Published : 09/12/2021 03:16 IST

జన హారతులు.. ఘన స్వాగతాలు

రాయలసీమలో అమరావతి రైతుల మహాపాదయాత్రకు విశేష మద్దతు

చింతలపాలెం నుంచి శ్రీకాళహస్తికి సాగుతున్న పాదయాత్ర

ఈనాడు, తిరుపతి: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు రాయలసీమ జనం బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామగ్రామాన రైతులు, యువత, మహిళలు... యాత్రలో పాల్గొంటున్న వారికి ఘన స్వాగతం పలుకుతున్నారు. చిత్తూరు జిల్లాలో సాగుతున్న పాదయాత్రకు సీమలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి సంఘీభావం తెలిపారు. నంద్యాలకు చెందిన మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌తోపాటు పలువురు ముస్లిం సోదరులు శ్రీవేంకటేశ్వరస్వామి రథం ముందు నమాజు చేసి పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో కలిసి యాత్ర పాల్గొన్నారు. 

నారాయణ సంఘీభావం

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఇటీవల ఆయన కాలుకు దెబ్బతగిలింది. కాలుకు కట్టుతో ఉన్న ఆయన పాదయాత్రలోని శ్రీవేంకటేశ్వరస్వామి రథంపై కూర్చుని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పోలీసులు అనుమతించకపోయినా 17న బహిరంగసభ జరిగి తీరుతుందన్నారు. తెదేపా చిత్తూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానితోపాటు జేడీ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


పాదయాత్రకు మద్దతు తెలుపుతున్న పులివెందుల అన్నదాతలు

పులివెందుల నియోజకవర్గం నుంచి..

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లికి చెందిన పలువురు రైతులు మహాయాత్రలో పాల్గొన్నారు. అమరావతికి మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

శ్రీకాళహస్తిలో ఆంక్షలు

శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం చేపట్టనున్న పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. బుధవారం యాత్ర జింగిలిపాలెం దాటాక తిరుపతి అర్బన్‌ ఇన్‌ఛార్జి ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు...  అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి, కో కన్వీనర్‌ తిరుపతిరావులను పిలిచి మాట్లాడారు. శ్రీకాళహస్తి మాడవీధుల్లో పాదయాత్ర వల్ల  శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున విరమించుకోవాలని, దేవస్థానంలో దర్శనం చేసుకునేందుకు అభ్యంతరం లేదన్నారు. శ్రీకాళహస్తిలో యథావిధిగా యాత్ర కొనసాగుతుందని పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు.


కాలుకు కట్టుతో కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ


రైతుల బాధ ముందు నాదెంత!


పాదయాత్రలో బత్తయ్య

ఒక్క పైసా తీసుకోకుండా రాజధాని ఏర్పాటుకు వేల ఎకరాలు ఇచ్చి.. ఇప్పుడు ప్రజల భవిష్యత్తు కోసం మహాపాదయాత్ర చేస్తున్న రైతుల బాధ ముందు తనది ఎంతని వరదయ్యపాళెం మండలం సంతవెల్లూరుకు చెందిన రైతు పాటి బత్తయ్య పేర్కొన్నారు. వికలాంగుడైన బత్తయ్య మహాపాదయాత్రకు మద్దతుగా వెంకటగిరి నుంచి నడుస్తూ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడుతూ.. ‘వేల ఎకరాలు ఇచ్చిన రైతుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. వారిని తలచుకుంటే నా గుండె చెరువవుతోంది. నాకు ఇటీవల వెన్నెముక ఆపరేషన్‌ అయింది. కరోనాతో ఇబ్బందులు పడ్డాను. అమరావతినే కొనసాగించాలంటూ పట్టుదలగా సాగుతున్న రైతుల ఇబ్బంది ముందు నా బాధ చిన్నది అనిపించింది. రైతులు, మహిళలు వందల కిలోమీటర్లు నడుస్తుంటే నేను కొంతదూరమైనా వారితో సాగకపోతే ఎలా... అనిపించింది. తిరుమల వరకు రైతులతో కలిసి  పాదయాత్ర కొనసాగిస్తా’ అని చెప్పారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని