Updated : 15/01/2022 05:40 IST

Kodi Pandalu: కత్తులు ఎగిరాయి.. కట్టలు తెగాయి..

ఉభయ గోదావరి జిల్లాల్లో జోరెత్తిన కోడి పందేలు

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం, ఏలూరు; న్యూస్‌టుడే, ముమ్మిడివరం, కాట్రేనికోన, తాడేపల్లిగూడెం: తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో శుక్రవారం భోగి రోజు పెద్దఎత్తున కోడి పందేలు ప్రారంభమయ్యాయి. వీటిలో పాల్గొనడానికి ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు.  తొలి రోజు రెండు జిల్లాలో దాదాపు 420కు పైగా బరుల్లో పందేలు జరిగాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే తొలిరోజు 12 వేలకుపైగా కోడిపుంజులు మృత్యువాతపడగా.. పందేల్లో రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు చేతులు మారి ఉంటాయని సమాచారం. ఇది కాకుండా 300 వరకు గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ సుమారు మరో రూ.50 కోట్ల వరకు పందేలు కాసినట్లు అంచనా. ప్రధానంగా కోనసీమలోని కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో అన్ని హంగులతో 10కి పైగా బరులు ఏర్పాటు చేశారు. పెద్ద బరిలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల మధ్య పోటీగా రోజుకు 20 కోడి పందేలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీటికి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖులు నేతృత్వం వహిస్తున్నట్లు తెలిసింది. పందెం గెలిచిన వారికి వెండి నాణెం బహుమతిగా ఇస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే 60 కోడి పందేల్లో ఏ జిల్లా ఎక్కువగా గెలుస్తుందో వారికి ఇన్నోవా కారును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. కేవలం పెద్ద బరిలో ఒక్కో పందెం రూ.50 లక్షలకుపైగా నడుస్తోంది. పల్లంకుర్రులో అధికార పార్టీకి చెందిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కోడి పందేలను తిలకించారు.

ఫోన్లు.. డ్రోన్లు.. ఎల్‌ఈడీ తెరలు
పశ్చిమగోదావరి జిల్లాలో వర్షం పడుతుండటంతో బరులు, పందెం రాయుళ్ల కోసం నిర్వాహకులు రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్లు వేశారు. భీమవరం, సీసలి వంటి ప్రాంతాల్లో డిజిటల్‌ తెరలు ఏర్పాట్లు చేశారు. ఈసారి పందేలలో సెల్‌ఫోన్లు కీలక పాత్ర పోషించాయి. విశాలమైన బరులు ఏర్పాటు చేసిన చోట.. డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తూ వాటిని సెల్‌ఫోన్లలో షేర్‌ చేసుకొని ఎక్కడివారక్కడే పందేలు వేసుకున్నారు. పందెం డబ్బులు పేటీఎంల ద్వారా చెల్లించుకున్నారు. అలంపురం, దువ్వ, తేతలి ప్రాంతాలలో కోజా(పందెలో ఓడిన కోడి) ధర రూ.6 వేల వరకు పలికింది. కోడి పందేలు చూసేందుకు, ఆడేందుకు వచ్చిన వారితో తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లోని లాడ్జీలు నిండిపోయాయి. సాధారణంగా రూ.1200 ఉండే గది అద్దె రూ. 2 నుంచి 3 వేలు పలికాయి. కొన్నిచోట్ల అపార్ట్‌మెంట్లలో అతిథులకు ఆశ్రయం కల్పించారు. రాత్రిళ్లు కూడా జూదం నిర్వహించేందుకు వీలుగా బరుల వద్ద ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరిలో ఓ కోడి బరి నుంచి జనాల్లోకి దూకడంతో దాని కాలికున్న కత్తి వల్ల ఒకరు గాయపడ్డారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని