‘ఆర్థిక’ లోపాలున్న రాష్ట్రాలపై చర్యలుండాలి

సక్రమమైన ఆర్థిక నిర్వహణ పాటించకుండా రుణం కోసం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను దాటేస్తున్న రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం పాలసీ రూపొందించాలని భాజపా నేత లంకా దినకర్‌ కోరారు.

Published : 15 Jan 2022 02:44 IST

కేంద్రం ప్రత్యేక పాలసీని రూపొందించాలి
కేంద్ర ఆర్థిక మంత్రికి లంకా దినకర్‌ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సక్రమమైన ఆర్థిక నిర్వహణ పాటించకుండా రుణం కోసం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను దాటేస్తున్న రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం పాలసీ రూపొందించాలని భాజపా నేత లంకా దినకర్‌ కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్ని పక్కదారి పట్టిస్తూ వ్యక్తుల పేర్లతో ప్రచారం చేసుకుంటున్న రాష్ట్రాలపై చర్యలు తీసుకునేలా నిబంధనలు ఉండాలని విన్నవించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోని వెనుకబాటును పారదోలేందుకు ప్రత్యేక పారిశ్రామికవాడల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుక్రవారం లేఖ రాశారు. ‘2022-23 బడ్జెట్‌ రూపకల్పన ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రగతిని కొనసాగిస్తూ ప్రధాని మోదీ ప్రకటించిన గతిశక్తి కేంద్రీకృతంగా ఉండాలి. ఎన్‌పీఏలు నుంచి బయటపడిన, బ్యాంకుల్లో ఓటీఎస్‌ చేయించుకున్న చిన్న, మధ్య, తరహా పరిశ్రమల ఆస్తుల విలువ వ్యాపారానికి అనుగుణంగా ఉంటే వాటికి రుణ సదుపాయాలు కల్పించాలి. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ వచ్చేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు తక్కువ ధరకు అందేలా విధానాలు రూపొందించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని