ఇంటి అద్దె భత్యంలో భారీ కోత

ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)లో భారీ కోత పడింది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో 20%,

Published : 18 Jan 2022 05:01 IST

హెచ్‌ఆర్‌ఏను తగ్గించిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)లో భారీ కోత పడింది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో 20%, పురపాలిక సంఘాలు, 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో 14.5%, మిగతా ప్రాంతాల్లో 12% ఇస్తున్నారు. కొత్త విధానంలో 50 లక్షల జనాభాకు మించి ఉన్న నగరాల్లో 24%, 5-50 లక్షల జనాభా ఉంటే 16%, మిగతా ప్రాంతాలు, ఐదు లక్షల వరకూ జనాభా ఉండే చోట 8శాతం హెచ్‌ఆర్‌ఏను తీసుకొచ్చింది. 50లక్షలకు పైగా జనాభా ఉన్న నగరం ఏపీలో ఒక్కటీ లేదు. దిల్లీ, హైదరాబాద్‌ నగరాల్లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే వారికి మాత్రమే 24శాతం వర్తిస్తుంది. విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, విజయవాడ నగరపాలక సంస్థలతో పాటు వెలగపూడి సచివాలయంలో పని చేసే వారికి 16శాతం, ఇతర ప్రాంతాల్లో పని చేసే వారికి 8శాతం వస్తుంది. కేంద్ర ప్రభుత్వ హెచ్‌ఆర్‌ఏ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు.

సచివాలయ ఉద్యోగులకు 14శాతం కోత..

హైదరాబాద్‌ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం 30 శాతం హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటుండగా.. కొత్త విధానం ప్రకారం వారికి 16శాతం మాత్రమే వస్తుంది. జనవరి వేతనంలో తగ్గిపోతుంది. ఒక్కో ఉద్యోగి 14శాతం నష్టపోతారు. ఈ మేరకు వేతనాల్లో కోత పడుతుంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన విభాగాధిపతి కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకూ తగ్గిపోనుంది. ప్రస్తుతం వీరు 30శాతం తీసుకుంటుండగా.. శాఖాధిపతుల కార్యాలయాలు ఉన్న ప్రాంతాన్ని అనుసరించి 16శాతం, 8శాతం ఇవ్వనున్నారు. దీంతో వారికి 14శాతం నుంచి 22శాతం వరకు తగ్గిపోతుంది. సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా 16శాతం హెచ్‌ఆర్‌ఏను ఉత్తర్వుల్లో ప్రస్తావించగా.. శాఖాధిపతుల కార్యాలయాలకు స్థిర మొత్తాన్ని పేర్కొనలేదు.

పురపాలికల్లో శాఖాధిపతి కార్యాలయాలు..

విజయవాడ, గుంటూరు జిల్లాల్లో చాలా శాఖాధిపతి కార్యాలయాలు తాడేపల్లి, ఇబ్రహీంపట్నం పురపాలక సంఘాలు, ఈడ్పుగల్లు, గొల్లపూడి లాంటి పంచాయతీల పరిధిలో ఉన్నాయి. ఇలాంటి చోట 8శాతం మాత్రమే హెచ్‌ఆర్‌ఏ వస్తుంది. ఇప్పటివరకు 30శాతం తీసుకున్న ఉద్యోగులకు జనవరి నుంచి ఇచ్చే వేతనంలో 8శాతం మాత్రమే ఇస్తారు. ఈ లెక్కన వారు 22శాతం నష్టపోతారు. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల పరిధిలోని వారికి 14శాతం తగ్గిపోతుంది.

* రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల పరిధిలో పని చేసే ఉద్యోగులకు ప్రస్తుతం 20శాతం ఇస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, విజయవాడల్లో పని చేసే వారికి మాత్రమే 16శాతం వస్తుంది. ఈ నగరాల్లో పని చేసే వారు 4శాతం హెచ్‌ఆర్‌ఏను కోల్పోతారు. మిగతా జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో పని చేసే వారికి 8శాతం మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకారం వారు 12శాతం నష్టపోతారు.

* 50వేలకుపైగా జనాభా ఉన్న పురపాలక సంఘాల పరిధిలో 14.5శాతం ఇస్తున్న హెచ్‌ఆర్‌ఏ స్థానంలో 8 శాతం మాత్రమే వస్తుంది. అయా ఉద్యోగులు 6.5శాతం నష్టపోతారు.

* గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం 12శాతం ఇస్తుండగా.. ఇక నుంచి 8శాతం మాత్రమే వస్తుంది. అయా ప్రాంతాల్లో పని చేసే వారు 4శాతం నష్టపోతారు. 

నగర భత్యం (సీసీఏ) రద్దు

నగర భత్యాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడల్లో ఉన్న వారికి నెలకు రూ.250-700 వరకు సీసీఏ ఇస్తుండగా.. మిగతా ప్రాంతాల్లో రూ.200-రూ.500 వరకు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, చాలా రాష్ట్రాలు దీన్ని నిలిపివేసినందున ఏపీలోనూ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని