రాజకీయ హత్యల.. రావణకాష్ఠం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హత్యలు మళ్లీ పెచ్చరిల్లుతున్నాయి. తమ ఆధిపత్యానికి అడ్డంగా ఉన్నారంటూ ప్రత్యర్థులను అంతం చేస్తున్నారు. ప్రతిపక్ష తెదేపా నాయకులే లక్ష్యంగా ఈ వరుస హత్యలు జరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా గుండ్లపాడులో తెదేపా నాయకుడు తోట చంద్రయ్య హత్యతో ఇలాంటి దారుణాలు మరోమారు చర్చనీయాంశం అయ్యాయి. 

Updated : 14 Jan 2022 06:53 IST

ఆధిపత్యానికి అడ్డంగా ఉన్నారని అంతం చేస్తున్నారు
ప్రతిపక్ష తెదేపా నాయకులే లక్ష్యంగా వరుస హత్యలు
వెంటాడి చంపుతున్న ఘోరం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హత్యలు మళ్లీ పెచ్చరిల్లుతున్నాయి. తమ ఆధిపత్యానికి అడ్డంగా ఉన్నారంటూ ప్రత్యర్థులను అంతం చేస్తున్నారు. ప్రతిపక్ష తెదేపా నాయకులే లక్ష్యంగా ఈ వరుస హత్యలు జరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా గుండ్లపాడులో తెదేపా నాయకుడు తోట చంద్రయ్య హత్యతో ఇలాంటి దారుణాలు మరోమారు చర్చనీయాంశం అయ్యాయి.  రాజకీయంగా అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా వేటాడి, వెంటాడి మరీ చంపిన ఉదంతాలు గత రెండున్నరేళ్లలో అనేకం చోటుచేసుకున్నాయి. ఫలితంగా పచ్చని పల్లెలు పగలు, ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసులు వాటిని నిలువరించట్లేదని, కొందరి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా తగిన భద్రతా చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

వరుస హత్యలు.. చర్యలు శూన్యం
* కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో తెదేపా నాయకులు వడ్డి నాగేశ్వరరెడ్డి, వడ్డి ప్రతాప్‌రెడ్డిలను వాహనంతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికి కిరాతకంగా హతమార్చారు. సోదరుడి కర్మకాండల కోసం శ్మశానానికి వెళ్లి వస్తుండగా దుండగులు వారిని వాహనంతో ఢీకొట్టారు. ఆ బృందం చెల్లాచెదురు కాగానే హత్య చేశారు. గతేడాది జూన్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వైకాపా నాయకులే ఈ హత్యలు చేశారని అప్పట్లో బాధితుల కుటుంబసభ్యులు ఆరోపించారు.
* కడప జిల్లాలో తెదేపా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను 2020 డిసెంబరులో కొందరు హత్య చేశారు. ఆయన్ను ఇంటినుంచి బయటకు రప్పించి కళ్లల్లో కారం కొట్టి, చుట్టుముట్టి వేట కొడవళ్లతో నరికేశారు. ఈ ఘటన జరగటానికి అయిదు రోజుల ముందు ఆయన ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ వీడియోలు రూపొందించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తన భర్త హత్యకు ప్రజాప్రతినిధి, ఆయన బావమరిదే కారణమంటూ సుబ్బయ్య భార్య అపరాజిత అప్పట్లో ఆరోపించారు.
* గుంటూరు జిల్లా దాచేపల్లిలో తెదేపా నేత పురంశెట్టి అంకులును గతేడాది జనవరి 3న కొందరు హతమార్చారు. అంకులుకు ఒక ఫోన్‌కాల్‌ రావటంతో రాత్రి 7 గంటలకు దాచేపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్దకు ఒంటరిగా వెళ్లారు. ఆయన తిరిగి రాకపోవటంతో కారు డ్రైవర్‌ అపార్ట్‌మెంట్‌ లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్న అంకులు కనిపించారు.

సమగ్ర విచారణేది?
ఎవరైనా హత్యకు గురైనప్పుడు.. బాధిత కుటుంబసభ్యులు ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేస్తే పోలీసులు వారికి నోటీసులిచ్చి విచారించి, వాస్తవాలు తేల్చాలి. రాజకీయ హత్యల విషయంలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరి మీదైనా ఆరోపణలు చేస్తూ, ఫిర్యాదులిచ్చినా.. వారిని నిందితులుగా చేర్చటం లేదు. ప్రతిపక్ష నాయకుల హత్య కేసుల్లో అధికార పార్టీ వారు అనుమానితులుగా ఉంటే.. వారి పాత్రను నిగ్గు తేల్చేలా దర్యాప్తు సాగించట్లేదన్న విమర్శలున్నాయి.

హత్యోదంతాలు... ఇవిగో తార్కాణాలు
* తెదేపా నాయకుడు మంజుల వడ్డె సుబ్బారావును 2019 డిసెంబరు 17న కర్నూలు జిల్లా బెలుం గుహల వద్ద ప్రత్యర్థులు హతమార్చారు. కత్తితో నరికి, తలపై బండరాయితో మోది చంపారు. ఈ కేసులో వైకాపా నాయకులు నిందితులుగా ఉన్నారు.
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పెదగౌడపాలేనికి చెందిన తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఆ పార్టీ తరఫున స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన తాతా సాంబశివరావు (33) 2020 జులై 1న దారుణ హత్యకు గురయ్యారు.
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం అంబాపురంలో దోమతోట విక్రమ్‌ (32) అనే తెదేపా కార్యకర్త 2020లో హత్యకు గురయ్యారు. వైకాపా వర్గీయుల దాడిలో ఆయన  చనిపోయారని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.
* ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి ఎస్సీ కాలనీలో లక్కెపోగు సుబ్బారావుపై కొంతమంది మారణాయుధాలతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
* తెదేపా నాయకుడు ఉమాయాదవ్‌ను గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన ఇంటి ముందే కత్తులతో నరికి కొందరు చంపారు. 2019 జూన్‌లో  ఈ ఘటన జరిగింది.
* కర్నూలు జిల్లా నిడ్జూరులో తెదేపా కార్యకర్త శ్రీనివాసరావును గతేడాది మే నెలలో కొందరు హతమార్చారు. తమ కుటుంబం ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి వైకాపా నాయకులు తమ కుటుంబసభ్యుల్ని వెంటాడారని.. చివరికి శ్రీనివాసరావును చంపేశారని అప్పట్లో బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.

పాత కక్షలు, వ్యక్తిగత అంశాలే కారణమని తేల్చేస్తున్నారు
రాజకీయం ఆధిపత్యం చాటుకునేందుకు జరుగుతున్న హత్యలకూ పాతకక్షలు, వ్యక్తిగత అంశాలు, కుటుంబ వివాదాలే కారణాలంటూ పోలీసులు తేల్చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయంగా ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవాలన్న కసితో అధికార పార్టీ నాయకులే ఈ ఘాతుకాలు చేయిస్తున్నారని, పోలీసులు వారి ఒత్తిళ్లకు తలొగ్గి సూత్రధారుల్ని వదిలేస్తున్నారని ప్రతిపక్ష తెదేపా విమర్శిస్తోంది. ఉదాహరణకు నందం సుబ్బయ్య హత్య కేసులో ఎమ్మెల్యేకు సంబంధం ఉన్నట్లు నిర్ధారణ కాలేదని ఘటన జరిగిన రోజునే కడప జిల్లా ఎస్పీ అంబురాజన్‌ ప్రకటించారు. పురంశెట్టి అంకులు హత్యకు రాజకీయ కారణాలేవీ లేవని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్‌ గున్నీ చెప్పారు. నాగాయలంక మండలంలో హత్యకు పాతకక్షలే కారణమని అక్కడి డీఎస్పీ చెప్పారు. సమగ్ర దర్యాప్తు చేయకుండానే ఆ హత్యలతో అధికార పార్టీ నాయకులకు సంబంధం లేదని చెప్పడమేంటని ప్రతిపక్ష తెదేపా   ప్రశ్నిస్తోంది.
32 నెలల్లో 33 మంది..: తెదేపా
గత 32 నెలల్లో 31 మంది తెదేపా నాయకులు, కార్యకర్తలు హత్యకు గురయ్యారని, మరో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని ఆ పార్టీ చెబుతోంది. పది రాజకీయ హత్యల ఉదంతాలతోపాటు మరో 23 మంది కూడా రాజకీయ హత్యలకు గురైనట్లు పేర్కొంటోంది. ఆ జాబితా ఇలా...
* చంద్రశేఖర్‌ - ధర్మవరం, అనంతపురం జిల్లా
* చింతా భాస్కర్‌రెడ్డి - వీరాపురం, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా
*రాజప్ప - పత్యాపురం, బత్తలపల్లి మండలం, అనంతపురం జిల్లా
* బత్తుల సుబ్బులు - తంగెడ, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా
*చిట్టిబోయిన వెంగయ్య - మినగల్లు,  అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా
* పద్మ - వివస్త్రను చేసి ప్రాణాలు తీసుకునేలా చేశారు- రుద్రమాంబపురం, చినగంజాం మండలం, ప్రకాశం జిల్లా
*దత్తి వెంకటరావు - పెదపెంకి, బలిజిపేట మండలం, విజయనగరం జిల్లా
*కేళావతు రాజానాయక్‌ - భట్రుపాలెం, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా
* సయ్యద్‌ జాన్‌ - తంగెడ, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా
* మేలుపాక గోపి - తొట్టంబేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గం, చిత్తూరు జిల్లా
* తమ్మిశెట్టి నీలకంఠబాబు - నారాయణపురం, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా
* గురప్ప - నరసాపురం, కాశినాయన మండలం, కడప జిల్లా
* భరత్‌యాదవ్‌ - తిరుపతి, చిత్తూరు జిల్లా
* ఊటుకూరి వీరబాబు- మండపం,శంఖవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా
* అరెద్దుల కోటయ్య - జంగమహేశ్వరపాడు, దుర్గి మండలం, గుంటూరు జిల్లా
* సబ్బెళ్ల శ్రీనివాసరెడ్డి - గొల్లలగుంట,   జగ్గంపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా
* అర్జున్‌ నాయక్‌ (అనుమానాస్పద మృతి) - కొత్తూరు గ్రామం, బల్లికురవ, ప్రకాశం జిల్లా
* ఆదినారాయణ (అనుమానాస్పద మృతి) - భైరవ్‌నగర్‌, అనంతపురం జిల్లా
* గరికపాటి కృష్ణారావు * పిచ్చయ్య యాదవ్‌
* పాలకొల్లు సొమయ్య - గొల్లలమంద, ఎ.కొండూరు, కృష్ణా జిల్లా
* గొల్ల గోపాల్‌ - మలకాపురం, రాయదుర్గం మండలం, అనంతపురం జిల్లా
* ఖాదర్‌ బాషా (మద్యంలో విషం పోసి చంపారు) - పిన్నెల్లి, గుంటూరు జిల్లా  

- ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని