Budget:బడ్జెట్‌ బండికి సవాళ్లెన్నో!

అనేక సవాళ్ల మధ్య కొత్త బడ్జెట్‌ రూపకల్పనకు కసరత్తు మొదలవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనేక ప్రభుత్వశాఖలకు, సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగినా ఖర్చు అందుకు తగ్గ రీతిలో లేదు. నిధులు అందుబాటులో లేకపోవడం, ప్రతి ప్రభుత్వ శాఖలో బిల్లులు పెండింగులో

Updated : 17 Jan 2022 05:37 IST

నేటి నుంచి అధికారుల స్థాయి చర్చలు

ఈనాడు, అమరావతి: అనేక సవాళ్ల మధ్య కొత్త బడ్జెట్‌ రూపకల్పనకు కసరత్తు మొదలవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనేక ప్రభుత్వశాఖలకు, సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగినా ఖర్చు అందుకు తగ్గ రీతిలో లేదు. నిధులు అందుబాటులో లేకపోవడం, ప్రతి ప్రభుత్వ శాఖలో బిల్లులు పెండింగులో ఉండటం వంటి సవాళ్ల మధ్య పనులు ముందుకు సాగలేదు. పనులు చేసేందుకు, సరకులు సరఫరా చేసేందుకూ గుత్తేదారులు, సరఫరాదారులు వెనకడుగు వేస్తున్నారు. కరోనా అనంతరం రాష్ట్ర రాబడులు ఈ మధ్య పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా మూడోదశ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త బడ్జెట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రెండు మూడు ఆర్థిక సంవత్సరాలుగా బడ్జెట్‌ ప్రతిపాదనల మొత్తంలో పెద్దగా మార్పు లేదు. ఎప్పటికప్పుడు అంచనా పెరగాల్సి ఉన్నా ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా సవాలు వల్ల అనేక పరిమితులతో బడ్జెట్‌ రూపొందించాల్సి వస్తోందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్‌ కసరత్తు సోమవారం ప్రారంభం కాబోతోంది.
2022-23 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి నెలాఖరులోపు ఉభయసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి. ఎన్నికలు, కరోనా కారణంగా వరుసగా మూడేళ్లు తొలుత ఓటాన్‌ అకౌంట్‌ సమర్పించడమో, లేదా ఆర్డినెన్సు తీసుకురావడం వల్ల ఇటీవల నిర్దిష్ట కాలపరిమితి లోపు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభకు సమర్పించే వీలు చిక్కలేదు.
ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్‌ రూపకల్పనకు అవసరమైన ఏర్పాట్ల దిశగా ఆర్థికశాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. జనవరి 17 నుంచి 24 వరకు వారంరోజుల పాటు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సమావేశాలు ఏర్పాటుచేశారు. వచ్చే సంవత్సర బడ్జెట్‌ రూపకల్పనపై ప్రభుత్వ ఆలోచనలను - కేటాయింపులకు సంబంధించిన ఆయా శాఖల నుంచి ఉన్న డిమాండును ఆర్థికశాఖ అధికారులు స్వీకరిస్తారు. ఆయా ప్రభుత్వశాఖల ప్రాధాన్యాలు, వచ్చే ఏడాది నిధుల అవసరాలు, పథకాలకు కేటాయింపులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు - ఖర్చు తీరు, లక్ష్యాలు ఎంతవరకు అందుకున్నారు లాంటి అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చ ఉంటుంది. ఈ మేరకు సమావేశాలకు హాజరు కావాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్ని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులకు వర్తమానం పంపారు. రోజూ అయిదారు ప్రభుత్వ శాఖలతో ఈ సమావేశాలు ఉంటాయి. ప్రతిపాదనలు స్వీకరించాక మరోసారి అధికారిక స్థాయిలో సమావేశాలు ఉంటాయి. ఆ సమావేశాల్లో ఎంత మేర సర్దుకోవాల్సి ఉంటుందో చెప్పి, ఆయా ప్రభుత్వశాఖల ప్రాధాన్యాలు తెలుసుకుంటారు. తర్వాత స్థాయిలో ఆర్థికమంత్రి అన్ని ప్రభుత్వశాఖల మంత్రులతో బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చిస్తారు. అనంతరం తుది రూపు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జెండర్‌ బడ్జెట్‌, పిల్లల బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. అంతకుముందు ఎప్పటి నుంచో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ కూడా సభకు సమర్పిస్తున్నారు. 2022-23 బడ్జెట్‌లో ఆయా శాఖలకు నిధుల కేటాయింపులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రాధాన్య పథకాలు-అమలు, కేంద్ర సాయంతో అమలు చేస్తున్న పథకాలు, గ్రామీణ మౌలిక సౌకర్యాల కల్పన, విదేశీ ఆర్థిక సాయంతో చేపడుతున్న పథకాలు- పురోగతి, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఉప ప్రణాళికల అమలు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని