హరితం.. శుద్ధం.. సుస్థిరం

మరింత వ్యాపారానుకూల దేశంగా మారేందుకు భారత్‌ సంసిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇందుకోసం అవసరమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు తమ

Published : 18 Jan 2022 03:08 IST

రానున్న పాతికేళ్లు  మా వృద్ధి మంత్రాలివే

భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ తరుణమిది

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన

దిల్లీ, దావోస్‌: మరింత వ్యాపారానుకూల దేశంగా మారేందుకు భారత్‌ సంసిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇందుకోసం అవసరమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. శుద్ధ ఇంధనాలతో, హరిత వాతావరణంలో.. రానున్న పాతికేళ్లు దేశం సుస్థిర వృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అత్యుత్తమ తరుణమని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఆన్‌లైన్‌ దావోస్‌ ఎజెండా-2022 సదస్సును ఉద్దేశించి మోదీ ఈ మేరకు సోమవారం ప్రసంగించారు. ఒకప్పుడు దేశం ‘లైసెన్స్‌ రాజ్‌’గా ఉండేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన సంస్కరణలను ప్రస్తావించారు. వ్యాపారాల్లో పాలక వర్గాల జోక్యాన్ని తగ్గించేందుకు, వివిధ దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు చేసిన కృషిని తెలియజేశారు.

‘‘అంతర్జాతీయ సరఫరా గొలుసులో విశ్వసనీయ భాగస్వామిగా మారేందుకు మా దేశం నిబద్ధతతో ఉంది. ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ దృక్పథంలో భాగంగా వివిధ దేశాలకు భారత్‌ ఔషధాలు, కొవిడ్‌ టీకాలను సరఫరా చేయడం ద్వారా లక్షల మంది ప్రాణాలను కాపాడింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు భారత్‌ రికార్డు స్థాయిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను పంపిస్తోంది. మా దేశంలోనే 50 లక్షల మందికి పైగా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలవుతున్నవేళ ప్రపంచానికి సాయం చేసేందుకు ఐటీ రంగం నిరంతరాయంగా పనిచేసింది. వ్యాపారం చేయాలన్న దృక్పథం భారతీయ యువతలో కొత్త ఎత్తులకు చేరుకుంది. సరికొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో భారతీయుల సామర్థ్యం, నవకల్పనలు అంతర్జాతీయ నాయకత్వం విషయంలో దేశానికి నవోత్తేజాన్నివ్వగలవు’’ అని మోదీ పేర్కొన్నారు.

పెను సవాలుగా క్రిప్టోకరెన్సీ

ఆర్థిక వృద్ధికి విఘాతం కలగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తూనే.. ఇప్పుడు మరో దశ కొవిడ్‌ ఉద్ధృతిని భారత్‌ అప్రమత్తంగా ఎదుర్కొంటోందని మోదీ అన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితులతో పాటు రాబోయే 25 ఏళ్ల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని మేం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. వచ్చే పాతికేళ్లలో మా వృద్ధి శుద్ధ ఇంధనాల ఆధారంగా, హరితమయంగా, సుస్థిరంగా ఉండబోతోంది. ప్రపంచం మా మీద పెట్టుకున్న అంచనాలను అందుకుంటాం’’ అని పేర్కొన్నారు. అందరూ ‘ప్రొ ప్లానెట్‌ పీపుల్‌ (పి-3)’ విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. వాడిపారేయడం, క్రిప్టోకరెన్సీ వంటివి ప్రస్తుతం ప్రపంచానికి పెను సవాళ్లుగా అవతరించాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క దేశమో కాకుండా.. కలసికట్టుగా వాటిని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని