సైనిక సంస్కరణలకు శరాఘాతం!

భారత తొలి త్రిదళాధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌- సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆకస్మిక మరణంతో దేశంలో సైనిక సంస్కరణల ప్రక్రియకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. త్రివిధ దళాల పోరాట సామర్థ్యానికి మరింత వన్నెలద్దేందుకు, వనరుల సమర్థ వినియోగానికి ఉద్దేశించిన ‘థియేటరైజేషన్‌’ ప్రణాళిక ఆయన ఆధ్వర్యంలోనే సిద్ధమవుతోంది

Updated : 09 Dec 2021 05:18 IST

రావత్‌ మరణంతో ఉమ్మడి విభాగాల ఏర్పాటుకు ఎదురుదెబ్బ  

దిల్లీ: భారత తొలి త్రిదళాధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌- సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆకస్మిక మరణంతో దేశంలో సైనిక సంస్కరణల ప్రక్రియకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. త్రివిధ దళాల పోరాట సామర్థ్యానికి మరింత వన్నెలద్దేందుకు, వనరుల సమర్థ వినియోగానికి ఉద్దేశించిన ‘థియేటరైజేషన్‌’ ప్రణాళిక ఆయన ఆధ్వర్యంలోనే సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాప సందేశం కూడా దీనికి దర్పణం పడుతోంది. తొలి సీడీఎస్‌ హోదాలో రక్షణ సంస్కరణలు సహా విభిన్న అంశాలపై రావత్‌ కసరత్తు చేశారని ఆయన కొనియాడారు. దాదాపు రెండేళ్ల కిందట దేశ తొలి త్రిదళాధిపతిగా రావత్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ హోదా ప్రధాన ఉద్దేశం.. సైన్యం, నౌకాదళం, వాయుసేనలతో ఉమ్మడి విభాగాల (థియేటర్‌ కమాండ్స్‌)ను ఏర్పాటు చేయడం. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద సైనిక సంస్కరణ కానుంది.

సంక్లిష్ట సమయంలో బాధ్యతలు..
సంస్కరణలు, థియేటరైజేషన్‌ దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్న తరుణంలో ఆయన సీడీఎస్‌గా నియమితులయ్యారు. కొవిడ్‌-19 మహమ్మారి, ఇతర అంశాల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ దెబ్బతినడం, అదే సమయంలో సరిహద్దుల్లో చైనా దూకుడు పెంచడం వంటి అంశాల నేపథ్యంలో.. ప్రభుత్వం కేటాయించిన కొద్దిపాటి నిధులతో సైనిక ఆధునికీకరణ, ఇతర అంశాలకు మధ్య సమతౌల్యం చేసుకోవడం త్రిదళాధిపతికి కత్తిమీద సామైంది.
* తన విధి నిర్వహణలో అత్యంత సంక్లిష్ట పరిస్థితులను రావత్‌ ఎదుర్కొన్నారు. 2017 జూన్‌లో ఆయన సైన్యాధిపతిగా ఉన్న సమయంలోనే చైనా సైన్యంతో ఏర్పడిన డోక్లామ్‌ ప్రతిష్టంభనను సమర్థంగా ఎదుర్కొన్నారు.
* బుర్హాన్‌ వాని అనే ఉగ్రవాది హతంతో జమ్మూ-కశ్మీర్‌లో అశాంతి ప్రజ్వరిల్లగా, అక్కడి ముష్కరులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదీ రావత్‌ హయాంలోనే.

సీనియర్లను తోసిరాజని..
సైన్యంలో రావత్‌ ఎదుగుదల శరవేగంగా జరిగింది. సీనియార్టీలో ముందున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ ప్రవీణ్‌ బక్షి, లెఫ్టినెంట్‌ జనరల్‌ పీఎం హరీజ్‌లను తోసిరాజని మోదీ ప్రభుత్వం ఆయనను ఆర్మీ చీఫ్‌గా ఎంపిక చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని