ప్రాజెక్టుల అనుమతులను వేగవంతం చేయండి

మౌలిక వసతుల కల్పనలో సమయమే అత్యంత విలువైన పెట్టుబడి అని.. ఏ ప్రాజెక్టు అయినా నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయకపోతే దేశ ప్రజలు మూల్యం

Published : 18 Jan 2022 05:01 IST

భూ సేకరణపై సమీక్షలు నిర్వహిస్తుండండి

మౌలిక వసతుల కల్పనలో సమయమే పెద్ద పెట్టుబడి

దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

ఈనాడు-దిల్లీ, అమరావతి, హైదరాబాద్‌: మౌలిక వసతుల కల్పనలో సమయమే అత్యంత విలువైన పెట్టుబడి అని.. ఏ ప్రాజెక్టు అయినా నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయకపోతే దేశ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. అయితే.. సమయానికున్న కచ్చితమైన విలువను అధికారులు అర్థం చేసుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం పీఎం గతిశక్తి కార్యక్రమంపై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల సదస్సును ఉద్దేశించి గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘‘పీఎం గతిశక్తి కార్యక్రమం వల్ల రాష్ట్రాల ఆదాయమూ పెరుగుతుంది. కేంద్రం ప్రతిపాదించే ప్రాజెక్టులకు సకాలంలో భూసేకరణ, పర్యావరణ అనుమతులు పూర్తి చేసేలా సీఎంలు చొరవ తీసుకోవాలి. భూసేకరణ విషయంలో రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులకు ఇబ్బంది లేదు. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా ముందుకు సాగి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు అయిదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిని సాధిద్దాం.

20 హైవేల్లో విమానాల అత్యవసర ల్యాండింగ్‌ సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నాం. దీనివల్ల ఈ రోడ్లను ఎయిర్‌పోర్టులు, హైవేలుగా ఉపయోగించడానికి వీలవుతుంది. రాష్ట్రాలు ఇక్కడ చిన్న విమానాశ్రయాలు అభివృద్ధి చేయొచ్చు. దేశవ్యాప్తంగా 30 చోట్ల మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌, అనంతపురం వద్ద వీటి ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు భూమి ఇస్తే.. ఈక్విటీ ఇస్తాం. మేం పెట్టుబడి పెట్టి పార్కులను అభివృద్ధి చేస్తాం’’ అని గడ్కరీ పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: మంత్రి గౌతమ్‌రెడ్డి

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.18వేల కోట్లతో మూడు పోర్టులు, 9 చేపల రేవులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో సరకు రవాణా, మౌలిక వసతులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.  పోర్టులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నాం. ఫైబర్‌ నెట్‌వర్క్‌తో అన్ని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేస్తున్నాం. ఉడాన్‌ కింద ప్రాంతీయ వాయు మార్గాల కనెక్టివిటీని పెంచుతున్నాం. భారతమాల కింద రహదారులను అనుసంధానం చేసి సరకు రవాణా మార్గాలను విస్తరించి రవాణా ఖర్చును తగ్గించాలన్నదే లక్ష్యం. మారిటైం ఆధారిత సంపద పెంచడానికి పోర్టుల్లో వసతులను కల్పిస్తున్నాం. మల్టీమోడల్‌ కార్గో హబ్‌లు, సహజ వాయువు పంపిణీ వ్యవస్థలను విస్తరించడం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగుళూరు, బెంగుళూరు-హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం...’’ అని వివరించారు. పీఎం గతిశక్తిని అమలు చేయడంలో సంబంధిత శాఖల మంత్రులు, పారిశ్రామికవేత్తల సలహాలు, సూచనలను మార్చి 22 నాటికి పంపాలని కేంద్రం పేర్కొంది. కేంద్రంతో సమన్వయం కోసం ప్రతి రాష్ట్రం నుంచి ఒక నోడల్‌ అధికారిని నియమించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని