కంప్యూటర్ల ద్వారానే అనుసంధానం

కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా మళ్లీ వీడియో ద్వారా రోజువారీ కేసుల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... న్యాయవాదులకు కీలక సూచనలు చేసింది. కొందరు మొబైల్‌ ఫోన్ల ద్వారా విచారణలో

Published : 18 Jan 2022 03:08 IST

‘వీడియో విచారణ’ విషయంలో న్యాయవాదులకు సుప్రీంకోర్టు నిర్దేశం

ఫోన్లతో వస్తున్న ఇబ్బందుల పట్ల సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆవేదన

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా మళ్లీ వీడియో ద్వారా రోజువారీ కేసుల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... న్యాయవాదులకు కీలక సూచనలు చేసింది. కొందరు మొబైల్‌ ఫోన్ల ద్వారా విచారణలో పాల్గొంటుండటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సాయంత్రానికల్లా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

* ఇకపై న్యాయవాదులు, కేసుల్ని సొంతంగా వాదించుకొనే వ్యక్తులు వీడియో ద్వారా విచారణకు హాజరైనప్పుడు డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్‌ కంప్యూటర్‌, సుస్థిరమైన ఇంటర్‌నెట్‌తో అనుసంధానం కావాలి. విచారణ ప్రక్రియలో ఇబ్బందులు, న్యాయమూర్తులకు అసౌకర్యం కలిగించకుండా తీగ ఆధార నెట్‌వర్క్‌ను వాడటం మంచిది.

* మొబైల్‌ ఫోన్ల ద్వారా వీడియో సమావేశంలో పాల్గొనడం మానుకోవాలి.

* న్యాయవాదులు ఒకేసారి రెండు మూడు పరికరాల ద్వారా కాకుండా... ఒక్క ల్యాప్‌టాప్‌/డెస్క్‌టాప్‌లోనే లాగిన్‌ అయ్యి, విచారణలో పాల్గొనాలి. వాదనలు వినిపించేవారు హెడ్‌సెట్‌తో కలిపి ఉన్న మైక్రోఫోన్‌ లేదా ఆడియో సిస్టంను ఉపయోగించడం మంచిది.

*  విచారణ జరుగుతున్నప్పుడు ఆటంకాలు తలెత్తకుండా కంప్యూటర్‌లో ఉన్న మిగతా అప్లికేషన్లన్నింటినీ మూసివేయాలని రిజిస్ట్రీ పేర్కొంది.

10 కేసులు వాయిదా...

అంతకుముందు ఉదయం ఓ కేసు విచారణ సమయంలో మొబైల్‌ ఫోన్ల ద్వారా లాగిన్‌ అయిన న్యాయవాదులను చూడటం, వాదనలను వినడం ఇబ్బందికరంగా అనిపించడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు పది కేసులను వాయిదా వేయాల్సి రావడంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మొబైల్‌ ఫోన్ల ద్వారా హాజరయ్యే న్యాయవాదులు కనిపించడంలేదు. ఇకపై మొబైల్‌ ఫోన్లతో విచారణలో పాల్గొనడాన్ని నిషేధించాల్సి వస్తుంది. సుప్రీంకోర్టులో క్రమం తప్పకుండా వాదనలు వినిపించే మీరు వాదనల నిమిత్తం డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ను సమకూర్చుకోలేరా? ఉదయం నుంచి ఇలాంటి ఇబ్బందులే కొనసాగుతున్నాయి. కింది కోర్టుల్లో న్యాయవాదులు మొబైల్‌ ఫోన్లు వాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు ఐప్యాడ్‌, ల్యాప్‌ట్యాప్‌, డెస్క్‌టాప్‌ వంటి పరికరాలు ఎందుకు సమకూర్చుకోకూడదు?’’ అని ప్రశ్నించారు. ధర్మాసనం సమయం ముగిసేముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వెళ్తూ... అందరూ డెస్క్‌టాప్‌, ల్యాప్‌ట్యాప్‌ లాంటివి తప్పితే మొబైల్‌ ఫోన్లు వాడొద్దని న్యాయవాదులకు చెప్పండని కోర్టు సిబ్బందికి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని