నరసరావుపేట రణరంగం

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్సార్‌ విగ్రహం తొలగింపు అనంతర పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తెదేపా-వైకాపా నాయకుల పోటాపోటీ ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలతో జొన్నలగడ్డ, నరసరావుపేట పట్టణం రణరంగాన్ని తలపించాయి.

Updated : 17 Jan 2022 03:16 IST

వైఎస్‌ విగ్రహం మాయంపై తమ కార్యకర్తలను అరెస్టు చేశారని తెదేపా ధర్నా
తోపులాటలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి అరవిందబాబుకు అస్వస్థత
ఆయనను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్సుపై వైకాపా కార్యకర్తల దాడి
తెదేపా రాష్ట్ర నేతల నిరసన..అరవిందబాబుకు పరామర్శ

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే-నరసరావుపేట పట్టణం: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్సార్‌ విగ్రహం తొలగింపు అనంతర పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తెదేపా-వైకాపా నాయకుల పోటాపోటీ ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలతో జొన్నలగడ్డ, నరసరావుపేట పట్టణం రణరంగాన్ని తలపించాయి. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబుపై పోలీసులు శనివారం చేయి చేసుకున్నారని, ఆయన ప్రయాణిస్తున్న అంబులెన్సుపై వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వారని తెదేపా నేతలు ఆరోపించారు. పార్టీ నాయకులు ఆదివారం ఉదయాన్నే పేటకు చేరుకుని పోలీసు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవిందబాబును పరామర్శించారు.

వివాదం ఇదీ..
వైఎస్సార్‌ విగ్రహం తొలగింపు కేసులో తెదేపా కార్యకర్తలు జొన్నలగడ్డకు చెందిన అనిల్‌, రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారిని విడుదల చేయాలని డాక్టర్‌ అరవిందబాబు శనివారం సాయంత్రం జొన్నలగడ్డ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్‌ నిలిచిపోతోందని చెప్పినా ధర్నా కొనసాగించటంతో పోలీసులు ఆయనను బలవంతంగా అక్కడి నుంచి లేవదీస్తుండగా తెదేపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఈ పెనుగులాటలో అరవిందబాబు కిందపడి, అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే పోలీసులు అంబులెన్సు రప్పించి నరసరావుపేట తరలిస్తుండగా దారిలో జొన్నలగడ్డ సాయిబాబా కాలనీ వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ దాడిలో అంబులెన్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం అరవిందబాబును ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. తెదేపా రాష్ట్ర నేతలు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, జవహర్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, సీనియర్‌ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, పిల్లి మాణిక్యాలరావు తదితరులు ఆదివారం పేటకు వచ్చి అరవిందబాబును పరామర్శించారు.

ఇద్దరి అరెస్టు... విడుదల
వైఎస్‌ విగ్రహాన్ని తొలగించిన వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని గుంటూరు-కర్నూలు రహదారిపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ధర్నా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను పట్టుకుంటామని హామీనిచ్చి డాగ్‌స్క్వాడ్‌తో జొన్నలగడ్డ, రంగారెడ్డిపాలెం గ్రామాల్లో తనిఖీలు చేయించారు. వేలిముద్రలు సేకరించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలు తీసి వెతికారు. ఆ రోజు గ్రామానికి చెందిన ఇద్దరు తెదేపా కార్యకర్తలు బైకుపై విగ్రహం వద్దకు వెళ్లినట్లు నిర్ధారించుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన అనిల్‌, రాజేష్‌ షరతులతో కూడిన బెయిలుపై ఆదివారం విడుదలయ్యారు. వారిపై 153, 379, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్‌ ఇంటివద్ద హాజరుపరచగా, ఆయన విచారించి, బెయిలు మంజూరు చేశారు.

దాడులన్నింటికీ చక్రవడ్డీ సహా చెల్లిస్తాం
వైకాపా పాలనలో తెదేపా నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న ప్రతి దాడికి భవిష్యత్తులో చక్రవడ్డీతో కలిపి చెల్లిస్తామని మాజీమంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. జొన్నలగడ్డ ఘటనపై తెదేపా ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ వైకాపా పాలనలో బీసీలపై దాడిని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. మాజీ మంత్రి జవహర్‌ మాట్లాడుతూ బలహీనవర్గాలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వైకాపా నేతలు దాడులు చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణకుమార్‌ తదితరులు మాట్లాడారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ అరవిందబాబును పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని