పీఆర్సీ ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

పీఆర్సీపై ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీచేసిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. పీఆర్సీతో జీతాలు పెరగకపోగా.. ఇంకా తగ్గుతాయన్నాయి. ప్రభుత్వ

Published : 18 Jan 2022 05:01 IST

నిరసన కార్యక్రమానికి  పిలుపునిచ్చిన ఫ్యాప్టో

ఈనాడు, అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీచేసిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. పీఆర్సీతో జీతాలు పెరగకపోగా.. ఇంకా తగ్గుతాయన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులపై ఉద్యమించనున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించాలని డిమాండు చేశాయి.

మధ్యంతర భృతి కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ

మధ్యంతర భృతి కంటే తక్కువగా ప్రకటించిన ఫిట్‌మెంట్‌ను సవరించకుండా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నాం. ఇంటి అద్దె భత్యం తగ్గింపు తిరోగమన చర్య. గత 10 పీఆర్సీల్లో లేని సంప్రదాయాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనుదారులకు తీవ్ర నష్టం. ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.

- ఏపీ జేఏసీ కార్యదర్శి హృదయరాజు

చర్చలకు పిలిచి.. ఏకపక్ష నిర్ణయం

పీఆర్సీ పేరుతో ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి ఏకపక్షంగా నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాల ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా పీఆర్సీపై జీవోలను విడుదల చేసింది. హెచ్‌ఆర్‌ఏ తగ్గింపుతో ప్రతి ఉద్యోగికీ నష్టమే. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులను కేంద్ర వేతన సవరణ సంఘం పరిధిలోకి తీసుకెళ్లారు. మాస్టర్‌ స్కేల్‌ కంటే తక్కువగా సచివాలయ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ విధానాలపై అన్ని సంఘాలతో కలిసి పోరాటం తీవ్రతరం చేస్తాం.

- యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు, ప్రసాద్‌

ప్రభుత్వ ఉత్తర్వులు అప్రజాస్వామికం

పీఆర్సీపై ప్రభుత్వ ఉత్తర్వులు ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. హెచ్‌ఆర్‌ఏ రేట్లను తగ్గించడం వల్ల ఉద్యోగుల జీతాలు తగ్గుతాయి. ఇలా జీవోలు ఇవ్వడానికి వ్యతిరేకంగా 18న నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు విధులకు హాజరుకావాలి. సాయంత్రం 5 గంటలకు మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి పీఆర్సీపై ప్రభుత్వం జారీచేసిన జీవోలను దగ్ధం చేయాలి.

- ఫ్యాప్టో ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు

హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌ల తగ్గింపు బాధాకరం

ఈ పీఆర్సీ వల్ల ఫిట్‌మెంట్‌లో 4%, హెచ్‌ఆర్‌ఏలో 4% తగ్గటంతో ప్రస్తుతం పొందున్న జీతంలో పెరుగుదల ఉండదు. ఇంటి అద్దెలు పెరుగుతుంటే హెచ్‌ఆర్‌ఏ తగ్గించడం చోద్యంగా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తిరోగమనంలో ఉంది. దీంతోపాటు పదేళ్లకోసారి పీఆర్సీ అంటున్నారు. హెచ్‌ఆర్‌ఏ యథావిధిగా కొనసాగించాలి. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 30 శాతంగా ఇస్తూ.. ఎప్పటిలా ఐదేళ్లకే పీఆర్సీ ఇవ్వాలి.

- నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, శ్రీనివాసరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని