రాష్ట్రంలో 4,108 మందికి కరోనా

రాష్ట్రంలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 22,882 నమూనాలను పరీక్షించగా... 4,108 కేసులు బయటపడ్డాయి. దీంతో పాజిటివిటీ రేటు 17.95%గా

Published : 18 Jan 2022 05:01 IST

కడప రిమ్స్‌లో 50 మంది విద్యార్థులకు పాజిటివ్‌

చిత్తూరు జిల్లాలో 52 మంది

ఉపాధ్యాయులకు కొవిడ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 22,882 నమూనాలను పరీక్షించగా... 4,108 కేసులు బయటపడ్డాయి. దీంతో పాజిటివిటీ రేటు 17.95%గా నమోదైంది. ఈ నెల 1న పాజిటివిటీ రేటు 0.57%గా నమోదైంది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 1,018, చిత్తూరు జిల్లాలో 1,004 కేసులు బయటపడ్డాయి. తక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో 46, కర్నూలు జిల్లాలో 85 చొప్పున కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కొవిడ్‌ వల్ల ఒక మరణం కూడా నమోదు కాలేదు. ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జి అయినవారు 696 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,182 క్రియాశీలక కేసులు ఉన్నాయి.

* విజయవాడ జీజీహెచ్‌లో వైద్యులు, ఇతర సిబ్బంది కుటుంబసభ్యులు కలిపి 50 మందికి వైరస్‌ సోకింది. విశాఖ కేజీహెచ్‌లోనూ 20 మంది వైద్యులు, సిబ్బందికి కొవిడ్‌ సోకినట్లు తెలిసింది.
* రాష్ట్ర సచివాలయంలో ఐదుగురు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. సోమవారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో మొదటి బ్లాక్‌లో పనిచేసే నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆర్థికశాఖలో పనిచేసే మరో ఉద్యోగికీ కరోనా సోకినట్లు తెలిసింది.

లోకేశ్‌, రామకృష్ణలకు పాజిటివ్‌

తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌  వేదికగా  సోమవారం ప్రకటించారు. తాను హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.


50 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్‌

కడప (నాగరాజుపేట), న్యూస్‌టుడే: కడప రిమ్స్‌ వైద్యకళాశాలలో 50 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరికొందరి ఫలితాలు రావాల్సి ఉంది. వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వరలక్ష్మి మాట్లాడుతూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


చిత్తూరులో 52 మంది ఉపాధ్యాయులకు..

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటిరోజే సోమవారం చిత్తూరు జిల్లాలో వేర్వేరు పాఠశాలల్లో 52 మంది ఉపాధ్యాయులు, ఓ విద్యార్థికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


షార్‌లో 92 మందికి పాజిటివ్‌

శ్రీహరికోట, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట సతీశ్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ షార్‌లో సోమవారం 92 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది.


పుట్టపర్తిలో తాత్కాలికంగా వైద్యసేవల నిలిపివేత

పుట్టపర్తి, న్యూస్‌టుడే: పుట్టపర్తి సత్యసాయి ఆసుపత్రిలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యసేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి డైరెక్టర్‌ గురుమూర్తి తెలిపారు.


నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ
రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకూ..

రాష్ట్రంలో మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయనున్నారు. వివాహాలు, మతపరమైన కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే గరిష్ఠంగా 200 మంది, హాళ్లలో అయితే 100 మందే హాజరుకావాలి. సినిమా థియేటర్లలో ఒక సీటు వదిలి మరో సీటులో కూర్చోవాలి. అంతర్‌రాష్ట్ర, రాష్ట్ర సరకు రవాణా వాహనాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్నవారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలి. లేకుంటే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్లను పరిస్థితి తీవ్రత ఆధారంగా ఒకటి లేదా రెండు రోజుల వరకు మూసివేయించే అధికారం అధికారులకు ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని