Published : 09/12/2021 03:16 IST

కేంద్ర నిధులను మళ్లించనివ్వొద్దు

అవి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి

సభలో కోరిన కనకమేడల రవీంద్రకుమార్‌

ఈనాడు, దిల్లీ : కేంద్రం వివిధ పథకాలకు ఇచ్చిన నిధులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇష్టానుసారంగా మళ్లిస్తూ దుర్వినియోగం చేస్తోందని తెదేపా రాజ్యసభాపక్ష నేత కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని తన ప్రాయోజిత పథకాల నిధులను మళ్లించకుండా తగిన నిర్దేశాలు జారీచేసి, రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్థిక అరాచకత్వాన్ని ఆపాలని కోరారు. బుధవారం ఆయన రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం విభిన్న సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో నిధులు అందిస్తోంది. ఆ నిధులను కేటాయించిన పనులకే ఉపయోగించాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులను మళ్లించి ఇతర పథకాల కోసం ఉపయోగించుకుంటున్నట్లు నాకు తెలిసింది. ఏపీలో దాదాపు 40 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమల్లో ఉన్నాయి. ఉపాధి హామీ పథకానికి కేంద్రం విడుదల చేసిన నిధుల్లో దాదాపు రూ.4 వేల కోట్లను మళ్లించింది. దానివల్ల ఇప్పటికీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. కోర్టు జోక్యం చేసుకుంటే కొన్ని బిల్లులు మాత్రం చెల్లించింది. ఇప్పుడు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ నిధులనూ మళ్లించింది. దానివల్ల ఎస్సీ ప్రజల సంక్షేమం దెబ్బతింటోంది. సమగ్రశిక్ష అభియాన్‌కు చెందినవీ రాష్ట్రం తన పథకాలకు మళ్లించుకుంటోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను రాష్ట్రం సొంత పథకాలకు మళ్లించుకొని, స్వీయ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నట్లు కేంద్ర మంత్రి ఇటీవల పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర నిధులు దుర్వినియోగం భారీఎత్తున జరుగుతున్నట్లు కూడా కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. అయినా.. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ప్రమాదకరం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు తరచూ మారుతుంటాయి. ఈరోజు ఒక ప్రభుత్వం ఉంటే రేపు మరో ప్రభుత్వం రావొచ్చు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలి. కానీ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు ఇచ్చిన నిధులనూ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా మళ్లించింది. ఏఐడీబీ బాండ్ల ద్వారా రహదారుల నిర్మాణం కోసం సేకరించినవి, ఇటీవల ఎన్టీఆర్‌ వైద్యవిశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లను, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన రూ.1,776 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మళ్లించొద్దని ఆదేశించాలి’’ అని కనకమేడల విజ్ఞప్తి చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌లో 2020-21 విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా? అని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్నించగా, ప్రస్తుతం ఆ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు.


ఏపీకి ఆరేళ్లలో రూ.40,054 కోట్ల ‘ఉపాధి’ నిధులు

ఈనాడు, దిల్లీ: ఉపాధి హామీ పథకం కింద గత ఆరేళ్లలో ఏపీకి రూ.40,054.54 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాద్వీ నిరంజన్‌ జ్యోతి తెలిపారు. బుధవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2016-17లో రూ.3,940.21 కోట్ల మేర విడుదల చేసి ఆ తర్వాతి సంవత్సరాల్లో వరుసగా రూ.5,127.63 కోట్లు, రూ.6,684.54 కోట్లు, రూ.7,311.48 కోట్లకు చేరినట్లు చెప్పారు. 2020-21లో గరిష్ఠంగా రూ.10,365.48 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. 2021-22లో డిసెంబరు 2 వరకు రూ.6,625.20 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఎమ్మెస్పీ చట్టబద్ధతపై జేపీసీ ఏర్పాటు చేయాలి

పంటల కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీ) చట్టబద్ధత కల్పించే విషయంలో సంబంధిత భాగస్వాములతో చర్చించేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేయాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ జీవో అవర్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 23 వ్యవసాయ ఉత్పత్తులకు ఎమ్మెస్పీ ప్రకటిస్తే ఏపీ ప్రభుత్వం అదనంగా మరో 24 ఉత్పత్తులకు ఎమ్మెస్పీ ఇస్తోందని తెలిపారు. జాతీయ స్థాయిలోనూ అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో క్షేత్ర స్థాయిలోని సవాళ్లపై స్పష్టతకు రైతులు, రైతు సంఘాలతో విస్తృత సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సమస్యలపై భాగస్వాముల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జేపీసీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని