగా సాగలేదు. గాంధీజీతో విభేదించిన సుభాష్‌ చంద్రబోస్‌లాంటి వారు కూడా ఆ టోపీని ధరించారు. స్వాతంత్య్రానంతరం కూడా తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సహా చాలా మంది గాంధీటోపీ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఇప్పటికీ ఆమ్‌ ఆద్మీపార్టీ నేత కేజ్రీవాల్‌ దీనితో కనిపిస్తుంటారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌ల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ టోపీని సామాన్యులు, రైతులు ఇప్పటికీ ధరిస్తూ ఉంటారు.


వచ్చిందెలా..

లా ఇటు భారతీయుల్ని, నాడు బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసిన గాంధీ టోపీ ఇంతకూ ఎలా పుట్టిందంటే మాత్రం భిన్న కథనాలున్నాయి. భారత్‌లో జాతీయోద్యమానికి ముందు దక్షిణాఫ్రికాలో జాతివివక్షపై పోరాడే సమయంలో జైలు శిక్ష అనుభవించారు గాంధీజీ. ఆ సమయంలో ఆఫ్రికన్‌ ఖైదీలను నీగ్రోలుగా (భారతీయులను కూడా ఇదే కోవలోకి పరిగణించేవారు) వర్గీకరించేవారు. వారందరికీ జైలులో ఒకేరకమైన టోపీ ఉండేదని.... అక్కడి నుంచి వచ్చిందే గాంధీ టోపీ అనేది ఆయన స్నేహితుడు హెన్రీ పొలాక్‌ అభిప్రాయం. 1919లో రాంపూర్‌ సంస్థానం నవాబు సయ్యద్‌ హమీద్‌ అలీఖాన్‌ బహదూర్‌ను కలవటానికి వెళ్లారు గాంధీజీ. అప్పట్లో నవాబును కలిసేవారు తల కనిపించకుండా టోపీ పెట్టుకోవాల్సిన సంప్రదాయం ఉండేది. అందుబాటులో ఉన్నదేదీ గాంధీజీకి సరిపోకపోవటంతో... అబాదీ బేగమ్‌ అనే మహిళ అప్పటికప్పుడు ఆయనకు ఓ టోపీని కుట్టి ఇచ్చారని... అదే గాంధీటోపీగా పేరొందిందని మరో వాదన ఉంది. అయితే... ప్రముఖ సాహిత్యకారుడు, గాంధేయవాది, సంఘసంస్కర్త దత్తాత్రేయ బాలక్రిష్ణ కలేల్కర్‌కు రాసిన ఓ లేఖలో... ఈ టోపీకి స్ఫూర్తి కశ్మీరీ టోపీ అంటూ మహాత్ముడు పేర్కొనటం గమనార్హం. గాంధీజీ ఈ టోపీ ధరించి కన్పించిన సందర్భాలు చాలా తక్కువే కావటం కొసమెరుపు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని