చెరువులోకి దూసుకెళ్లిన కారు..

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామ చెరువులోకి ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం

Updated : 18 Jan 2022 06:32 IST

యర్రబాలెంలో నలుగురి దుర్మరణం

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామ చెరువులోకి ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. సోమవారం రాత్రి సుమారు 8.15 గంటలకు జరిగిన ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో ముగ్గురు మంగళగిరికి, ఒకరు యర్రబాలేనికి చెందినవారు. కృష్ణాయపాలెం నుంచి మంగళగిరికి వస్తుండగా యర్రబాలెం చెరువు మలుపు వద్దకు రాగానే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. మృతులు సాయి, శ్రీనివాస్‌, నరేంద్రకుమార్‌, తేజరాంజీ. వీరంతా 22 నుంచి 35 ఏళ్లలోపు వయస్కులు. నలుగురూ కారులోనే ఊపిరాడక చనిపోయారు. చెరువులోకి కారు దూసుకెళ్లడం గమనించిన స్థానికులు వెంటనే లోపలికి దిగి కారు అద్దాలు పగలగొట్టి వారిని బయటకు తీసినా, అప్పటికే వారు మృతిచెందారు.

వంద కిలోమీటర్ల వేగం?

ప్రమాద ప్రదేశంలో భారీ మలుపు ఉండడం, అక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేకపోవడం, చిమ్మచీకటిగా ఉండడంతో కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కారు స్పీడోమీటరు 100 వద్ద ఆగి ఉంది. మృతుల్లో ఇద్దరు దస్తావేజు లేఖర్ల వద్ద టైపిస్టు ఉద్యోగాలు చేస్తుండగా, ఒకరు వడ్రంగి పని మరొకరు ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తారని తెలిసింది. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే మంగళగిరి రూరల్‌ పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు చెరువు వద్దకు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది కారును బయటకు తీశారు. మృతదేహాలను ఎన్నారై ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని