పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి కన్నుమూత

పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి (88) ఆదివారం రాత్రి గుండెపోటుతో స్వగృహంలో కన్నుమూశారు. 1934లో ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జన్మించిన శాంతిదేవి ఇంటర్మీడియట్‌

Published : 18 Jan 2022 05:01 IST

అనాథలకు తల్లిగా, సమాజ సేవకురాలిగా గుర్తింపు

ప్రధాని మోదీ సంతాపం

గుణుపురం, న్యూస్‌టుడే: పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి (88) ఆదివారం రాత్రి గుండెపోటుతో స్వగృహంలో కన్నుమూశారు. 1934లో ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జన్మించిన శాంతిదేవి ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నారు. 1951లో రతన్‌దాస్‌ను వివాహం చేసుకున్నారు. ఆ ఏడాదే అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో తీవ్రమైన కరవు రావడంతో బాధితులకు అండగా నిలవాలని భర్తతో అక్కడికి చేరుకుని సేవలందించారు. ఈ సమయంలోనే వినోబాభావే భూదాన్‌ ఉద్యమంలో భాగమయ్యారు. పెత్తందార్ల చేతిలో ఉన్న భూములను పేదలకు పంచడం, కుష్ఠు రోగులకు సేవ చేయడం, గిరిజన బాలికలకు చదువు చెప్పడం, అనాథ బాలికలను చేరదీసి వసతి కల్పించి ప్రయోజకులను చేయడం చేసేవారు. రాయగడ జిల్లాలోని గుణుపురంలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న శాంతిదేవి.. భర్త మరణించినా సేవలు కొనసాగించారు. సేవాసమాజ్‌ పేరిట ఆశ్రమాలు నెలకొల్పి వందలాది అనాథ బాలికలు, మహిళల భవిష్యత్తును తీర్చిదిద్దారు. సోమవారం ఆమె పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. జీవిత కాలంలో ఎన్నో పురస్కారాలు పొందిన శాంతిదేవి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2021 నవంబరులో పద్మశ్రీతో సత్కరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. నిస్వార్థమైన సమాజ సేవ చేసిన మీ మరణ వార్త విని దుఃఖిస్తున్నానని ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని