అమరావతి సాధించే వరకు పోరాటమే

ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల గుండెలు అశాంతితో రగులుతున్నాయని రాజధాని రైతులు మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల అభిప్రాయం మేరకు అమరావతిని ఒకే రాజధానిగా

Published : 15 Jan 2022 02:45 IST

స్పష్టం చేసిన రాజధాని రైతులు
మందడంలో ‘అమరావతి ఉద్యమ సెగలు’ కార్యక్రమం
భోగి మంటల్లో ఏసీసీఎంసీ ప్రతిపాదిత కాగితాలు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తుళ్లూరు గ్రామీణం: ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల గుండెలు అశాంతితో రగులుతున్నాయని రాజధాని రైతులు మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల అభిప్రాయం మేరకు అమరావతిని ఒకే రాజధానిగా కొనసాగించాలన్నారు. ఒంటెద్దు పోకడతో ప్రభుత్వం ముందుకుపోతే రానున్న రోజుల్లో వైకాపాకు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత రాజధాని గ్రామాల్లో సంక్రాంతి శోభ కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని కొనసాగించి న్యాయం చేయమని 759 రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. పిల్లాపాపలతో ఇంటి వద్ద పండగ చేసుకోవాల్సిన తాము వరుసగా మూడో సంవత్సరం కూడా రోడ్లపై నిరసనలు చేయాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమ సెగ ప్రభుత్వానికి తగిలే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అమరావతిని సాధించే వరకూ పండగైనా, పబ్బమైనా పోరాటంలోనేనని తెగేసి చెప్పారు. సంక్రాంతి సందర్భంగా నాలుగు రోజుల పాటు ‘సంక్రాంతి.. సమరక్రాంతి’ పేరుతో అమరావతి రాజధాని ఐకాస ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం మందడం శిబిరం వద్ద తెల్లవారుజామున భోగిమంట వేసి దాని చుట్టూ పాట పాడుతూ నిరసన తెలిపారు. అమరావతి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో రమణ బృందం గీతాలు ఆలపించింది. 19 గ్రామాలతో ప్రభుత్వం ప్రతిపాదించిన ఏసీసీఎంసీ పత్రాలను భోగి మంటల్లో తగలబెట్టి నిరసన తెలిపారు. అనంతరం ఉద్యమంలో అసువులు బాసిన రైతులు, రైతు కూలీలకు నివాళులర్పించారు. రాజధాని గ్రామాల నుంచి రైతులు, మహిళలు వేకువజామునే పెద్దఎత్తున మందడం శిబిరానికి చేరుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ మాజీ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఐకాస కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌, నాయకులు శిరీష, వరలక్ష్మి, ప్రియాంక, మల్లేశ్వరి, శ్రీదేవి, పావని, తదితరులు పాల్గొన్నారు.

* మిగిలిన రాజధాని గ్రామాలైన వెలగపూడి, అబ్బరాజుపాలెం, కృష్ణాయపాలెం, మోతడక, దొండపాడు, వెంకటపాలెం, నెక్కల్లు, తుళ్లూరు, తదితర శిబిరాల్లో భోగి మంటలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్దండరాయునిపాలెం శిబిరం ఎదుట రైతులు, రైతు కూలీలు ఐకాస జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. పలుచోట్ల దేవతల చిత్రపటాలకు పూజలు చేసి, అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని వేడుకున్నారు. తుళ్లూరులో మహిళలు గీతాపారాయణం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు